పోచన్నపేట ప్రైమరీ స్కూల్‌‌లో..మధ్యాహ్న భోజనంలో బల్లి..ఐదుగురు స్టూడెంట్లకు అస్వస్థత

 పోచన్నపేట ప్రైమరీ స్కూల్‌‌లో..మధ్యాహ్న భోజనంలో బల్లి..ఐదుగురు స్టూడెంట్లకు అస్వస్థత
  • జనగామ జిల్లా పోచన్నపేట ప్రైమరీ స్కూల్‌‌లో ఘటన

బచ్చన్నపేట, వెలుగు : బల్లి పడిన సాంబార్‌‌ తినడంతో ఐదుగురు స్టూడెంట్లు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని పోచన్నపేట ప్రైమరీ స్కూల్‌‌లో బుధవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... పోచన్నపేట ప్రైమరీ స్కూల్లో 154 మంది స్టూడెంట్లు చదువుకుంటున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు భోజనంలో సాంబార్‌‌ వడ్డించారు. 

భోజనం చేసిన తర్వాత కొందరు స్టూడెంట్లు ఇండ్లకు వెళ్లిపోయారు. గిన్నెలు కడుగుతున్న టైంలో సాంబార్‌‌ గిన్నె అడుగున చనిపోయిన బల్లి కనిపించడంతో వంట చేసిన వారు హెచ్‌‌ఎం దృష్టికి తీసుకెళ్లారు. హెచ్‌‌ఎం ఎంఈవోకు, అక్కడి నుంచి కలెక్టర్‌‌కు సమాచారం అందించడంతో వైద్య, రెవెన్యూ, పంచాయతీరాజ్‌‌ ఆఫీసర్లను పోచన్నపేటకు పంపించారు. స్కూల్‌‌కు చేరుకున్న డాక్టర్లు స్టూడెంట్లను పరీక్షించి ఐదుగురు కడుపునొప్పితో ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించి మందులు అందజేశారు. 

విషయం తెలుసుకున్న డీఎంహెచ్‌‌వో మల్లికార్జున్‌‌రావు స్కూల్‌‌ను సందర్శించారు. స్టూడెంట్లను రెండు రోజుల పాటు అబ్జర్వేషన్‌‌లో పెడుతామని, ఎవరికైనా వాంతులు, విరేచనాలు అయితే హాస్పిటల్‌‌కు తీసుకెళ్లేందుకు రెండు అంబులెన్స్‌‌లను గ్రామంలోనే ఉంచామని చెప్పారు. తహసీల్దార్‌‌ రామానుజాచారి, ఎంపీడీవో మమతాబాయి, చేర్యాల మార్కెట్‌‌ కమిటీ చైర్మన్‌‌ నల్లనాగుల శ్వేతా వెంకన్న స్కూల్‌‌ను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు.