రిలయన్స్‌‌‌‌, ఇన్ఫోసిస్‌‌‌‌లో పెరిగిన ఎల్‌‌‌‌ఐసీ పెట్టుబడులు

రిలయన్స్‌‌‌‌, ఇన్ఫోసిస్‌‌‌‌లో పెరిగిన ఎల్‌‌‌‌ఐసీ పెట్టుబడులు
  • హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ బ్యాంక్‌‌‌‌, ఐసీఐసీఐ బ్యాంక్‌‌‌‌లో డౌన్‌‌‌‌

న్యూఢిల్లీ: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌‌‌‌ఐసీ) ఈ ఏడాది జూన్‌‌‌‌తో ముగిసిన క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో నికరంగా రూ.25 వేల కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేసింది. మార్కెట్‌‌‌‌ పెరగడంలో కీలకంగా ఉంది. ఎల్‌‌‌‌ఐసీ  94 స్టాక్స్‌‌‌‌లో వాటాను పెంచుకోగా,  72 షేర్లలో తగ్గించుకుంది.  జూన్ చివరి నాటికి, ఎల్‌‌‌‌ఐసీ  పోర్ట్‌‌‌‌ఫోలియోలో 345 లిస్టెడ్ స్టాక్స్ ఉన్నాయి. వీటి మొత్తం మార్కెట్ విలువ రూ.16.84 లక్షల కోట్లు. ఈ ఏడాది మార్చి క్వార్టర్‌‌‌‌‌‌‌‌ నాటికి వీటి విలువ రూ.15.26 లక్షల కోట్లుగా నమోదైంది. దీంతో పోలిస్తే  10శాతం గ్రోత్ కనిపించింది. 

రిలయన్స్ ఇండస్ట్రీస్‌‌‌‌లో  2.56 కోట్ల షేర్లు (రూ.3,840 కోట్లు), ఇన్ఫో ఎడ్జ్ ఇండియాలో 2.2 కోట్ల షేర్లు (రూ.3,285 కోట్లు), టీసీఎస్‌‌‌‌లో 83.43 లక్షల షేర్లు (రూ.2,890 కోట్లు) కొనుగోలు చేసింది.  కోఫోర్జ్ (రూ.2,730 కోట్లు), ఇన్ఫోసిస్ (రూ.2,500 కోట్లు), హెచ్‌‌‌‌యూఎల్‌‌‌‌ (రూ.2,324 కోట్లు), హెచ్‌‌‌‌సీఎల్‌‌‌‌ టెక్ (రూ.2,260 కోట్లు), టాటా మోటార్స్ (రూ.1,880 కోట్లు), ఎల్‌‌‌‌ అండ్ టీ (రూ.1,790 కోట్లు)లో కూడా భారీగా ఇన్వెస్ట్ చేసింది. మరోవైపు  హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ బ్యాంక్‌‌‌‌లో 1.87 కోట్ల షేర్లు (రూ.3,750 కోట్లు) అమ్మింది.  

ఐసీఐసీఐ  బ్యాంక్ (రూ.3,490 కోట్లు), దివీస్ ల్యాబ్స్ (రూ.3,060 కోట్లు) లలో పెట్టుబడులు తగ్గించుకుంది. ఎల్‌‌‌‌ఐసీ  10 కొత్త కంపెనీలలో ఇన్వెస్ట్ చేయగా,  14 నుంచి బయటకు వచ్చేసింది. కొత్త పెట్టుబడులలో మజ్​గావ్‌‌‌‌ డాక్ (రూ.4,280 కోట్లు), సీమెన్స్ (రూ.1,440 కోట్లు)ఉన్నాయి.