
- హాజరుకానున్న జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్, మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి
- ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, అధికారులు
నల్గొండ అర్బన్, వెలుగు : ఉమ్మడి నల్గొండ జిల్లా సమీక్షా సమావేశం బుధవారం నల్గొండలోని కలెక్టరేట్ లోఉదయం 10.45 నిమిషాలకు ప్రారంభమవుతుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. ఈ మీటింగ్ సంబంధించిన ఏర్పాట్లను మంగళవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమీక్షా సమావేశానికి జిల్లా ఇన్చార్జి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తాసుఖేందర్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నట్లు వివరించారు. ఈ సమావేశానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఆయా జిల్లాలవారీగా సమీక్షించే అంశాలపై నోట్స్ తయారీ, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తదితర ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని అధికారులకు చెప్పారు. సమీక్ష అనంతరం మధ్యాహ్నం 3.30 గంటలకు టీటీడీసీ వద్ద నూతనంగా నిర్మించిన ఆర్ అండ్ బీ ఎస్ఈ కార్యాలయాన్ని మంత్రులు ప్రారంభిస్తారని తెలిపారు. సాయంత్రం 4 గంటలకు తిరిగి హైదరాబాద్ బయల్దేరి వెళ్తారని చెప్పారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ జె.శ్రీనివాస్ తో కలిసి నూతన ఎస్ఈ కార్యాలయాన్ని ఆమె సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం జాతీయ డాక్టర్ల దినోత్సవం సందర్భంగా నల్గొండ కలెక్టరేట్లో ఉత్తమ సేవలందించిన డాక్టర్లను శాలువాలు, జ్ఞాపకాలతో కలెక్టర్ సన్మానించారు. కార్యక్రమంలో నల్గొండ ఆర్డీవో వై.అశోక్ రెడ్డి, ఆర్ అండ్ బీ ఎస్ఈ బి.వెంకటేశ్వరరావు, ఈఈ శ్రీధర్ రెడ్డి, డీఈ ఫణిజా, గణేశ్‌కుమార్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పుణ్య, ఏవో మోతీలాల్ తదితరులు పాల్గొన్నారు.
విలువలతో కూడిన విద్యనందించాలి
హాలియా, వెలుగు : విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించేందుకు టీచర్లు కృషి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. మంగళవారం తిరుమలగిరి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అద్దె భవనం ఆవరణలో కూర్చుని పాఠాలు వింటున్న విద్యార్థులను చూసి కలెక్టర్ ఎస్ వో కవితపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నూతన భవనం ప్రారంభించి 20 రోజులైనా అందులోకి ఎందుకు వెళ్లలేదని కలెక్టర్ ప్రశ్నించారు. అనంతరం కలెక్టర్ విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించారు. మండల కేంద్రంలోని రంగుండ్ల రోడ్డులో నూతన నిర్మించే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె పరిశీలించారు