రెండు రోజుల్లో రూ. వెయ్యి కోట్ల టార్గెట్​

రెండు రోజుల్లో రూ. వెయ్యి కోట్ల టార్గెట్​
  • జీతాలకు పైసల్లేవ్​..మందు మస్తు అమ్మాలె
  • ఆబ్కారీ శాఖకు రాష్ట్ర సర్కార్ ఆదేశాలు
  • రెండు రోజుల్లో రూ. వెయ్యి కోట్ల టార్గెట్​
  • కొన్నిరోజులుగా తగ్గుతున్న సేల్స్​
  • ఎందుకు తగ్గాయో ఈ నెల మొదటి వారంలో
  • రిపోర్ట్​ తీసుకున్న సర్కారు
  • అయినా కొత్తగా టార్గెట్లు పెట్టి అమ్మకాలు
  • సోమవారం ఒక్కరోజే రూ. 250 కోట్ల సేల్స్
  • ఇయ్యాల రూ.500 కోట్లకుపైగా సరుకు డెలివరీ?


నల్గొండ/నెట్​వర్క్​, వెలుగు:  రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు లిక్కర్ ఆదాయమే దిక్కవుతున్నది. రెండు నెలలుగా మద్యం సేల్స్​ పడిపోతుండటంతో ప్రభుత్వం పరేషాన్​ అయితున్నది. సర్కారు టార్గెట్​ ప్రకారం ప్రతి నెలా రూ.3,750 కోట్ల విలువైన సరుకు అమ్మాల్సి ఉండగా.. జనవరిలో రూ.2,864 కోట్లు,  ఫిబ్రవరిలో ఆదివారం వరకు రూ. 2,283 కోట్ల సేల్స్​మాత్రమే జరిగాయి. సేల్స్​ తగ్గడంపై ఎక్సైజ్ శాఖ నుంచి ఫిబ్రవరి మొదటి వారంలోనే ప్రభుత్వం వివరణ తీసుకుంది. పల్లెల్లో పోద్దాడు కల్లు సీజన్​ కావడం, రియల్​ ఎస్టేట్​ దెబ్బతినడం లాంటి కారణాల వల్లే లిక్కర్ ​సేల్స్​ పడిపోతున్నట్లు ఆబ్కారోళ్లు రిపోర్ట్​ ఇచ్చినా సర్కారు సంతృప్తి చెందలేదు. ఫిబ్రవరి నెలలో రెండు రోజులు తక్కువగా ఉండడం, జనవరితో పోల్చినప్పుడు రూ. 500 కోట్లకు పైగా సేల్స్​ తగ్గడంతో ఈ నెల జీతాలు ఎలా ఇవ్వాలో తెలియక తలపట్టుకుంటున్నది. ఈ క్రమంలో ఈ నెల చివరి రెండు రోజులైన 27, 28 తేదీల్లో ఏకంగా రూ.1,000 కోట్లు రాబట్టాలని ఎక్సైజ్​శాఖకు రాష్ట్ర సర్కారు నుంచి ఓరల్ ఆర్డర్స్​ వెళ్లాయి. దీంతో జిల్లాలవారీగా సోమవారం టార్గెట్లు విధించిన ఆబ్కారోళ్లు.. ఆమేరకు సరుకును డిపోల నుంచి డంప్​ చేసుకోవాలని లిక్కర్​ వ్యాపారులకు ఆదేశాలిచ్చారు. సోమవారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా రూ.250 కోట్ల లిక్కర్​ సేల్స్​ జరిగాయి. మంగళవారం  ఎట్లయినాసరే రూ.500 కోట్లకుపైగా సరుకును లిక్కర్​షాపులకు తరలించేందుకు ఆబ్కారోళ్లు కింద మీద పడ్తున్నారు.

ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఎంప్లాయీస్​కు ప్రతినెలా జీతాలు, పెన్షన్లకు రూ.4 వేల కోట్ల నుంచి రూ.4,500 కోట్లు, ఆసరా పింఛన్లకు దాదాపు వెయ్యి కోట్లు కావాలి. గతంలో ప్రభుత్వం తీసుకున్న అప్పులకు ప్రతినెలా చెల్లించాల్సిన వడ్డీలకు రూ. 3వేల కోట్లు, ఇతర నిర్వహణ ఖర్చులకు రూ. 1,500 కోట్లు అవసరం. నెలనెలా ఈ ఖర్చుల నుంచి గట్టెక్కేందుకు సర్కారుకు  లిక్కర్ సేల్సే ప్రధాన ఆదాయ వనరుగా మారింది.​  ప్రతి నెలా లిక్కర్ సేల్స్​ ద్వారా సగటున రూ. 3 వేల కోట్లు, స్టాంప్స్​ అండ్​ రిజిస్ట్రేషన్స్​ద్వారా  రూ.1,200 కోట్ల నుంచి రూ.1,500 కోట్లు, పెట్రో అమ్మకాల్లో వ్యాట్​ద్వారా రూ. వెయ్యి కోట్లు, కేంద్రం పన్నుల్లో వాటా కింద రూ.1,500 కోట్ల దాకా  వస్తాయి. ఈ లెక్కన లిక్కర్​సేల్స్  ఏమాత్రం​తగ్గినా జీతాలు ఇవ్వలేని పరిస్థితి వస్తున్నది. గతేడాది జనవరి 1 నుంచి డిసెంబర్​ 31 వరకు  రూ. 34,117  కోట్లు విలువ చేసే లిక్కర్  అమ్మగా.. ప్రభుత్వానికి దాదాపు రూ.29 వేల కోట్లు ఇన్​కం వచ్చింది. నిరుడు మే నెలలో లిక్కర్​ రేట్లను 20 నుంచి 25శాతం పెంచడంతో అప్పటి నుంచి సేల్స్​లో పెద్దగా పెరుగుదల లేకున్నా వచ్చే ఆదాయం మాత్రం భారీగా ఉంటున్నది. ఈ క్రమంలో ఈ ఏడాది లిక్కర్​అమ్మకాల ద్వారా  ఏకంగా రూ.38 వేల కోట్లు రాబట్టాలని సర్కారు టార్గెట్​ పెట్టుకుంది. ఈ స్థాయిలో ఇన్​కమ్​ రావాలంటే రూ. 45 వేల కోట్ల విలువైన సేల్స్​ జరగాలి. అంటే ప్రతి నెలా రూ. 3,750 కోట్ల విలువైన సరుకు అమ్మాలి. కానీ ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి సేల్స్​రాష్ట్ర సర్కారుకు షాక్​ఇచ్చాయి. దీని ఎఫెక్ట్​ జీతాలు, ఇతర ఖర్చులపై పడే అవకాశముండడంతో  లిక్కర్​ సేల్స్​పెంచాలని ఆబ్కారోళ్లకు టార్గెట్​పెట్టారు. వాళ్లు లిక్కర్​ వ్యాపారుల మీద తీవ్ర ఒత్తిడి చేసి సోమవారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా రూ.250 కోట్ల సరుకు కొనిపించారు. సాధారణ రోజుల్లో లిక్కర్​ సేల్స్​ రూ.100 కోట్లు మించదు. ఈ లెక్కన ఒక్కరోజే అదనంగా రూ.150 కోట్ల సరుకు డిపోల్లోంచి బయటకు వెళ్లింది. 

లిక్కర్ సేల్స్ ఎందుకు తగ్గినయ్..?​

ఈఏడాది జనవరి నెలలో టార్గెట్ మేరకు​లిక్కర్​సేల్స్​జరగకపోవడంతో సర్కారు వెంటనే అలర్ట్​ అయింది. ఇందుకు కారణాలేంటో కనుక్కొని నివేదిక ఇవ్వాలని ఎక్సైజ్​శాఖ ఉన్నతాధికారులను ఆదేశించింది. దీంతో క్షేత్రస్థాయిలో ఎంక్వైరీ చేసిన ఆఫీసర్లు ఫిబ్రవరి మొదటి వారంలోనే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఈ సీజన్​లో రాష్ట్రవ్యాప్తంగా పోద్దాడు కల్లు పారుతుండడంతో  ఆ ఎఫెక్ట్ లిక్కర్​ సేల్స్​పై పడిందని రిపోర్ట్​లో పేర్కొన్నారు. ఇంకా మార్కెట్​లో పత్తి ధర తగ్గడంతో ఇండ్లలో నిల్వ పెట్టుకున్నారని, చేతిలో పైసల్లేక జనం లిక్కర్​తాగడం తగ్గించారని  చెప్పారు. కొంతకాలంగా జిల్లాల్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ పడిపోవడం కూడా మద్యం అమ్మకాలు పడిపోవడానికి కారణమని పేర్కొన్నారు.  వీటితో ఏమా త్రం ఏకీభవించని సర్కారు.. రెండు రోజుల్లో చెప్పిన టార్గెట్ రీచ్ కాకపోతే స్పెషల్ టీములను  రంగంలోకి దింపి వైన్​ షాపుల్లో తనిఖీలు ముమ్మరం చేస్తామని వార్నింగ్​ ఇచ్చినట్లు సీనియర్ ఆఫీసర్ ఒకరు చెప్పారు. ‘‘మా జిల్లాకు రెండు రోజుల్లో రూ.23 కోట్ల ఎక్స్​ట్రా టార్గెట్​ ఇచ్చారు.. దీంతో వైన్స్​వారీగా వ్యాపారులందరినీ అదనపు​సరుకు దింపుకొని పైసలు కట్టాలని ఆదేశించినం’’ అని మరో ఆఫీసర్​అన్నారు. కానీ చాలా మంది వ్యాపారులు మాత్రం ఎక్స్​ట్రా సరుకు తీసుకోవడానికి ముందుకు రావడం లేదని, అప్పులు తెచ్చి సరుకుదింపుకుంటే అది అమ్ముడుపోకపోతే మిత్తీలు పెరుగుతాయని చెప్తున్నారని ఆ ఆఫీసర్​వాపోయారు. అయినప్పటికీ నల్గొండ, సూర్యాపేట జిల్లాల డిపో పరిధిలో ప్రతిరోజూ సగటున 9.5 కోట్ల టార్గెట్​ ఉంటే సోమవారం ఏకంగా రూ.16 కోట్లు రాబట్టామని ఆయన పేర్కొన్నారు.

జీతాల కోసం ఎదురుచూపులు

ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్​దారులకు ప్రతినెలా టైమ్​కు జీతాలు, పెన్షన్లు అందడం లేదు. జూనియర్​ పంచాయతీ కార్యదర్శులతో పాటు పంచాయతీ, మున్సిపల్​ కార్మికులు, కాంట్రాక్ట్​ ఉద్యోగులకు నెలల తరబడి జీతాలను సర్కారు పెండింగ్ ​పెడుతున్నది. పంచాయతీ కార్మికులకు కొన్ని చోట్ల ఐదు నెలలు, కొన్ని చోట్ల మూడు నెలల జీతాలు పెండింగ్ లో ఉన్నాయి. గ్రామాల్లో కార్మికులు బిచ్చమెత్తి నిరసన తెలుపుతున్నా సర్కారు స్పందించడం లేదు.​ చాలా జిల్లాల్లో  పంచాయతీ సెక్రటరీలకు జనవరి జీతం ఇప్పటివరకు రాలేదు. ‘జనవరి జీతం మార్చిలోనైనా వస్తుందా?’ అంటూ సెక్రటరీలు ఆరా తీస్తున్నారు. జీతాలు రాక ఇల్లు గడవడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ఇక జూనియర్, డిగ్రీ కాలేజీల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లకు డిసెంబర్, జనవరి జీతం ఇంకా పడలేదు. గెస్ట్​ లెక్చరర్లకు ఐదు నెలలుగా శాలరీస్​ అందడం లేదు. వైద్య, ఆరోగ్య శాఖలో హెల్త్ అసిస్టెంట్లకు మొన్నటి వరకు నాలుగు నెలల జీతం పెండింగ్ ఉండగా వారం  క్రితం రెండు నెలల జీతం ఇచ్చారు. మరో రెండు నెలల జీతం పెండింగ్ లో పెట్టారు. అంగన్ వాడీ కార్యకర్తలకు కూడా జనవరి జీతం  ఇంకా ఇవ్వలేదు.  వివిధ డిపార్ట్మెంట్లలో కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేయకపోవడంతో ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్​కు మూడు, నాలుగు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదు.