బాధ్యతే విలువ.. ప్రేమే లాభం : బతుకు విలువ ఎంతో…

బాధ్యతే విలువ.. ప్రేమే లాభం : బతుకు విలువ ఎంతో…

‘దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి. ఇక ఊరేల… సొంత ఇల్లేn ఓ చెల్లెలా? ఏల ఈ స్వార్ధం ఏది పరమార్థం..  తొలుత ఇల్లు తుదకు మన్ను.. ఈ బతుకెంత దాని విలువెంత ఓ చెల్లెలా?’ అని ‘అంతులేని కథ’ సినిమాలో ఒక పాట ఉంది. సినిమాలో హీరోయిన్‌‌ క్యారెక్టర్‌‌ గురించి రాసిందే అయినా.. ప్రతి ఒక్కరు ఎప్పుడో ఒకప్పుడు తప్పనిసరిగా ‘బతుకెంత.. దాని విలువెంత?’ అనుకొనే ఉంటారు. మరి విలువ ఉన్నట్లా.. లేనట్లా..?

జీవితం.. షాపింగ్‌‌ మాల్‌‌లో దొరికే వస్తువు కాదు. రేటు కట్టి అమ్మడానికి! మరొకరు కొనడానికి! అలాంటప్పుడు బతుక్కు విలువ ఎలా కడతారు? ఎంతని కడతారు? ఎవరు కడతారు? అలా కట్టకపోతే.. జీవితాన్ని ఎలా లెక్కెయ్యాలి? బతుకుకున్న అర్థాన్ని, పరమార్థాన్ని ఏ వెయింగ్‌‌ మెషిన్‌‌ మీద తూస్తారు? విలువ చెప్పడానికి ఎవరైనా ఉన్నారా? లేరా?.

అమ్మొద్దు.. కొనొద్దు

ఒక గురువు దగ్గరకు వజ్రాల వ్యాపారి వెళ్లి ‘గురువుగారూ.. నేను ఎలాంటి వజ్రానికైనా విలువ కట్టగలను. జీవితానికి అలా విలువ కట్టొచ్చా?’ అని అడిగాడు. గురువు ఆ వ్యాపారి దగ్గరున్న ఒక వజ్రాన్ని తీసుకుని ‘దీనికి నీకు తెలిసిన విలువ కాకుండా బయట ఎంత విలువ ఉందో కనుక్కొని రా’ అని పంపించాడు. పంపిస్తూ ఒక షరతు కూడా పెట్టాడు. ‘దీన్ని నువ్వు అమ్మొద్దు.. దీనితో మరొకటి కొనొద్దు’ అని. ఆ వ్యాపారి వజ్రాన్ని తీసుకొని యాపిల్‌‌ పండ్ల దుకాణం దగ్గరకు వెళ్తే.. ఆ కొట్టు అతను పది యాపిల్స్‌‌ ఇస్తానని చెప్పాడు. కిరణా కొట్టు దగ్గరకు వెళ్తే.. అతడు యాభై కిలోల బియ్యం వస్తాయని చెప్పాడు. బట్టల షాపులోకి వెళ్తే.. రెండు జతలు వస్తాయని అన్నాడు. బంగారం కొట్టుకు పోతే.. చిన్న వజ్రం పొదిగిన ఉంగరం వస్తుందన్నాడు. చివరకు ఆ వ్యాపారి గురువు దగ్గరకు వచ్చి తనకు ఎదురైన అనుభవాలు చెప్పాడు. అందుకు గురువు.. ‘వజ్రం ఒక్కటే. ఎవరికి తెలిసినట్లు వాళ్లు అంచనా వేశారు. అలాగే బతుకు విలువ ఇది అని చెప్పడం ఎవరి వల్లా కాదు. ఏ పుట్టలో ఏ పాము ఉందో ఎలా చెప్పగలం? అలాగే ఎవరిలో ఏ ప్రతిభ ఉందో కూడా చెప్పలేం. జీవితం వజ్రాల్లా అమ్మడానికీ, కొనడానికీ కాదు’ అని చెప్పాడు.

ఇదేం బిజినెస్‌‌ కాదు

జీవితంలో వ్యాపారం చేసి పైకి ఎదగొచ్చు. కానీ జీవితమే వ్యాపారం చేసుకోకూడదు. ప్రతిదాన్నీ  లెక్కల్లో చూడకూడదు. కృష్ణుడు, కుచేలుడు చిన్నప్పుడు మంచి స్నేహితులు. పెద్దయ్యాక కుచేలుడు పేదరికంతో చాలా బాధలు పడ్డాడు. కృష్ణుడు ఐశ్వర్యంతో తులతూగాడు. కుచేలుడి భార్య ‘కృష్ణుడు నీకు మంచి స్నేహితుడు కదా. బాగా ఉన్నవాడు. వెళ్లి సాయం అడుగు’ అంటుంది. కుచేలుడు, భార్య మాట కాదనలేక, కృష్ణుడికి ఇష్టమైన అటుకులు తీసుకుని వెళ్తాడు. చుట్టూ చాలామంది బంధువులు, మిత్రులు ఉన్నా కృష్ణుడు. కుచేలుడ్ని ఆత్మీయంగా దగ్గరకు తీసుకుంటాడు. అతడు తెచ్చిన అటుకులను ఇష్టంగా తింటాడు. కుచేలుడు మాత్రం సాయం అడగడానికి మొహమాటపడతాడు. కృష్ణుడు అది గమనించి అతడికి కావాల్సిన అష్టైశ్వర్యాలు అతడికి తెలియకుండానే ఇస్తాడు. ఇక్కడ అటుకులకు, కృష్ణుడు ఇచ్చిన సంపదకు పోలికే లేదు. ఒకటి గోరంత అయితే, మరొకటి కొండంత.  ఇద్దరి మధ్యా ఉన్న స్నేహానికి సంబంధించి. అలాగే బతుకు వ్యాపారం కాదు. ‘నేను ఇంత ఇచ్చాను. నువ్వు నాకు అంతే తిరిగి ఇవ్వాలి’ అని లెక్కలు కట్టడానికి. అందుకే మానవసంబంధాల్లోని అభిమానాన్ని, ఆప్యాయతను అనుభవించాలి. అప్పుడే వాటి గొప్పదనం తెలుస్తుంది.

బాధ్యతే విలువ.. ప్రేమే లాభం

బుద్ధుడి దగ్గరకు ఒక ఆమె తన కొడుకును తీసుకొచ్చింది. ‘ఎంత చెప్పినా వినకుండా దొంగతనాలు చేస్తున్నాడని.. ముసలి వాళ్లైన తమను పట్టించుకోవడం లేదు’ అని ఫిర్యాదు చేసింది. అప్పుడు బుద్ధుడు అతడిని దగ్గరకు పిలిచి.. ‘నువ్వు ఏఏ దొంగతనాలు చేశావు’ అని అడిగాడు. అతడు ‘డబ్బు, నగలు, బంగారం…’ అని వరుసగా చెప్పాడు. అందుకు బుద్దుడు ‘నీకు తెలియకుండా బురదలో దిగావు. బయటకు వచ్చాక మంచి నీళ్లు కనిపిస్తే ఆ బురద కడుక్కుంటావా లేదా?’ అని అడిగాడు. ‘కడుక్కుంటాను’ అని అతడు సమాధానం ఇచ్చాడు. ‘దొంగతనం తప్పని తెలిశాక.. ఎందుకు మళ్లీ మళ్లీ చేస్తున్నావు. మానేయాలి కదా’ అని బుద్ధుడు చెప్పాడు. తర్వాత ‘నిన్ను రాజభటులు పట్టుకోవడానికి వెంటపడి.. ఇంట్లో ఉన్నావని తెలిసి వస్తే.. మీ అమ్మ ఇంట్లో ఉన్నావని చెప్తుందా.. లేవని చెప్తుందా..? అని అడిగాడు. ‘తప్పకుండా లేడనే చెప్తుంది’ అన్నాడు అతడు. ‘నిన్ను అంతగా ప్రేమించే అమ్మానాన్నలను పెద్ద వయసులో చూసుకోవాల్సిన బాధ్యత నీకు ఉందా లేదా?’ అని బుద్ధుడు అడిగాడు. దానితో అతడు తన తప్పులు తెలుసుకుంటాడు. ఆ తల్లి కూడా సంతోషించింది. ప్రతి ఒక్కరికీ బాధ్యతలు ఉంటాయి. చెడు దారుల్లోకి వెళ్లకుండా వాటిని సక్రమంగా నిర్వర్తించినప్పుడే జీవితానికి విలువ. ఇతరులకు ప్రేమ పంచడం వల్ల కలిగే సంతోషమే.. లాభం.

కోల్పోయినా.. సంతోషమే

పొద్దున లేచింది మొదలు.. భార్య, పిల్లలు, తల్లి, తండ్రి, ఉద్యోగం, సంపాదన.. వీటన్నింటితో విసిగిపోయిన ఒకతను ఆ ఊరికి వచ్చిన ఆధ్యాత్మిక గురువును కలిశాడు. ‘నేను వాళ్లకోసం నా జీవితాన్ని, సుఖాన్ని, సంతోషాన్ని కోల్పోతున్నాను. అందుకే ఒంటరిగా బతకాలనుకుంటున్నాను’ అని చెప్పాడు.  అందుకు ఆ గురువు. నిన్ను మనిషిగా తీర్చిదిద్దింది నీ కుటుంబమే. నీకున్న ఇష్టాలు వదులుకుంటుంది. నీ వాళ్లకోసమే. ఎందుకంటే.. నీకు కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, సంతోషం వేసినా.. నువ్వు పంచుకునేది వాళ్లతోనే. వాళ్లు లేకపోతే నువ్వు లేవు. వాళ్లకు అవసరం అయినప్పుడు నువ్వు నీ సుఖాన్ని, సంతోషాన్ని త్యాగం చేయాలి. నీకు అవసరం అయినప్పుడు వాళ్లూ అంతే. జీవితం అంటే నచ్చిన వాళ్లకోసం కొన్ని వదులుకోక తప్పదు. ఆ వదులుకోవడంలోనే నిజమైన సంతోషం ఉంటుంది. నువ్వు ఆ సంతోషాన్ని అనుభూతి చెందడం నేర్చుకోవాలి’ అని చెప్పి పంపాడు.  మొదట ప్రతి మనిషి ఇష్టాయిష్టాలను జయించడం అలవాటు చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల తెలియకుండానే ఆధ్యాత్మిక భావనకు దగ్గరవుతాడు. అందుకు కుటుంబం ఓ మార్గాన్ని చూపుతుంది.