లింగాల సోషల్​ వెల్ఫేర్​ గురుకులంలో జూనియర్లపై సీనియర్ల దాడి

లింగాల సోషల్​ వెల్ఫేర్​ గురుకులంలో జూనియర్లపై సీనియర్ల దాడి

లింగాల, వెలుగు : నాగర్​కర్నూల్ జిల్లా లింగాల సాంఘిక సంక్షేమ గురుకులంలో ఇంటర్​చదువుతున్న సీనియర్లు పదో తరగతి విద్యార్థులపై దాడి చేశారు. దీంతో బాధిత విద్యార్థులు, పేరెంట్స్​తో కలిసి ఎమ్మార్పీఎస్, గిరిజన సంఘం ఆధ్వర్యంలో స్కూల్​ఎదుట మెయిన్​రోడ్డుపై బుధవారం ధర్నా చేశారు. బాధిత విద్యార్థుల కథనం ప్రకారం..మంగళవారం భోజనం కోసం 9 వ తరగతి స్టూడెంట్​లైన్​లో రాకపోవడంతో, లైన్​లో రావాలని ఓ టెన్త్​స్టూడెంట్​చెప్పగా వాగ్వాదం జరిగింది. ఈ విషయంలోనే రాత్రి మరోసారి గొడవ పెట్టుకున్నారు. 

9వ తరగతి స్టూడెంట్​ఇంటర్​చదువుతున్న సమీప బంధువుకు చెప్పడంతో 8 మంది కలిసి రాత్రి 11 గంటల సమయంలో ముగ్గురు టెన్త్​ స్టూడెంట్లను చితకబాదారు. బాధిత స్టూడెంట్స్​తల్లిదండ్రులు, ఎమ్మార్పీఎస్, గిరిజన సంఘం నాయకులు బుధవారం స్కూల్​కు చేరుకొని ఘటన గురించి సిబ్బందిని ప్రశ్నించారు. వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడమే కాకుండా, గొడవతో తమకెలాంటి సంబంధం లేదని బుకాయించడంతో ధర్నాకు దిగారు. 

ఎమ్మార్పీఎస్ నాయకులు బంగారయ్య, గిరిజన సంఘం నాయకులు శంకర్  మాట్లాడుతూ స్కూల్​లో పిల్లలకు భద్రత కరువైందన్నారు. ప్రిన్సిపాల్ వినోద్ ఖన్నా దసరా సెలవుల తరువాత దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.