
- శివారు ప్రాంతాల్లో తిరుగుతుండడంతో భయాందోళనలో ప్రజలు
- సమాచారం వచ్చిన వెంటనే ట్రాప్ కెమెరాలు, బోన్లు ఏర్పాటు చేస్తున్న ఫారెస్ట్ ఆఫీసర్లు
మహబూబ్‌నగర్, వెలుగు: చిరుత పులుల హడలెత్తిస్తున్నాయి. కొండలు, గుట్ట ప్రాంతాలకు దగ్గరగా ఉన్న పల్లెలు, శివార్లలో తరచూ కనిపిస్తున్నాయి. రాత్రిళ్లు ఆ ఏరియాల్లో వేటకు వచ్చే చిరుతలు.. కుక్కలు, అడవి పందులు, దూడలను చంపి తింటున్నాయి. ఈ క్రమంలో రాత్రిళ్లు బయటకు వచ్చేందుకు ప్రజలు జంకుతున్నారు.
15 వరకు చిరుతలు..
పాలమూరు జిల్లాలో మహబూబ్‌నగర్, మహమ్మదాబాద్ ఫారెస్ట్ రేంజ్‌లు ఉన్నాయి. ఈ రేంజ్‌ల పరిధిలో దాదాపు 15 వరకు చిరుత పులులు ఉంటాయని ఫారెస్ట్ ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. ఈ రెండు రేంజ్ ల పరిధిలో మహబూబ్‌నగర్, గండీడ్, హన్వాడ, మహమ్మదాబాద్, కోయిల్‌కొండ, నవాబుపేట ఏరియాల్లో గుట్టలు, కొండలు ఎక్కువగా ఉండడంతో.. ఇతర ప్రాంతల నుంచి వస్తున్న చిరుతలు ఇక్కడే ఉండిపోతున్నాయి. అలాగే ప్రస్తుతం చిరుతల మేటింగ్ టైమ్ కావడంతో.. అవి గుట్టలు ఎక్కువగా ఉండే ప్రాంతాలను ఆవాసాలుగా చేసుకుంటున్నాయి. పంట పొలాల్లో కాపలా కోసం పెంచుకున్న కుక్కులు, పొలాల వద్ద పాకల్లో కట్టేసిన దూడలపై దాడులు చేసి చంపుతున్నాయి. వాటిని గుట్టలు, కొండలపైకి లాక్కెళ్లి తింటున్నాయి.
దీంతో ఆ ప్రాంతాల్లో ఉండే రైతులు, ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పొలాలకు వెళ్లేందుకు జంకుతున్నారు. అయితే చిరుతలు కనిపించిన వెంటనే ప్రజలు అలర్ట్ అవుతున్నారు. వాటి జోలికి వెళ్లకుండా ఫొటోలు, వీడియోలు తీసి వెంటనే ఫారెస్ట్ ఆఫీసర్లకు సమాచారం అందిస్తున్నారు. ఆఫీసర్లు చిరుతలు తిరిగిన ప్రాంతాల్లో పాద ముద్రలు సేకరించి, వాటి కదలికలను తెలుసుకునేందుకు ట్రాప్ కెమెరాలు, వాటిని బంధించేందుకు బోన్లను ఏర్పాటు చేస్తున్నారు. అయితే అవి ఒకటి, రెండు రోజులు చూసి తెలివిగా తప్పించుకుంటున్నాయని ఫారెస్ట్ ఆఫీసర్లు చెబుతున్నారు.
రోజుకు వంద కిలోమీటర్లు..
- చిరుతలు వేగంగా కదులుతాయి. ఈ క్రమంలో అవి అడవిలో రోజుకు 70 కిలోమీటర్ల నుంచి వంద కిలోమీటర్ల మేర ప్రయాణం చేస్తాయి. వేట కోసం ఒక ప్రాంతంలోకి వస్తే.. ఐదారు రోజులు ఆ పరిసర ప్రాంతాల్లోనే తిరుగుతున్నాయి. ఈ క్రమంలో అక్కడే ఉండే గుట్టల్లో దాక్కుంటాయి. ఒకసారి దేనినైనా వేటాడితే.. మూడు రోజుల వరకు వేటకు వెళ్లవని ఫారెస్ట్ ఆఫీసర్లు చెబుతున్నారు. అయితే ఇటీవల అటవీ ప్రాంతాల్లో జన సంచారం ఎక్కువైంది. పల్లెల శివార్లలోని అటవీ ప్రాంతాల్లో కూడా వ్యవసాయం పెరుగుతోంది. దీనికితోడు వన్యప్రాణులు తగ్గిపోతున్నాయి. ఈ క్రమంలో చిరుతలకు అటవీ ప్రాంతంలో ఆహారం దొరక్క గ్రామ శివార్లకు వస్తున్నట్లు ఫారెస్ట్ ఆఫీసర్లు చెబుతున్నారు.
- మూడు రోజుల కింద మహమ్మదాబాద్ మండలం గాధిర్యాల్ గ్రామ సమీపంలో ఉన్న కొనెంగల గుట్ట వద్ద రైతులకు చిరుత కనిపించింది. ఉదయం, సాయంత్రం వేళల్లో గుట్ట పైభాగంలో ఉండడాన్ని చూసిన రైతులు ఆఫీసర్లకు సమాచారం అందించారు. దీంతో వారు ఆదివారం పాదముద్రలుసేకరించే ప్రయత్నం చేశారు. దాని కదలికలను కనుగొనేందుకు సోమవారం ట్రాప్ కెమెరాలను కూడా ఏర్పాటు చేయనున్నారు. రాత్రిళ్లు గుట్టల సమీపంలోని వ్యవసాయ పొలాలకు రైతులు ఒంటరిగా వెళ్లవద్దని, పశువులు, జీవాలను ఇంటి వద్దే కట్టేసుకోవాలని చాటింపు వేయించారు.
- గత సోమవారం ఉదయం ఏడున్నర గంటల ప్రాంతంలో మహబూబ్‌నగర్ నగరం పరిధిలోని వీరన్నపేటలోని హెచ్ఎన్ ఫంక్షన్ హాల్ వెనక ఉన్న గుట్టపై చిరుత కనిపించింది. దీనినివీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ ఆఫీసర్లు ఆ ప్రాంతాన్ని పరిశీలించి, స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. తిరిగి బుధవారం అదే గుట్ట వద్ద మళ్లీ చిరుత కనిపించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
- కొద్ది రోజుల కింద మహబూబ్‌నగర్ శివారులోని అప్పన్నపల్లి సమీపంలోని గోల్ బంగ్లా వద్ద టూరిస్టులకు కూనలతో ఉన్న చిరుత కనిపించింది. మయూరి పార్క్‌కు వచ్చిన మరికొందరికి కూడా సఫారీ టైంలో కూనలతో ఉన్న చిరుతలు కనిపించాయి.
ఎప్పటి నుంచో ఉన్నాయి..
మహబూబ్‌నగర్, మహమ్మదాబాద్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలో ఎప్పటి నుంచో చిరుతలు ఉన్నాయి. ప్రస్తుతం వాటి సంతతి పెరిగింది. అయితే పెద్ద పులులను సెన్సెస్ చేసినట్లు చిరుతలకు చేయరు. మాకున్న లెక్క ప్రకారం ఈ రెండు రేంజ్‌ల పరిధిలో 15 చిరుతలు ఉంటాయని అంచనా ఉంది. ఇవి ఒకే ప్రాంతంలో ఉండవు. తిరుగుతూనే ఉంటాయి. ఎక్కడైనా వీటితో ఇబ్బంది ఉందని ఫిర్యాదు వస్తే బోన్లు ఏర్పాటు చేస్తాం.
సత్యనారాయణ, డీఎఫ్‌వో, మహబూబ్‌నగర్