నామినేషన్లు షురూ .. తొలి రోజు 42 మంది దాఖలు

నామినేషన్లు షురూ .. తొలి రోజు 42 మంది దాఖలు
  • వీరిలో మల్లు రవి, సురేశ్ షెట్కార్, నీలం మధు, డీకే అరుణ, రఘునందన్ 

నెట్​వర్క్​, వెలుగు: లోక్​సభ ఎన్నికల నామినేషన్లు గురువారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు మొత్తం 42 మంది నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో కాంగ్రెస్​ అభ్యర్థులు మల్లు రవి, సురేశ్ షెట్కార్, నీలం మధు, బీజేపీ క్యాండిడేట్లు డీకే అరుణ, రఘునందన్​రావు, పోతుగంటి భరత్​ప్రసాద్, ఈటల రాజేందర్​, శానంపూడి సైదిరెడ్డి ఉన్నారు. నాగర్​కర్నూల్​ స్థానానికి కాంగ్రెస్​అభ్యర్థి మల్లు రవి నామినేషన్​ దాఖలు చేశారు.

ఎమ్మెల్యేలు కూచుకుళ్ల రాజేశ్​రెడ్డి, వంశీకృష్ణ, నాగర్​కర్నూల్​ ఇన్​చార్జ్ హబీబ్, తన కుమారుడు సిద్ధార్థ్ తో కలిసి రిటర్నింగ్​ ఆఫీసర్​ ఉదయ్​కుమార్​కు మల్లు రవి నామినేషన్ పేపర్లు అందజేశారు. మంచి ముహూర్తం ఉన్నందున ఒక సెట్​నామినేషన్​ దాఖలు చేశానని, ఈ నెల 23న మరో సెట్ వేస్తానని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్​రెడ్డి హాజరవుతారని తెలిపారు. జహీరాబాద్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్ షెట్కార్ తరఫున పార్టీ నాయకులు నామినేషన్ దాఖలు చేశారు. 

రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వల్లూరు క్రాంతికి నామినేషన్ పత్రాలను అందజేశారు. మెదక్ స్థానానికి కాంగ్రెస్​ అభ్యర్థి నీలం మధు తరఫున ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్​రావు, డీసీసీ ప్రెసిడెంట్ ఆంజనేయులు గౌడ్, పార్టీ నర్సాపూర్ ​నియోజకవర్గ ఇన్‌‌‌‌చార్జ్ ఆవుల రాజిరెడ్డి, మెదక్ మున్సిపల్ ​చైర్మన్​ చంద్రపాల్ నామినేషన్​ వేశారు. కాగా, మెదక్ ​స్థానానికి తెలంగాణ ప్రజాశక్తి పార్టీ తరఫున దొడ్ల వెంకటేశం, ఇండిపెండెంట్ అభ్యర్థిగా చిక్కుపల్లి నవీన్ కుమార్ కూడా నామినేషన్ దాఖలు చేశారు. ఆదిలాబాద్ లోక్​సభ స్థానానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఇచ్చోడకు చెందిన సుభాశ్ రాథోడ్, ఆధార్ పార్టీ అభ్యర్థిగా ఖమ్మం జిల్లాకు చెందిన మాలోత్ శ్యామ్ లాల్ నాయక్ నామినేషన్లు వేశారు.  

బీజేపీ నుంచి ముగ్గురు.. 

మహబూబ్​నగర్ స్థానానికి బీజేపీ క్యాండిడేట్ డీకే అరుణ రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. రిట ర్నింగ్ ఆఫీసర్ రవి నాయక్​కు ఆమె పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ లక్ష్మణ్, ఎమ్మెల్సీ ర‌‌‌‌వీంద‌‌‌‌ర్ రెడ్డి పాల్గొన్నారు. నామినేషన్​ వేయడానికి ముందు కాట‌‌‌‌న్ మిల్లు వ‌‌‌‌ద్ద ఉన్న వేంకటేశ్వర స్వామి ఆలయంలో అరుణ ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి కొత్త కలెక్టరేట్​వరకు బైక్​ర్యాలీ నిర్వహించారు.

మహబూబ్​నగర్​ నుంచి ఇండిపెండెంట్ ​క్యాండిడేట్​గా మహ్మద్ ​ఇంతియాజ్ అహ్మద్ ​కూడా నామినేషన్ వేశారు. మెదక్ ​లోక్​సభ స్థానానికి బీజేపీ అభ్యర్థి రఘునందన్ ​రావు నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ సంగారెడ్డి, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు గోదావరి, మోహన్​రెడ్డి, నిజాంపేట జడ్పీటీసీ పంజా విజయ్​కుమార్​తో కలిసి ఆయన నామినేషన్​వేశారు. అంతకుముందు బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ ఇంట్లో తన తల్లిదండ్రులు భగవంతరావు, భారతి కాళ్లకు దండం పెట్టి రఘునందన్ ​రావు కలెక్టరేట్​కు బయలుదేరారు. నాగర్​కర్నూల్​ స్థానానికి బీజేపీ అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్​ ఒక సెట్​ నామినేషన్​ దాఖలు చేశారు. ఎంపీ రాములు, ఎమ్మెల్యే వెంకటరమణా రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్​జక్కా రఘునందన్​ రెడ్డి పాల్గొన్నారు.