వైన్​ షాపులు బంద్ .. స్టాక్ మొత్తం ఖాళీ

వైన్​ షాపులు బంద్ .. స్టాక్ మొత్తం ఖాళీ
  • లైసెన్స్​ల గడువు ముగుస్తుండటంతో.. స్టాక్ మొత్తం ఖాళీ
  • ముందే భారీగాకొని పెట్టుకున్న అభ్యర్థులు
  • మంగళవారం దుకాణాల ముందు బారులు

హైదరాబాద్‌‌, వెలుగు :  రాష్ట్రవ్యాప్తంగా లిక్కర్ షాపులు మూతబడ్డాయి. పోలింగ్‌‌ నేపథ్యంలో వైన్​షాపులు, బార్లు, కల్లు దుకాణాలను ఎక్సైజ్‌‌ అధికారులు మంగళవారం సాయంత్రం 5 గంటలకు మూసివేసి సీల్​ వేశారు. దీంతో అంతటా మద్యం అమ్మకాలు నిలిచిపోయాయి. వైన్​షాపుల మూసివేత గురించి తెలుసుకున్న లిక్కర్​కస్టమర్లు మంగళవారం మద్యం కోసం క్యూ కట్టారు. అయితే లైసెన్స్‌‌ల గడువు ముగియడంతో లిక్కర్ షాపుల్లో స్టాక్‌‌ ఖాళీ అయింది. దీంతో తమకు కావాల్సిన బ్రాండ్లు లేవని కొన్ని చోట్ల నిర్వాహకులతో కస్టమర్లు వాగ్వాదానికి దిగారు. 

లైసెన్స్‌‌ల గడువు ముగుస్తుండటంతో గత10 రోజుల నుంచే మద్యం వ్యాపారులు పాత స్టాక్‌‌ను క్లియర్ చేసుకునేందుకు ప్రయత్నించారు. స్థానిక నాయకులు గత మూడు రోజుల క్రితమే భారీ ఎత్తున మద్యం కొనుగోలు చేసి పెట్టుకున్నారు. దీంతో మద్యం షాపుల్లో స్టాక్‌‌ తగ్గిపోయింది. కొన్ని బ్రాండ్స్‌‌ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. తమకు కావల్సిన బ్రాండ్ కోసం కస్టమర్ల నుండి పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చాయి. లిక్కర్ స్టాక్‌‌ను చెక్‌‌ చేసుకున్న తర్వాత ఎక్సైజ్‌‌ అధికారులు సీల్ వేశారు. గురువారం సాయంత్రం 5 గంటలకు వైన్​షాపులు తిరిగి ఓపెన్ కానున్నాయి. అప్పటి వరకు వాటిని ఎవరూ ఓపెన్ చేయకుండా లాక్‌‌పై సీల్‌‌ వేసి సంతకాలు, ఎక్సైజ్ స్టాంప్‌‌ చేశారు. వీటిని సంబంధిత ఎక్సైజ్ అధికారులు మానిటరింగ్ చేస్తుంటారు. ఎవరైనా సీల్‌‌ తీసి షాప్ ఓపెన్ చేస్తే ఆయా షాపు ఓనర్లకు ఎక్సైజ్ యాక్ట్‌‌ కింద కేసులు నమోదు చేయనున్నారు.

కొత్త ఓనర్లకు పాత స్టాక్‌‌

లైసెన్స్‌‌ గడువు ముగియనుండటంతో వైన్​ షాపుల నిర్వాహకులు స్టాక్‌‌పై దృష్టి పెట్టారు. సాధారణంగా కొత్తగా టెండర్స్‌‌ దక్కించుకున్న వారు రిటైలర్ కోడ్స్‌‌, డిస్టిలరీ నుంచి సప్లయ్‌‌, బ్యాంక్ గ్యారంటీస్‌‌ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈసారి ఎలక్షన్ కోడ్‌‌ అమలులో ఉండటంతో కొత్త లైసెన్స్ హోల్డర్లు స్టాక్‌‌ తెచ్చుకునే ప్రక్రియ ఆలస్యం అయింది. దీంతో పాత స్టాక్‌‌ను కొత్త లైసెన్స్ హోల్డర్స్‌‌కు ట్రాన్స్‌‌ఫర్ చేసుకునే సదుపాయం ఉండటంతో డిసెంబర్‌‌1వ తేతీ నుంచి యధావిథిగానే వైన్ షాపుల్లో మద్యం అమ్మకాలు జరగనున్నాయి. ఇందుకోసం ఎక్సైజ్  డిపార్ట్‌‌మెంట్‌‌కు సంబంధిత లెటర్ అందించాల్సి ఉంటుంది.