
తిరుమల: తిరుమల అలిపిరి నడకదారిలో మరోసారి చిరుతల సంచారం కలకలం రేపుతోంది. గతంలో భక్తులపై దాడి, ప్రాణాలు పోయిన ఘటనలు చోటు చేసుకున్నాయి. అప్పట్లో 6 చిరుతలను బోనులో బంధించి సుదూర ప్రాంతంలో వదిలిపెట్టారు. అయితే మళ్ళీ ఇటీవల తరచూ చిరుతల సంచారం అలజడి రేపుతోంది. వరుస ఘటనలతో భక్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో టీటీడీ అప్రమత్తమైంది. చిరుత కోసం గాలింపు చర్యలు చేపట్టారు అధికారులు. భక్తుల భద్రతే ధ్యేయంగా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
తిరుమలలో చిరుతల సంచారంతో మళ్ళి భక్తులలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అటు అలిపిరి నడకదారి, ఇటు మొదటి, రెండవ ఘాట్ రోడ్లలో తరచూ చిరుతలు కలకలం రేపుతున్నాయి. గతంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో టిటిడి అప్రమత్తమైంది. దీంతో నివారణ చర్యలపై తిరుమలలో టీటీడీ ఉన్నతాధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు.
టీటీడీ ఈవో శ్యామలరావు వర్చువల్‌గా పాల్గొనగా, అదనపు ఈఓ వెంకయ్య చౌదరి, టిటిడి ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో టీటీడీ అటవీ శాఖ, అటవీ శాఖ, వివిధ విభాగాల అధికారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సుధీర్ఘంగా చర్చించారు. వెంటనే తీసుకోవాల్సిన తాత్కాలిక జాగ్రత్తలతో పాటు, దీర్ఘకాలికంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
అలిపిరి మెట్ల మార్గంలో భక్తుల భద్రత కోసం అదనపు సిబ్బందిని కేటాయించాలని టీటీడీ నిర్ణయించింది. అలాగే నడక మార్గంలో చెత్తను ఎప్పటికప్పుడు ఆరోగ్యశాఖ ద్వారా తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. టీటీడీ అటవీ శాఖ, రెవెన్యూ, పంచాయతీ రాజ్, ఆరోగ్య, విజిలెన్స్ శాఖలతో కలిసి అటవీ శాఖ సమన్వయంతో నడక మార్గంపై నిరంతర జాయింట్ డ్రైవ్ నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే మానవ వన్యప్రాణి ఘర్షణను నివారించేందుకు అటవీశాఖ, వైల్డ్ లైఫ్ ఇన్‌స్టిట్యూ్ట్ ఆఫ్ ఇండియా సంస్థల సహకారం తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.
►ALSO READ | ఎన్టీఆర్ ఏఐ వీడియో: భళా లోకేష్ మనవడా అంటూ పొగడ్తలు
మరోవైపు అలిపిరి మెట్ల మార్గాన్ని చిరుత రహిత మార్గంగా మార్చేందుకు బయో ఫెన్సింగులు, కెమెరా ట్రాపులు, స్మార్ట్ స్టిక్స్‌తో పాటుగా.. నెట్ గన్స్, హై ఫ్లాష్ టార్చులు, పెప్పర్ స్ప్రేలు వంటి రక్షణ పరికరాలు ఉపయోగించాలని టీటీడీ సమీక్షా సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అలాగే నిషేధిత ఆహార పదార్థాల అమ్మకంపై దుకాణదారులకు ఆంక్షలు, అవగాహన కల్పించాలని నిర్ణయించారు.
చిరుత సంచారం నేపథ్యంలో అలిపిరి మెట్ల మార్గంలో ఏడవ మైలు నుంచి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వరకు 2.5 కిలోమీటర్ల మేర పటిష్ట భద్రత కల్పించాలని, నిఘాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రతి నెలా ఇలాంటి సమీక్షా సమావేశం నిర్వహించి కార్యాచరణ ప్రణాళికల పురోగతిని సమీక్షించుకోవాలని టీటీడీ ఉన్నతాధికారుల సమీక్షా సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.