బడ్జెట్ ఇలా చదివేద్దాం... జాబ్స్ స్పెషల్

బడ్జెట్ ఇలా చదివేద్దాం... జాబ్స్ స్పెషల్

టీఎస్​పీఎస్సీ నిర్వహించే అన్ని పోటీ పరీక్షల్లో బడ్జెట్​, ఆర్థిక సర్వేపై ప్రశ్నలు అడుగుతుంటారు. పరీక్ష స్థాయిని బట్టి ప్రశ్నల సరళి ఉంటుంది. జనరల్​ స్టడీస్​​లో భాగంగా 3 నుంచి 5 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. అయితే, గ్రూప్​–2, గ్రూప్​–3 సిలబస్​లో ప్రత్యేకంగా కేంద్ర, రాష్ట్రాల బడ్జెట్​ గురించి ప్రస్తావించారు. కాబట్టి 20 నుంచి 30 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బడ్జెట్​, ఆర్థిక సర్వేలోని ముఖ్యమైన అంశాలు ఎలా చదవాలో తెలుసుకుందాం. 

కరెంట్​ ఎకానమీలో  వార్షిక బడ్జెట్​ భాగం. ప్రతి ఏటా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సర్వే ప్రవేశ పెట్టిన మరుసటి రోజు బడ్జెట్​ను ప్రవేశ పెడతాయి. వీటిలో ప్రభుత్వ అధికారిక సమాచారం ఉంటుంది. దీన్ని ప్రామాణికంగా తీసుకొని పోటీ పరీక్ష ఏదైనా ప్రశ్నలను కచ్చితంగా అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు బడ్జెట్​లోని రాబోయే సంవత్సరానికి సంబంధించి రాబడులు, వ్యయాలకు సంబంధించిన వార్షిక విత్త స్టేట్​మెంట్​ను క్షుణ్ణంగా చదవాలి. ఇందుకోసం రెవెన్యూ, మూలధన రాబడులు, రెవెన్యూ మూలధన వ్యయాలు, మొత్తం రాబడులు, మొత్తం వ్యయాలు, రెవెన్యూ ఖాతా, వడ్డీ చెల్లింపులు, మూలధన ఆస్తుల కల్పనకు ఉపయోగించే గ్రాంట్లు, మూలధన ఖాతా, రెవెన్యూ లోటు, వాస్తవ రెవెన్యూ లోటు, కోశ లోటు, ప్రాథమిక లోటు తదితర గణాంకాలను తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. స్థూల గణాంకాలు గత బడ్జెట్​లో ఎలా ఉన్నాయి? ఈ బడ్జెట్​లో వచ్చిన మార్పులపైన ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. 

రాబడులు, వ్యయాలు

రెవెన్యూ రాబడిలో పన్ను రాబడులు, పన్నేతర రాబడులు భాగం. పన్నుల్లో ప్రత్యక్ష పరోక్ష పన్నుల వాటాలు, ప్రస్తుత బడ్జెట్​లో వచ్చిన తాజా మార్పుల గణాంకాలపై ప్రశ్నలు వస్తాయి. కార్పొరేషన్​ పన్ను, ఆదాయపు పన్ను, సంపద పన్ను, వడ్డీ పన్ను, ఎస్టేట్​ సుంకం, కస్టమ్స్​ సుంకం, యూనియన్​ ఎక్సైజ్​, సేవా పన్ను ల మొత్తం విలువలు, వసూళ్ల ధోరణలు, ప్రధానంగా జీఎస్టీ సంబంధిత విషయాలు చాలా కీలకం. పన్నేతర రాబడుల్లో డివిడెండ్లు, లాభాలు, వడ్డీ వసూళ్లు, బహిర్గత గ్రాంట్లు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి వచ్చే రాబడులు ఎలా ఉన్నాయి?  కేంద్ర వ్యయంలో ఏయే రంగాలకు అత్యధిక వాటా వెళ్తుంది? కేంద్ర నుంచి బదిలీలు, వడ్డీ చెల్లింపులు, ఆహారంపై వెచ్చిస్తున్న ఖర్చులు ముఖ్యం. 

ఆర్థిక సర్వేలో ఇవి ముఖ్యం 

ఆర్థిక సర్వే.. గత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ స్థితి ఎలా ఉందో వివరిస్తుంది. ఈ ఫ్లాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ రూపొందిస్తుంది.  ఈ ఆర్థిక సర్వేను ప్రధాన ఆర్థిక సలహాదారు నేతృత్వంలో  రూపొందించారు. గత ఆర్థిక సంవత్సరంలో భారత​ అభివృద్ధి, జీడీపీ ఎలా ఉంది? తర్వాత ఎలా ఉండబోతుందో అంచనా వేస్తుంది. రాబోయే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో కూడా ఆర్థిక సర్వేలో ఉంటాయి. బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కేటాయింపులను కూడా ఈ ఆర్థిక సర్వేకు అనుగుణంగానే రూపొందిస్తారు. 

గణాంకాలు బట్టీ పట్టొద్దు 

ఆర్థిక సర్వేలో వివిధ రంగాల్లో వృద్ధిరేటు గణాంకాలు, స్థూల జాతీయ ఉత్పత్తి, పన్నుల వసూలు, -ఖర్చులు, అప్పులు, తలసరి ఆదాయంలో మార్పులు మొదలైన వాటికి సంబంధించిన గణాంకాలపై ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది.  ప్రాథమిక రంగంలో  వ్యవసాయ ఉత్పత్తుల విలువ, జీడీపీలో వ్యవసాయ రంగం వాటా, ఆహార ధాన్యాల ఉత్పత్తి, విస్తీర్ణం, ప్రధాన పంటల గణాంకాలు, వ్యవసాయ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అంగీకరించిన రుణ వితరణ- వాస్తవాలు, మద్దతు ధరలు, పంటల ఉత్పత్తిలో వివిధ రాష్ట్రాల మధ్య పోలిక మొదలైనవి దృష్టిలో పెట్టుకొని చదవాలి. గత సంవత్సరంలో పారిశ్రామిక రంగం ఎలాంటి ధోరణులతో కొనసాగిందనే అవగాహన సర్వే ద్వారా ఏర్పరుచుకోవచ్చు. జీడీపీలో పారిశ్రామిక వాటా, ఉప రంగాల వాటా, వృద్ధి రేట్లు, పారిశ్రామిక ఉత్పత్తి సూచీ ద్వారా లభిస్తున్న గణాంకాలను చదవాలి. సేవారంగపు ఉప రంగాల్లో అదనపు విలువల జోడింపు, వాటి వృద్ధి రేట్లు, సేవా రంగపు జీవీఏలో వివిధ రాష్ట్రాల వాటాలు వృద్ధి, సేవారంగంలో స్థూల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, బ్యాంకింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రంగ ప్రగతి, పర్యాటక రంగం- ఇతర రంగాల ప్రగతి ప్రధానాంశాలుగా చదవాలి.

 సాధారణంగా బడ్జెట్​ను ఫిబ్రవరి నెల చివరి రోజున సమర్పించేవారు. అంతకుముందురోజు ఆర్థిక సర్వే, దాని ముందురోజు రైల్వే బడ్జెట్​ సమర్పించేవారు. 1999 వరకు కేంద్ర బడ్జెట్​ను సాయంత్రం 5గంటలకు ప్రవేశ పెట్టేవారు. ఆర్థిక మంత్రి యశ్వంత్​ సిన్హా 1999లో కేంద్ర బడ్జెట్​ను ఉదయం 11 గంటలకు ప్రవేశ పెట్టి బ్రిటిష్​ సంప్రదాయాన్ని విడిచిపెట్టారు. అదేవిధంగా 2017–18 బడ్జెట్​ను ఫిబ్రవరి నెల చివరి పని రోజున ప్రవేశపెట్టే సంప్రదాయాన్ని అరుణ్​జైట్లీ విడిచి పెట్టి ఫిబ్రవరి 1న ప్రవేశ పెట్టారు.  మన దేశంలో సాధారణ బడ్జెట్​ నుంచి రైల్వే బడ్జెట్​ను వేరు చేయమని అక్వర్త్​ కమిటీ 1921లో సూచించింది. 1924 నుంచి రైల్వే బడ్జెట్​ను వేరు చేసి చూపిస్తున్నారు. బిబేక్​ దేబ్రాయ్​ కమిటీ సిఫార్సులపై 2016, సెప్టెంబర్​లో రైల్వే బడ్జెట్​ను సాధారణ బడ్జెట్​తో కలిపేందుకు ప్రభుత్వం ఆమోదించింది. 2017–18 బడ్జెట్​ నుంచి రైల్వే బడ్జెట్​, సాధారణ బడ్జెట్​తో కలిపి చూపడమైంది. 

ఈసారి కొత్త పథకాలు 

ఈసారి బడ్జెట్​లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతా రామన్​ సప్తర్షి పేరుతో ఏడు ప్రాధాన్య అంశాలను ప్రస్తావించారు. సమ్మిళిత అభివృద్ధి, చిట్టచివరి వ్యక్తికీ లబ్ధి, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, సామర్థ్యాల వెలికితీత, గ్రీన్​ డెవలప్​మెంట్​, యువశక్తికి ప్రోత్సాహం, ఆర్థిక రంగం బలోపేతం తదితర అంశాలను సమగ్రంగా అధ్యయనం చేసుకొని చదవాలి. కొత్తగా ప్రారంభించనున్న  కేంద్ర పథకాలైన ప్రధాన మంత్రి – వ్యవసాయ నిర్వహణకు ప్రత్యామ్నాయ పోషకాల ప్రోత్సాహం (పీఎం – ప్రణామ్​), ఆత్మ నిర్భర్​ క్లీన్​ ప్లాంట్​ ప్రోగ్రామ్​, అమృత్​ ధరోహర్​, గోవర్ధన్​, ప్రధాన మంత్రి కౌశల్​ వికాస్​ యోజన 4.0, మిష్ఠీ స్కీమ్​ను సమగ్రంగా అధ్యయనం చేయాలి.  

  •     బ్రిటిష్​ పాలనలో  దేశ తొలి బడ్జెట్​ను 1860లో ప్రవేశ పెట్టింది జేమ్స్​ విల్సన్. 
  •     స్వాతంత్ర్య భారతదేశంలో తొలి బడ్జెట్​ను షణ్ముగం చెట్టి ప్రవేశపెట్టారు. 
  •     గణతంత్ర భారతదేశంలో మొదటి బడ్జెట్​ను జాన్​ మథాయ్​ (1949–50) ప్రవేశపెట్టారు. 
  •     మొరార్జీ దేశాయ్​ (10 బడ్జెట్లు), పి.చిదంబరం (9) ఎక్కువసార్లు బడ్జెట్​ ప్రవేశపెట్టారు.
  •     బడ్జెట్​ను ప్రవేశపెట్టిన తొలి ప్రధాని జవహర్​ లాల్​ నెహ్రూ.
  •     బడ్జెట్​ను ప్రవేశపెట్టిన మహిళా ప్రధాని ఇందిరాగాంధీ.
  •     ప్రధానిగా ఉంటూ ఆర్థిక మంత్రిగా బడ్జెట్​ను  జవహర్​ లాల్​ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్​ గాంధీ ప్రవేశ పెట్టారు.

-పృథ్వీ కుమార్​ చౌహాన్​, పృథ్వీస్​ IAS స్టడీ సర్కిల్​