
- ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించాలి
నల్గొండ, వెలుగు : తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ విలన్ ఎట్ల అయిందో కేసీఆర్ చెప్పాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోనియా కృషితోనే తెలంగాణ ఏర్పాటు సాధ్యమైందని గతంలో చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు రాష్ట్రాన్ని నాశనం చేసింది కాంగ్రెస్సే అనడం సరికాదన్నారు. తెలంగాణ కోసం కేసీఆర్ చేసిన పోరాటాన్ని కాదనలేమని.. అందుకే ప్రజలు పదేండ్లు అధికారం ఇచ్చారన్నారు. అందరి పోరాటాన్ని గుర్తించాలని చెప్పిన గుత్తా ఉద్యమ సమయంలో తనను కూడా సస్పెండ్ చేసినట్లు గుర్తు చేశారు.
గురువారం నల్గొండలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. జనగణన టైంలో కులగణన చేయాలన్న కేంద్ర నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. అయితే వివిధ రాష్ట్రాల్లో సామాజిక నేపథ్యాల కారణంగా కులాల రిజర్వేషన్ అమల్లో ఉందని, ఈ అంతరాన్ని ఎలా తొలగిస్తారో కేంద్రం స్పష్టతనివ్వాలని కోరారు. పహెల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌తో తాడోపేడో తేల్చుకోవాలన్న అభిప్రాయం ప్రజల్లో కనిపిస్తున్నదని, అయితే పాక్‌తో యుద్ధం కంటే ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించడం మేలని అభిప్రాయపడ్డారు.
పాకిస్తాన్ తమ భూభాగంలో ఉన్న ఉగ్రవాదులను భారత్‌కు అప్పగించాలని డిమాండ్ చేశారు. పాక్ ప్రభుత్వ నేతల మాటలు రెచ్చగొట్టేలా ఉన్నాయని మండిపడ్డారు. నియోజకవర్గాల పునర్విభజన హామీని అమలు చేసేలా బీజేపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రాల పట్ల కేంద్రం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందన్నారు. చాలా సందర్భాల్లో ప్రజాప్రతినిధులకు ప్రొటోకాల్ ఉల్లంఘన జరుగుతోందని, ఈ వివాదాలు తలెత్తకుండా చూసుకోవాలన్నారు. ఎస్‌ఎల్‌సీబీ త్వరలోనే పూర్తవుతుందని, ప్రమాదం కారణంగా కొంత అలస్యం జరిగే అవకాశం ఉందన్నారు. నిపుణుల కమిటీ సూచనల ప్రకారం టన్నెల్‌లో పనులు జరిపేలా ప్రణాళికలు చేస్తున్నామన్నారు.