గంటలో దుబాయ్‌కి వెళ్లొచ్చు

గంటలో దుబాయ్‌కి వెళ్లొచ్చు

మామూలు ఏరోప్లేన్‌‌ స్పీడు ఎంతుంటుంది? గంటకు సుమారు వెయ్యి కిలోమీటర్లు. కానీ అంతకు డబుల్‌‌ స్పీడుతో దూసుకెళ్లే విమానాలు రాబోతున్నయ్‌‌. సూపర్‌‌ సోనిక్‌‌ (సౌండ్‌‌ కన్నా ఎక్కువ) వేగంతో వెళ్లే ఏరోప్లేన్లు రెడీ అవుతున్నయ్‌‌. సరుకు రవాణా కోసం కాదు. ప్రయాణికులను చేరవేసేందుకే. లాక్‌‌హీడ్‌‌ మార్టిన్‌‌ ఏరోనాటిక్స్‌‌ సంస్థ నాసా సాయంతో వీటిని తయారు చేయబోతోంది. డాలస్‌‌లోని అమెరికన్‌‌ ఇన్‌‌స్టిట్యూట్‌‌ ఆఫ్‌‌ ఏరోనాటిక్స్‌‌ అండ్‌‌ ఆస్ట్రొనాటిక్స్‌‌లో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఈ ఎయిర్‌‌ బస్సుల నమూనాను సంస్థ విడుదల చేసింది. వీటికి ఎక్స్‌‌ 59 క్వైట్‌‌ సూపర్‌‌సోనిక్‌‌ టెక్నాలజీ ఎయిర్‌‌ప్లేన్‌‌ (క్యూఎస్‌‌టీఏ) అని పేరు పెట్టింది.

నో సౌండ్‌‌.. ఓన్లీ స్పీడ్‌‌
గతంలో తయారు చేసిన సూపర్‌‌ సోనిక్‌‌ ప్యాసింజర్‌‌ ప్లేన్‌‌ ‘కాంకర్డ్‌‌’ ఎక్కువ శబ్దం విడుదల చేసేది. అందుకే ల్యాండ్ రూట్లలో దాన్ని నిషేధించారు. దీంతో ఆర్థికంగా గిట్టుబాటవడం కష్టమైంది. కానీ సాధారణ జెట్‌‌ ప్లేన్లలా ఎక్స్‌‌ 59 క్యూఎస్‌‌టీఏ సౌండ్‌‌ను విడుదల చేయదు. అందుకు తగ్గట్టు దాన్ని డిజైన్‌‌ చేశారు. ప్లేన్‌‌ వెనక రెండు టర్బో ఫ్యాన్‌‌ ఇంజన్లు ఉంటాయి. ఇవి గ్రౌండ్‌‌ లెవెల్‌‌లో 40 వేల పౌండ్ల థ్రస్ట్‌‌ను  విడుదల చేస్తాయి. ప్లేన్‌‌ స్టార్టయ్యాక థ్రస్ట్‌‌ కోసం వీటిని మళ్లీ మండించాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్‌‌గా స్పీడు అందుకుంటుంది. గంటకు 2,200 కిలోమీటర్ల వేగంతో ప్లేన్‌‌ దూసుకెళ్తుంది. క్యూఎస్‌‌టీఏ మొత్తంగా 9,600 కిలోమీటర్ల దూరాన్ని కవర్‌‌ చేయగలదు. అంటే న్యూయార్క్‌‌ నుంచి లండన్‌‌, లండన్‌‌ నుంచి బీజింగ్‌‌, టోక్యో నుంచి లాస్‌‌ ఏంజిలిస్‌‌, టోక్యో నుంచి సిడ్నీ వరకు ఈజీగా వెళ్లగలం. లండన్‌‌ నుంచి టోక్యోకు మామూలు ఫ్లైట్‌‌లో వెళ్తే 11 గంటలు పడుతుందని, క్యూఎస్‌‌టీఏలోనైతే నాలుగన్నర గంటల్లో వెళ్లొచ్చని లాక్‌‌హీడ్‌‌ మార్టిన్‌‌ చెప్పింది.

ముక్కు మెయిన్‌‌
ఫ్లైట్‌‌ ముందు భాగంలో పదునైన ముక్కు ఉంటుంది. ఆ ముక్కు భాగంలోనే చూడటానికి వీలుగా ఎన్‌‌హాన్స్‌‌డ్ ఫ్లైట్‌‌ విజన్‌‌ సిస్టమ్‌‌ ఉంది. షార్ప్ ముక్కు ఆకారం తర్వాత భాగాన్ని పెంచారు. సూపర్‌‌సోనిక్‌‌ షాక్‌‌ వేవ్స్‌‌ను తట్టుకోవడానికే ఈ ముక్కు నిర్మాణం. ఆ తర్వాత భాగం ప్రయాణికులు కూర్చునే క్యాబిన్‌‌. 40 మంది కూర్చునేలా రూపొందిస్తున్నారు. సింగిల్‌‌ ఐజిల్‌‌లో సీట్లను రెడీ చేస్తున్నారు. అంటే కూర్చునే ప్యాసింజర్లందరికీ విండో సీటన్నమాట. ఆ తర్వాత రెక్కలుంటాయి. ప్లేన్‌‌ సులువుగా వెళ్లడానికి వీలుగా వాటిని డిజైన్‌‌ చేశారు. ఆ తర్వాత రెండు ఇంజన్ల ముందు భాగాలుంటాయి. షాక్‌‌ను, థ్రస్ట్‌‌ను పైవైపు పంపేలా వీటిని డిజైన్‌‌ చేశారు. తర్వాత ఇంజన్లు ఉండే క్యాబిన్‌‌ ఉంటుంది. తర్వాత వీ ఆకారంలోని తోకను రూపొందిస్తున్నారు.