మేడారంలో అభివృద్ధికి స్థానికులు సహకరించాలి ... మంత్రి సీతక్క

మేడారంలో అభివృద్ధికి  స్థానికులు  సహకరించాలి ... మంత్రి సీతక్క

ములుగు/తాడ్వాయి, వెలుగు: మేడారంలో సమ్మక్క సారలమ్మ ఆలయ అభివృద్ధి పనులు నాణ్యతతో చేపట్టాలని, దీనికి స్థానికులు సహకరించాలని రాష్ట్ర మంత్రి సీతక్క కోరారు. సోమవారం ములుగు జిల్లాలో పర్యటించిన మంత్రి సీతక్క మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. 

మాస్టర్​ ప్లాన్​ పనులతో పాటు మహా జాతర కోసం చేపట్టిన పనులను పరిశీలించారు. పనులు ఎంత మేరకు జరిగాయనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సకాలంలో పనులు పూర్తి చేయాలన్నారు. పనులు నిత్యం పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. అనంతరం మేడారం గ్రామస్తులు మంత్రిని కలిసి పలు సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. 

మేడారం వై జంక్షన్  నుంచి స్థూపం వరకు చేపట్టిన డబుల్  రోడ్డు విస్తరణ పనుల్లో ఇండ్లు కోల్పోతున్నామని తెలియజేయగా, స్పందించిన మంత్రి ఎవరికి నష్టం కలగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. రోడ్డు విస్తరణ, అభివృద్ధి పనులతో గ్రామస్తులకు మేలు జరుగుతుందని తెలిపారు. ఆమె వెంట ఎస్పీ డాక్టర్​ పి.శబరీశ్, అడిషనల్​ కలెక్టర్​ సంపత్ రావు, ఆర్డీవో వెంకటేశ్, లైబ్రరీ చైర్మన్​ రవిచందర్, ఏఎంసీ చైర్ పర్సన్​ రేగ కల్యాణి పాల్గొన్నారు.