లోక్​సభ ఎన్నికలకు ఇవాళ షెడ్యూల్ రిలీజ్

లోక్​సభ ఎన్నికలకు ఇవాళ షెడ్యూల్ రిలీజ్
  • 543 ఎంపీ స్థానాలకు ఎన్నికలు
  • 4 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎలక్షన్లు
  • మధ్యాహ్నం 3 గంటలకు షెడ్యూల్ విడుదల చేయనున్న ఈసీఐ

న్యూఢిల్లీ, వెలుగు: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్​ను శనివారం రిలీజ్ చేయనున్నట్లు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది. మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్​లో ఎన్నికల తేదీలను ప్రకటిస్తామని శుక్రవారం ఈసీ ట్వీట్​ చేసింది. లోక్​సభతో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్​ప్రదేశ్, ఒడిసా, సిక్కిం రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్టు ఈసీ వర్గాలు తెలిపాయి. ఇటీవల చనిపోయిన, ఇతర కారణాలతో దేశవ్యాప్తంగా ఖాళీ అయిన అసెంబ్లీ స్థానాలకు కూడా బై ఎలక్షన్స్ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైనట్టు సమాచారం. తెలంగాణ నుంచి కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఈ సెగ్మెంట్​కు కూడా ఉప ఎన్నిక నిర్వహించే ఆలోచనలో ఈసీ ఉన్నట్టు తెలుస్తున్నది.

రాష్ట్రాల్లో ఈసీ కసరత్తు పూర్తి

ఎన్నికల నిర్వహణ కోసం ఇప్పటికే దేశంలోని ఆయా రాష్ట్రాల్లో ఈసీ అధికారులు పర్యటించారు. ఎలక్షన్లకు సంబంధించిన కసరత్తు పూర్తిచేశారు. ఈ నెల 13వ తేదీనే షెడ్యూల్ రిలీజ్ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం భావించింది. అయితే, పోయిన నెల ఫిబ్రవరి 14న ఎన్నికల కమిషనర్ అనూప్ చంద్ర పాండే పదవీ విరమణ పొందారు. ఆ తర్వాత మార్చి 8న అనూహ్యంగా మరో కమిషనర్ అరుణ్ గోయెల్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఎన్నికల కమిషనర్ పదవులు ఖాళీ అయ్యాయి. ఫలితంగా షెడ్యూల్ విడుదల ఆలస్యమైంది.

జూన్ 16వ తేదీతో ముగియనున్న లోక్​సభ గడువు

ఈసీ డేటా ప్రకారం.. జూన్ 16వ తేదీతో లోక్​సభ గడువు ముగియనున్నది. అరుణాచల్‌‌ ప్రదేశ్‌‌, సిక్కిం అసెంబ్లీల గడువు జూన్‌‌ 2వ తేదీతో, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ గడువు జూన్ 16తో, ఒడిసా అసెంబ్లీ గడువు జూన్‌‌ 24వ తేదీతో కంప్లీట్ అవుతుంది. గత లోక్​సభ ఎన్నికల షెడ్యూల్​ను 2019 మార్చి 10న ఈసీ రిలీజ్ చేసింది. ఏడు ఫేజ్​లలో ఎన్నికలు నిర్వహించి,  మే 23న రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. ఈసారి కూడా దేశవ్యాప్తంగా మొత్తం ఏడు ఫేజ్​లలో ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తున్నది.

చార్జ్ తీసుకున్న కొత్త ఈసీలు

మాజీ ఐఏఎస్ అధికారులు సుఖ్​బీర్ సంధూ, జ్ఞానేశ్ కుమార్ శుక్రవారం ఉదయం ఎలక్షన్ కమిషనర్లుగా బాధ్యతలు స్వీకరించారు. నిర్వచన్ సదన్​లో ఈసీలుగా చార్జ్ తీసుకున్న తర్వాత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్​ను మర్యాదపూర్వకంగా కలిశారు. మధ్యాహ్నం 12 గంటలకు రాజీవ్​కుమార్ నేతృత్వంలో ఈసీలు సంధూ, జ్ఞానేశ్ కుమార్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్, నిర్వహణ, ఎన్నికల తేదీలు, ఇతర అంశాలపై చర్చించారు. శనివారం ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేయనున్నట్టు ఒక ప్రకటనలో తెలిపారు.