ఖల్సా భూములు.. యాజమాన్య విధానాలు

ఖల్సా భూములు.. యాజమాన్య విధానాలు

అసఫ్​జాహీల పాలనా కాలంలో మొత్తం జనాభాలో 68 శాతం ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవించేవారు. ఫలితంగా వ్యవసాయ ఉత్పత్తులు చాలా వరకు భూయజమానులు, భూమిని దున్నేవారి మధ్య సంబంధాలు, భూమిని స్వయంగా దున్నేవారి హక్కులు, హోదాతో ప్రభావితమయ్యాయి. అయితే, భూయాజమాన్య విధానాలతో పాటు భూమి శిస్తు పాలనా విధానం, రైతుల పరిస్థితి మీద, వారి ఉత్పత్తి పరిమాణం మీద విశేష ప్రభావాన్ని చూపాయి. ఈ నేపథ్యంలో  హైదరాబాద్​ రాష్ట్రంలోని ఖాల్సా భూములు, వాటి యాజమాన్య విధానాల గురించి తెలుసుకుందాం. 

ప్రభుత్వాధికారుల ప్రత్యక్ష నిర్వహణ, పన్ను ఆదాయం ప్రభుత్వ ఖజానాలో జమ చేస్తూ ప్రభుత్వ ఆస్తిగా ఉన్న భూములు. అలాంటి భూములు దివాన్​ లేదా రాజ్య ప్రధాన మంత్రి ప్రత్యక్ష పాలనలో ఉండటం, వీటిని దివానీ భూములుగా వ్యవహరించారు. వీటినే ఖాల్సా భూములని కూడా పిలిచారు. ఖాల్సా అంటే రాష్ట్రం ప్రత్యక్షంగా కలిగి ఉన్న భూములని అర్థం. మొత్తం రాష్ట్ర విస్తీర్ణమైన 82,698 చ.మై.లో ఈ ప్రభుత్వ భూములు 54.8శాతం ఉన్నాయి.  ఏ భూముల ఆదాయమైతే పూర్తిగా గాని, పాక్షికంగా గాని, ఏదో ఒక ప్రత్యేక పని లేదా ప్రయోజనానికి నియంత్రీకరించడం. పై రెండు తరగతుల్లో ఉదహరించిన భూములు తిరిగి రెండు భాగాలుగా విభజించారు. ఎ. ఏ భూములైతే నిజాం ఆస్తిగా పరిగణించబడి, వాటి ఆదాయం ఆయన భరణంగా ఉంటుందో అలాంటి భూములు సర్ఫేఖాస్​ భూములుగా పిలుస్తారు. బి. ఏ భూములైతే ప్రభుత్వ గ్రాంట్ల ద్వారా ఇస్తారో వేటి నుంచైతే వచ్చే ఆదాయం పూర్తిగా జాగీర్​ గాని, ఈనామ్ గా గాని, ఒక వ్యక్తికి గాని లేదా కొందరు వ్యక్తులకు గాని నియంత్రీకరించడం జరిగిందో అలాంటి ప్రభుత్వేతర భూములు, రాష్ట్ర మొత్తం విస్తీర్ణంలో 45.2శాతం ఉన్నాయి. 
దివాని/ ఖాల్సా  భూముల ఇతర యాజమాన్య విధానాలు: పట్టేదారి , పోట్​ పట్టేదారి, షిక్మిదారి, అసమి షిక్మి

బొంబాయి విధానం అమలు 

దివాని గ్రామాల్లో రైత్వారీ భూ యాజమాన్య విధానం విస్తృతంగా అమలులో ఉంది. ఇది రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్య యాజమాన్య విధానంగా నెలకొంది. మొత్తం విస్తీర్ణంలో 50శాతం పైబడి, ఏ భూ యజమానులైతే ఎలాంటి ప్రత్యేక భూ మంజూరు కాని లేదా ఏ ఇతర ప్రత్యేక హక్కును లేనివారు, దీనికి చెందినవారుగా ఉన్నారు. ఈ విధానం కింద 20 మిలియన్ల ఎకరాలకు పైబడిన భూమి నిర్వహించబడుతుంది. ఈ యాజమాన్య విధానం ప్రకారం నిర్దేశిత భూమి శిస్తును చెల్లించినంత కాలం ఒక పట్టేదారుడు స్వేచ్ఛగా తన భూమిని అనుభవించొచ్చు. ప్రజా ప్రయోజనానికి అవసరమైతే తప్ప, అతడిని అతని భూమి నుంచి తొలగించే వీలు లేదు. అలా అవసరమైతే భూ సేకరణ చట్ట అంశాలను అనుసరించి, ఆ పట్టేదారునికి నష్టపరిహారాన్ని చెల్లించి, అతడి భూమిని సేకరించొచ్చు. అయితే సెటిల్​మెంట్​ కాలపరిమితి పూర్తయిన తర్వాత పట్టేదారు సవరించిన శిస్తు రేట్లను అంగీకరించాలి. అలా ఆమోదించినట్లయితే అతడు తన భూమిని వదులుకోవాల్సి వస్తుంది.

ఖాల్సా భూ యాజమాన్య విధానాలు 

రైత్వారీ భూ యాజమాన్య విధానాలతో పాటు పన్​మక్త, తహుద్​ లేదా సర్బస్త, ఇజార, అగ్రహార్​ అనే నాలుగు ఇతర భూ యాజమాన్య విధానాలు ఉన్నాయి. ఈ రైత్వారీయేతర  భూ యాజమాన్యాధిపతులు భూస్వాములుగా గాని లేదా ధనం, అధికారం ఉన్న అధికారులుగా ఉండటం వల్ల, రైతులు, కౌలుదార్లు, ఇతర గ్రామీణ ప్రజల ఆర్థిక పరిస్థితి, వీరి పనితీరు వల్ల విశేషంగా ప్రభావితమైంది. అనేక గ్రామాల యాజమాన్య హక్కులు ఒక వ్యక్తి చేతిలో ఉండటమనే విషయం, విపరీతమైన భూముల అధికార కేంద్రీకరణకు దారి తీసింది. ఇది వారు పలు రకాల దౌర్జన్యాలకు దిగేటట్లు ప్రోత్సహించడంతో స్థానిక ప్రజల జీవితం దుర్భర దీనావస్థగా మారింది.

రైత్వారీ యాజమాన్య విధానాలు 

రైత్వారీ భూ యాజమాన్య విధానంలో ప్రభుత్వానికి, భూ యజమానికి మధ్య, మధ్యవర్తిని గుర్తించనప్పటికీ, భూ యజమాని ఎప్పుడూ భూమిని నేరుగా దున్నేవాడు కాదు. ఒప్పందం లేదా ఆచారం ఆధారంగా భూ యజమాని కంటే తక్కువ హోదా గల కొన్ని భూ యాజమాన్య విధానాలు రైత్వారీ గ్రామాల్లో నెలకొన్నాయి. 

1. పట్టేదారిలో భూమిని పొందిన వ్యక్తి లేదా యజమాని, స్వయంగా గాని లేదా వేతనంపై పనిచేసే కార్మికుల ద్వారా గాని సేద్యం చేస్తారు. ఈ భూ యాజమాన్య విధానంలో యజమాని లేదా పట్టేదారు, తానే స్వయంగా సేద్యం చేస్తూ నిర్ణయించిన భూమి శిస్తును చెల్లిస్తున్నంత కాలం, అతని భూమి హక్కుల్లో ఎలాంటి జోక్యం చేసుకోరు. 

2. పోట్​పట్టేదారిలో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది రైతులు సమాన భాగస్వామ్య సూత్రం ఆధారంగా కలిసి సేద్యాన్ని నిర్వహిస్తారు. ఈ భూ యాజమాన్య విధానంలో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది రైతులు సమాన భాగస్వామ్య సూత్రం ఆధారంగా కలిసి పనిచేస్తారు. పోట్​ పట్టేదారును భూమి నుంచి వెళ్లగొట్టడం గాని లేదా అతడు చెల్లించే భూమి శిస్తును పెంచడం గాని పట్టేదారు చేయరాదు. వ్యవసాయిక పెట్టుబడులు స్వల్పంగా లేదా చాలినంత లేకపోవడం వల్ల రైతులు ఇలాంటి భూ యాజమాన్య విధానాన్ని ఎంచుకున్నారు. అయినా ఈ విధానం ఎక్కువ ప్రాంతాల్లో అమల్లో లేదు. 

3. షిక్మిదారిలో యజమాని తన భూమిని కొన్ని షరతులకు లోబడి నేరుగా దున్నేవారికి ఇస్తారు. ఇలాంటి రైతులను షిక్మిదార్లని వ్యవహరిస్తారు. మీరు ఎంతకాలమైతే భూ యజమానితో చేసుకొన్న ఒప్పందం అంశాలను  అమలు చేస్తారో, అంతవరకు వీరిని భూమిని నుంచి వెళ్లగొట్టడానికి వీల్లేదు. 

4. అసమి షిక్మీలు ఎప్పుడైనా భూమి నుంచి వెళ్లగొట్టే కౌలుదార్లు.