మన్యంలో తగ్గిన పశుసంపద .. గతేడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు జాతీయస్థాయిలో పశుగణన

మన్యంలో తగ్గిన పశుసంపద .. గతేడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు జాతీయస్థాయిలో పశుగణన
  • నాడు 473 గ్రామాల్లో 2,91,273 ఇండ్లలో సర్వే.. 
  • తగ్గడానికి గల కారణలేంటని ఇటీవల మన్యంలో మళ్లీ సర్వే
  • పోషణ భారం, మేపేవారు దొరక్కపోవడం, బీడు భూముల కొరత, అటవీశాఖ ఆంక్షలు ప్రధాన కారణాలుగా వెల్లడి

భద్రాచలం, వెలుగు : భద్రాచలం మన్యంలో పశుసంపద తగ్గుదల కన్పిస్తోంది. ఇటీవల నిర్వహించిన సర్వే ఈ విషయాన్ని తేటతెల్లం చేసింది. పోషణ భారం, వాటిని మేపే వారు దొరక్కపోవడం, బీడు భూముల కొరత, అడవుల్లోకి పశువుల ప్రవేశంపై అటవీశాఖ ఆంక్షలు, వ్యవసాయంలో యంత్రాల వినియోగం పెరగడం, ఇరిగేషన్​ భూములు లేకపోవడం పశుసంపద తగ్గిపోవడానికి ప్రధాన కారణాలుగా తేలాయి. 

రెండుసార్లు సర్వే..

గతేడాది డిసెంబర్​ నుంచి ఈ ఏడాది ఏప్రిల్​ వరకు జాతీయస్థాయిలో పశుగణన నిర్వహించారు. వాటి వివరాలను ప్రత్యేక యాప్​లో నమోదు చేశారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 23 మండలాల్లో 473 గ్రామాల్లో 140 మంది ఎన్యూమరేటర్లు, 30 మంది సూపర్​వైజర్లు 2,91,273 ఇండ్లలో ఈ సర్వే నిర్వహించారు. తెల్ల పశువులు, గేదెలు, గొర్రెలు, మేకల సంఖ్య తగ్గినట్లుగా సర్వేలు తేల్చాయి. ఈ గణాంకాల ఆధారంగా పశువులు ఎందుకు తగ్గాయి..? కారణాలు ఏంటీ..? అలాంటి పరిస్థితులు ఎందుకొచ్చాయి..? అనే కోణంలో రీ సర్వేకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనితో పాల్వంచ, చండ్రుగొండ,బూర్గంపాడు, అన్నపురెడ్డిపల్లి, అశ్వాపురం, కరకగూడెం, ములకలపల్లి, పినపాక, మణుగూరు, ఇల్లెందు మండలాల్లో రీ సర్వే చేసి వివరాలను పశుగణ్​ యాప్​లో పొందుపరిచారు. 

పశువులు వివరాలు ఇలా.. 

35శాతం వరకు తెల్ల, నల్ల పశువులు తగ్గినట్లు సర్వే నివేదికలు చెబుతున్నాయి. ప్రతీ ఐదేండ్లకొకసారి పశుగణన చేస్తుంటారు. 2018–-19లో చేసిన సర్వే ప్రకారం జిల్లాలో 4.55లక్షల పశువులు ఉన్నాయి. 2.80లక్షలు తెల్ల, 1.70లక్షల నల్ల పశువులు, మేకలు 2.50లక్షలు, గొర్రెలు 2.60లక్షలు, కోళ్లు 3.27లక్షలు, నాటుకోళ్లు 1.38లక్షలు, పందులు 3180, కుక్కలు 30వేలు ఉన్నట్లు తేలింది. కానీ తాజా పశుగణన ప్రకారం తెల్ల పశువులు 35 -నుంచి 40శాతం, గేదెలు 30-నుంచి 35శాతం, మేకలు 30శాతం, పెరటికోళ్లు 35-–40శాతం తగ్గినట్లుగా లెక్కలు చెబుతున్నాయి. 

పశువులు తగ్గిన మాట వాస్తవమే.. 

జిల్లాలో పశువుల సంఖ్య తగ్గిన మాట వాస్తవమే. వాటి పెంపకానికి అనుకూలమైన పరిస్థితులు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. పశుగణన జరిగింది, కానీ ఇంకా అధికారికంగా లెక్క ప్రకటించలేదు. సర్వే, రీ సర్వే రిపోర్టులు అన్నీ పంపినం. యాప్​లో నమోదు​ చేశాం. సెంట్రల్​ గవర్నమెంట్​ ప్రకటించాక పూర్తి వివరాలు వస్తాయి. 

డాక్టర్​ ఠాగూర్​, ఏడీ, పశుసంవర్ధక శాఖ