
- అవసరాల కోసం కొందరు... సరదాల కోసం మరికొందరు
- లోన్ డబ్బులు వడ్డీతో సహా చెల్లించినా ఆగని వేధింపులు
- ఫోన్లోని నంబర్లకు న్యూడ్ ఫొటోలు పంపుతూ టార్చర్
- సైబర్ క్రైమ్ పోలీసులనూ బురిడీ కొటిస్తున్న కేటుగాళ్లు
మంచిర్యాల, వెలుగు: ఆన్లైన్ లోన్ యాప్‌ల మాయలో పడి అమాయకులు బలవుతున్నారు. అత్యవసరాలకు ఇన్స్టంట్ లోన్లు తీసుకుని తిరిగి చెల్లించినా వేధింపులు ఆపకపోవడంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మంచిర్యాల జిల్లాలో ఇలాంటి కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే జిల్లాలో ఇద్దరు సూసైడ్ చేసుకున్నారు. ఇదే రీతిలో చాలామంది యాప్‌ల వలలో చిక్కి విలవిలలాడుతున్నారు. తీసుకున్న మొత్తానికి పది రెట్లు అధికంగా చెల్లించినప్పటికీ ఇంకా బాకీ ఉన్నావంటూ నిత్యం ఫోన్లు చేస్తున్నారు. వాళ్లు చెప్పిన గడువులోగా చెల్లించకపోతే కాంటాక్ట్ నంబర్లకు న్యూడ్ ఫొటోలు పంపుతామంటూ టార్చర్ పెడుతున్నారు. బాధితులు ఎవరికీ చెప్పుకోలేక, పోలీసులకు కంప్లైంట్ చేయలేక నరకం అనుభవిస్తున్నారు. ఈ ఉచ్చు నుంచి ఎలా బయటపడాలో దిక్కుతోచక కుమిలిపోతున్నారు.
యూత్ టార్గెట్‌గా...
ఆన్లైన్ లోన్ యాప్ నిర్వాహకులు యూత్‌ను టార్గెట్ చేసుకొని దోపిడీ దందా సాగిస్తున్నారు. ఇన్స్టంట్ లోన్ ఇస్తామంటూ ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రాం వంటి సోషల్ యాప్స్ ద్వారా, షార్ట్ మెసేజ్ సర్వీస్ ద్వారా యాప్ లింకులు పంపుతున్నారు. అత్యవసరాల కోసం కొందరు, జల్సాలు, సరదాల కోసం మరికొందరు లోన్ యాప్‌లకు ఆకర్షితులవుతున్నారు. ఆన్లైన్ రమ్మీ, క్రికెట్ బెట్టింగ్ కోసం కూడా లోన్ యాప్‌లను ఆశ్రయిస్తున్నారు. ప్రతీ ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉండడంతో లోన్ యాప్‌లను లేదా ఫోన్లకు వచ్చిన లింకులను ఓపెన్ చేసి వారు అడిగిన వివరాలు నమోదు చేస్తే చాలు చిటికెలో లోన్లు శాంక్షన్ చేస్తున్నారు. వడ్డీ 15 నుంచి 30 శాతం వసూలు చేస్తున్నారు. తీసుకున్న మొత్తాన్ని వడ్డీతో సహా వారం రోజుల్లో చెల్లించాలనే షరతుపై లోన్లు ఇస్తున్నారు. గడువు లోపల తిరిగి కట్టినప్పటికీ ఇంకా బాకీ ఉన్నవాంటూ నానా రకాలుగా వేధింపులకు పాల్పడుతున్నారు. ఆన్లైన్లో డబ్బులు చెల్లించిన స్క్రీన్ షాట్లు పంపితే మాకు పైసలు రాలేదంటున్నారు. రోజుకొకరు ఫోన్లు చేసి బూతులు తిడుతున్నారు. వాట్సాప్‌కు అభ్యంతరకమైన మెసేజ్‌లు పంపుతున్నారు. కాంటాక్ట్ నంబర్లకు మార్ఫింగ్ చేసిన న్యూడ్ ఫొటోలు పంపి టార్చర్ పెడుతున్నారు.
పరువు భయంతో ఆత్మహత్యలు...
ఆన్లైన్ లోన్ యాప్‌ల టార్చర్ భరించలేక పలువురు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దండేపల్లి మండలం మామిడిపల్లికి చెందిన ప్రైవేట్ ఎంప్లాయ్బొమ్మిడి రాజేంద్రప్రసాద్(35) కొద్దిరోజుల కిందట ఆన్లైన్ లోన్ యాప్ ద్వారా రూ.50 వేలు తీసుకున్నాడు. ప్రతి నెల కొంత అమౌంట్ చెల్లిస్తున్నప్పటికీ ఇంకా రూ.7 లక్షల లోన్ ఉందంటూ మార్ఫింగ్ చేసిన న్యూడ్ ఫొటోలు పంపడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి భార్య, ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. మూడు నెలల కిందట మంచిర్యాల గోపాల్‌వాడకు చెందిన బొల్లు కల్యాణి(30) సైతం ఇదే రీతిలో సూసైడ్ చేసుకుంది. పలు పలుమార్లు స్మాల్ లోన్ యాప్, బేసిక్ లోన్ యాప్, మనీ లోన్ యాప్, లెండింగ్ చానెల్ యాప్, లోన్ ప్రొడక్ట్ యాప్, షైన్ లోన్ యాప్, హ్యాలో రూపీ యాప్ నుంచి లోన్లు తీసుకుంది. రూ.30వేల లోన్‌కు రూ.లక్ష వరకు చెల్లించింది. ఇంకా లోన్ పెండింగ్ ఉందంటూ న్యూడ్ ఫొటోలు పంపి వేధించడంతో మే 18న ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మంచిర్యాలకు చెందిన ఓ యువకుడు అత్యవసరంగా రూ.7వేలు లోన్ తీసుకుని రూ.35 వేలు చెల్లించాడు. ఇంకా డబ్బులు కట్టాలంటూ రోజూ ఫోన్లు చేసి బూతులు తిడుతున్నారని వాపోతున్నాడు. దండేపల్లి మండలం కన్నెపెల్లి గ్రామానికి చెందిన అక్కల జగదీశ్ ఫోన్‌కు హాండీ క్రెడిట్ లోన్ యాప్ నుంచి మెస్సేజ్ రావడంతో లింకును ఓపెన్ చేసి రూ.6600 లోన్ తీసుకున్నాడు. ఎనిమిది నెలల్లో రూ.75వేలు చెల్లించినా వేధింపులు ఆగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
చిక్కరు... దొరకరు...
ఆన్లైన్ యాప్ నిర్వాహకులు ఎక్కడినుంచి ఆపరేట్ చేస్తున్నారనేది ఎవరికీ అంతుబట్టని విషయం. ఫోన్ నంబర్లకు తిరిగి కాల్ చేస్తే కలవదు. ఈ కేటుగాళ్లు టెక్నాలజీని ఉపయోగించుకొని సైబర్ క్రైం పోలీసులను సైతం తప్పుదారి పట్టిస్తున్నారు. ఇంటర్నెట్ ద్వారా, సెల్ టవర్ సిగ్నళ్ల ద్వారా కూడా వాళ్ల లొకేషన్‌ను కనిపెట్టలేకపోతున్నారు. పూటపూటకు ఫోన్ నంబర్లు, లొకేషన్లు మార్చుతూ బురిడీ కొట్టిస్తున్నారు. లోన్ యాప్‌లో వివరాలు నమోదు చేస్తే మన ఫోన్ వారి కంట్రోల్ లోకి వెళ్తుంది. ఫోన్లోని కాంటాక్ట్ నంబర్లు, గ్యాలరీలోని ఫొటోలు యాప్ నిర్వాహకుల చేతుల్లోకి చేరుతాయి. ఇక వాటితో కస్టమర్లను ఆటాడుకుంటారు. కాంటాక్ట్ నంబర్లకు ఫోన్ చేసి ఫలానా వ్యక్తి లోన్ తీసుకుని చెల్లించడం లేదంటూ పరువుతీస్తారు. ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, బంధువుల ఫొటోలను న్యూడ్‌గా మార్ఫింగ్ చేసి పంపుతారు. ఇలాంటి బాధితులు అఘాయిత్యాలకు పాల్పడకుండా పోలీసులకు కంప్లైంట్ చేయాలి.