రాళ్లురప్పలకు రైతుబంధు..22 వేల కోట్లు.. తెలంగాణ రైతుబంధు లెక్క ఇదే

రాళ్లురప్పలకు రైతుబంధు..22 వేల కోట్లు.. తెలంగాణ రైతుబంధు లెక్క ఇదే
  • ఐదేండ్లలో గత బీఆర్​ఎస్​ సర్కార్​ నిర్వాకం
  • పడావుపడ్డ భూములు, గుట్టలు, రియల్ ఎస్టేట్ వెంచర్లకూ ఇచ్చిన్రు   
  • బీఆర్ఎస్ హయాంలో జరిగిన అక్రమాలను గుర్తించిన ప్రభుత్వం
  • పంటల సాగు, రైతుబంధు లెక్కలతో బయటపడ్డ బాగోతం
  • ఇకపై సాగు భూములకే ఇవ్వాలని సర్కార్ నిర్ణయం 
  • ‘రైతు భరోసా’ను పకడ్బందీగా అమలు చేసేందుకు కసరత్తు 

హైదరాబాద్‌‌, వెలుగు : బీఆర్ఎస్ హయాంలో రైతుబంధు పంపిణీలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్టు ప్రభుత్వం గుర్తించింది. సాగులో లేని వేలాది ఎకరాలకు రైతుబంధు ఇచ్చినట్టుగా తేలింది. పడావుపడ్డ భూములు, రాళ్లురప్పలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు కూడా రైతుబంధు కింద పెట్టుబడి సాయం అందించారు. ఇలా సాగులో లేని భూములకు గత ఐదేండ్లలో ఏకంగా రూ.22,606 కోట్లు అందినట్టు ప్రభుత్వ పరిశీలనలో తేలింది. రైతుబంధు పథకం 2018 వానాకాలం సీజన్‌‌ నుంచి ప్రారంభమైంది. 

మొదట్లో సీజన్‌కు ఎకరాకు రూ.4 వేల చొప్పున అందజేశారు. అలా ఏడాదికి ఎకరానికి రూ.8 వేల చొప్పున ఇచ్చారు. ఆ తర్వాత 2019–20 నుంచి సీజన్‌కు రూ.5 వేల చొప్పున, ఏడాదికి రూ.10 వేలు అందజేశారు. రైతుబంధు ప్రారంభం నుంచి గత వానాకాలం సీజన్‌ వరకు మొత్తం రూ.72,816 కోట్లు రైతులకు అందజేశారు. అయితే ఇందులో సాగైన భూములకు అందింది రూ.50,210 కోట్లు మాత్రమేనని, మిగతా రూ.22,606 కోట్లు సాగులో లేని భూములకే అందిందని ప్రభుత్వం గుర్తించింది. ప్రతిఏటా సాగైన భూముల లెక్కలతో రైతుబంధు పంపిణీ లెక్కలను పోల్చి చూడగా ఈ బాగోతం బయటపడ్డది. 

ప్రతిఏటా అంతే.. 

2018–19 ఆర్థిక సంవత్సరంలో వానాకాలం, యాసంగి సీజన్లలో కలిపి 1.34 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. కానీ ఆ ఏడాది రైతుబంధు మాత్రం సీజన్ కు 1.31 కోట్ల ఎకరాల చొప్పున రెండు సీజన్లకు కలిపి 2.62 కోట్ల ఎకరాలకు రూ.10,486 కోట్లు చెల్లించారు. ఇందులో సాగైన భూములకు అందింది రూ.5,360 కోట్లు మాత్రమే కాగా, మిగతా రూ.5,126 కోట్లు సాగు చేయని భూములకు అందాయి. 2022–23 ఆర్థిక సంవత్సరంలో వానాకాలం, యాసంగి సీజన్లలో కలిపి 2.08 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. కానీ ఆ ఏడాది రైతుబంధు సీజన్‌కు 1.48 కోట్ల ఎకరాల చొప్పున రెండు సీజన్లకు కలిపి 2.97 కోట్ల ఎకరాలకు రూ.14,744 కోట్లు చెల్లించారు. ఇందులో సాగైన భూములకు అందింది రూ.10,400 కోట్లు మాత్రమే కాగా, మిగతా రూ.4,344 కోట్లు సాగు చేయని భూములకు అందాయి. ఇలా 2023–24 వానాకాలం సీజన్ నాటికి మొత్తంగా రూ.22,606 కోట్లు సాగులో లేని భూములకే ఇచ్చినట్టు ప్రభుత్వం గుర్తించింది. 

పకడ్బందీగా రైతు భరోసా.. 

బీఆర్ఎస్ హయాంలో జరిగిన అక్రమాలను గుర్తించిన ప్రభుత్వం.. రైతుబంధు నిబంధనలపై సమీక్ష చేస్తున్నది. కొత్తగా అమలు చేయబోయే రైతు భరోసా పథకం కింద కేవలం సాగు భూములు, నిజమైన రైతులకే పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయించింది. వందలాది ఎకరాలు ఉన్న భూస్వాములు, సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, కోట్లాది ఆస్తులున్నోళ్లకు పెట్టుబడి సాయం ఇవ్వకూడదని భావిస్తున్నది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా కింద ఏటా ఎకరానికి రూ.15 వేలు ప్రభుత్వం అందజేయనుంది.

ఈ నేపథ్యంలో రైతు భరోసా పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని భావిస్తున్నది. వాస్తవిక సాగు లెక్కల ఆధారంగా రైతులకు పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయించింది. పంటల సాగును గుర్తించేందుకు అత్యాధునిక టెక్నాలజీని వినియోగించనుంది. అలాగే కౌలు రైతులకు కూడా రైతు భరోసా సాయం అందజేయడానికి గైడ్ లైన్స్ సిద్ధం చేస్తున్నట్టు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. వచ్చే వానాకాలం సీజన్‌ నుంచి రైతుభరోసా పథకం అమల్లోకి రానుంది.

ఇదీ రైతుబంధు లెక్క.. 

ఆర్థిక సంవత్సరం    సాగైన భూమి    ఇవ్వాల్సిన రైతుబంధు    రైతుబంధు ఇచ్చిన భూములు    ఇచ్చిన రైతుబంధు
                                     (కోట్ల ఎకరాల్లో)         (రూ.కోట్లలో)                            (కోట్ల ఎకరాల్లో)                           (రూ.కోట్లలో)

2018–19                            1.34                          5,360                                            2.62                                        10,486  
2019–20                            1.75                          8,750                                            2.46                                        10,532 
2020–21                            2.03                          10,150                                          2.94                                        14,656 
2021–22                            1.85                          9,250                                            2.96                                        14,773 
2022–23                            2.08                         10,400                                           2.97                                        14,744 
2023–24                            1.26                          6,300                                            1.52                                        7,625