రైతుబంధు స్కీం కింద లోన్లు ఇస్తలేరు

రైతుబంధు స్కీం కింద లోన్లు ఇస్తలేరు
  • వడ్లను దళారులకు తక్కువ రేటుకే అమ్ముకుంటున్న రైతులు
  • ఖమ్మంలో టార్గెట్ 21 కోట్లు.. ఇచ్చింది కోటి

ఖమ్మం, వెలుగు: రాష్ట్రంలో ప్రస్తుతం వడ్ల కొనుగోళ్లు ఇంకా పూర్తి స్థాయిలో షురూ కాలేదు. వడ్లు కొనాలంటూ రైతులు ధర్నాలకు దిగుతున్నా సర్కారుకు పట్టడం లేదు. ఇలాంటి టైంలో మంచి రేటు వచ్చేవరకు వడ్లను గోడౌన్​లలో నిల్వ చేసుకోవచ్చు. నిల్వ చేసిన ఆ పంటపై 75 శాతం వరకు వ్యవసాయ మార్కెట్​కమిటీల ద్వారా లోను తీసుకోవచ్చు. అయితే సర్కారు నిర్లక్ష్యం.. లోన్​ ఇవ్వడంలో తీవ్ర జాప్యం చేస్తుండడంతో రైతులు తక్కువ ధరకే దళారులకు అమ్ముకుంటూ నష్టపోతున్నారు. ప్రభుత్వం గ్రేడ్ ఏ వడ్లకు రూ.1,960 మద్దతు ప్రకటించింది. కానీ కొనుగోలు కేంద్రాలు షురూ కాకపోవడం, మరోవైపు వానల భయంతో దళారులకు రూ.1,300 నుంచి 1,400 రేటుకే అమ్ముకుంటున్నారు. గోడౌన్​లలో నిల్వ చేసుకొని పంటపై లోన్​ తీసుకునే చాన్స్ ఉన్నా సరైన అవగాహన లేకపోవడం, అప్లై చేసుకున్న వెంటనే రైతులకు రుణం రాకపోవడంతో స్కీంపై ఆసక్తి చూపించడం లేదు. ఖమ్మం జిల్లాలో ఈ ఏడాది ఇప్పటివరకు 82 మంది మిర్చి రైతులు రుణం తీసుకోగా, వడ్లు సాగు చేసిన రైతులు ఒక్కరు కూడా ఈ స్కీంను ఉపయోగించుకోకపోవడం గమనార్హం. 

కేటాయింపే.. లోన్ ​ఇస్తలేరు
2021–22 ఆర్థిక సంవత్సరానికిగాను ఖమ్మం జిల్లాలో అన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీలకు కలిపి రూ.21.7 కోట్లు రైతుబంధు పథకం ద్వారా రైతులకు లోన్లు ఇవ్వాలని టార్గెట్ పెట్టుకున్నారు. అందులో నేలకొండపల్లి, వైరా, మద్దులపల్లి మార్కెట్ కమిటీల పరిధిలో మిర్చి సాగు చేసే రైతులకు ఇప్పటివరకు రూ.9 కోట్లు శాంక్షన్​అయ్యాయి. ఇందులో 82 మంది రైతులు 2,618 క్వింటాళ్ల మిర్చి తాకట్టు పెట్టి రూ.1.26 కోట్లు లోన్​ తీసుకున్నారు. ఇప్పుడు వడ్ల సీజన్​ నడుస్తున్నా జిల్లాలో ఒక రైతు కూడా ఈ పథకాన్ని ఉపయోగించుకోలేదు. మధిర మార్కెట్ కమిటీకి రూ.5 కోట్లు, నేలకొండపల్లిలో రూ.50 లక్షలు, కల్లూరు ఏఎంసీకి రూ.30 లక్షలు, వైరాలో రూ.30 లక్షలు, సత్తుపల్లి ఏఎంసీకి రూ.10 లక్షలు నిధులు కేటాయించినా ఇంతవరకు ఒక్క పైసా కూడా రైతులకు లోన్లు ఇవ్వలేదు. అదే 2020–21లో ఖమ్మం, మధిర, నేలకొండపల్లి, వైరా, మద్దులపల్లి మార్కెట్ కమిటీలకు కలిపి మొత్తం రూ.20.11 కోట్లు మంజూరు కాగా, 1,513 మంది రైతులు 40,475 క్వింటాళ్ల వడ్లు, మిర్చి తాకట్టు పెట్టి రూ.17 కోట్ల 32 లక్షల 52 వేలు లోన్​ తీసుకున్నారు. 

రైతుబంధు స్కీంతో ప్రయోజనాలు

  • గిట్టుబాటు ధర రాకపోతే రైతు తన పంటను మార్కెట్ గోడౌన్​ లలో నిల్వ ఉంచి, ఆ సరుకుపైన రూ.2 లక్షల వరకు లోన్​ తీసుకోవచ్చు.
  • సరుకును మార్కెట్ గోడౌన్​లలో 180 రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు. సరుకుకు ఇన్స్యూరెన్స్​సౌకర్యం ఉంటుంది. 
  • గోడౌన్​ లలో నిల్వ పెట్టిన సరుకును ష్యూరిటీగా పెట్టి సరుకు విలువలో 75 శాతం వరకు లోన్​ తీసుకోవచ్చు. ఈ లోన్​ 180 రోజులలోగా తిరిగి చెల్లిస్తే ఎలాంటి వడ్డీ ఉండదు. 180 రోజుల నుంచి 270 వరకు 12 శాతం చొప్పున వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. 
  • 270 రోజులలో తీసుకున్న అప్పు చెల్లించి సరుకు విడుదల చేసుకోకపోతే దాన్ని వేలం వేసి అప్పును రికవరీ చేసుకునే అధికారం మార్కెట్ కమిటీకి ఉంటుంది.
  • నామమాత్రపు గోడౌన్​ కిరాయి, ఇన్స్యూరెన్స్​ ఛార్జీలను ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వసూలు చేస్తారు. 

లోన్లపై అవగాహన కల్పిస్తున్నాం
టెక్నికల్​సమస్యలతో రైతులు లోన్ల కోసం అప్లై చేసుకున్న సమయంలో కొంత ఆలస్యం అవుతున్న మాట వాస్తవమే. రైతుబంధు స్కీంపై మార్కెట్ కమిటీల ద్వారా ప్రచారం చేస్తున్నాం. కోల్డ్ స్టోరేజీలో నిల్వ చేసిన మిర్చిని తాకట్టు పెట్టి ఎక్కువమంది రైతులు లోన్లు తీసుకుంటున్నారు. గిట్టుబాటు ధర రాకపోతే వడ్లను కూడా నిల్వ చేసుకొని లోన్లు తీసుకోవచ్చు. రైతులు ఈ పథకాన్ని ఉపయోగించుకోవాలి.  
‑ నాగరాజు, డీఎం, మార్కెటింగ్ శాఖ