ఎంజీఎంలో టెస్టులు, స్కానింగుల కోసం పడిగాపులు

ఎంజీఎంలో టెస్టులు, స్కానింగుల కోసం పడిగాపులు
  • టెస్టులు పూర్తయినోళ్లకు టైమ్ కు రాని రిపోర్టులు
  • ఎంఆర్ఐ మేషీన్ పనిచేయక ఆగుతున్న ఆపరేషన్లు
  • డాక్టర్లు అందుబాటులో లేక ప్రైవేటులో పరీక్షలు
  • జేబులు ఖాళీ చేసుకుంటున్న రోగులు

వరంగల్‍, వెలుగు : వరంగల్‍ ఎంజీఎం హాస్పిటల్‍ కు వచ్చే పేషెంట్లు టెస్టులు, స్కానింగ్‍ చేయించుకోవడానికి అరిగోస పడుతున్నారు. ఓపీ కోసం ఉదయం ఆరు గంటలకు వచ్చి లైన్లలో నిలబడే పేషెంట్లు టెస్టుల కోసం ల్యాబ్‍లు, ఎక్స్​రే సెంటర్ల వద్ద వీల్‍ చైర్లు, స్ట్రెచర్లపై గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది. వృద్ధులైతే ఓపిక లేక కిందనే కూర్చుంటున్నారు. ట్రీట్‍మెంట్‍ కోసం ఎంజీఎంకు వచ్చేవారి సంఖ్య డబుల్‍ కాగా, ఆ స్థాయిలో ఏర్పాట్లు చేయకపోవడం, మెడికల్‍ కిట్లు, సిబ్బంది లేక తిప్పలు తప్పడం లేదు. అలాగే స్టాఫ్​కూడా మధ్యాహ్నం దాటగానే 'టైం అయిపోయింది. తెల్లారి రండి' అనే సమాధానం చెప్పి పంపిస్తున్నారు. దీంతో వందల కిలోమీటర్ల నుంచి వచ్చి గంటలకొద్దీ లైన్లలో ఎదురుచూసిన పేషెంట్లు ఏం చేయాలో తెలియక ప్రైవేటుకు పోవడమో, ఇంటికి వచ్చి మళ్లీ రావడమో చేస్తున్నారు.  

డబుల్‍ అయిన ఓపీ  

గతంలో రోజూ 1500 వరకు ఉండే ఎంజీఎం హాస్పిటల్‍ ఓపీ.. మూడు, నాలుగు నెలలుగా పెరిగి దాదాపు 3500 వరకు నమోదవుతోంది. ఇందులో సగం కంటే ఎక్కువ మందికి వ్యాధి ఏంటో తెలుసుకునేందుకు డాక్టర్లు టెస్టులు, స్కానింగులు రాస్తున్నారు. పేషెంట్లు ఎక్కువగా వచ్చే సోమ, బుధవారాల్లో సగటున ఒక్కో ల్యాబ్‍లో 600 నుంచి 650 టెస్టులు నమోదవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.    

డాక్టర్లు.. ఫుల్‍ టైం డ్యూటీ చేయట్లే

ఎంజీఎంలోని పాథాలజీ, మైక్రో బయాలజీ, బయో కెమిస్ట్రీ ల్యాబ్‍లు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండు షిఫ్టుల్లో పనిచేయాల్సి ఉంటుంది. కాగా, టెస్టుల తర్వాత వ్యాధి తీవ్రత ఏంటో తేల్చాల్సిన డాక్టర్లు మధ్యాహ్నం తర్వాత అందుబాటులో ఉండట్లేదనే ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రైవేట్‍ హాస్పిటల్స్​లో పనిచేస్తుండడంతో చాలామంది డాక్టర్లు, టెక్నీషియన్లు సమయపాలన పాటించడం లేదు. ఇదే అదునుగా డాక్టర్లు లేరనే సాకుతో సిబ్బంది కూడా టెస్టుల కోసం వచ్చేవారిని వెనక్కి పంపిస్తున్నారు. ప్రైవేట్‍ ల్యాబుల్లో చేయించుకోవాలని ఉచిత సలహా ఇస్తున్నారు. ఇక ఎంజీఎం ల్యాబుల్లో టెక్నీషియన్లు ఉదయమే పేషెంట్ల నుంచి శాంపిల్స్​తీసుకుని పరీక్షలు చేసినా అధికారికంగా రిపోర్ట్​ఇవ్వాల్సిన డాక్టర్లు లేని కారణంగా అదేరోజు ఇవ్వలేకపోతున్నారు. రిపోర్టు తీసుకోవడం, మళ్లీ ట్రీట్‍మెంట్‍ కోసం మరోసారి తిరగాల్సివస్తోంది.    

ప్రైవేటులో ఎంఆర్‍ఐ స్కాన్‍ రూ.7 వేలు

ఉత్తర తెలంగాణ పెద్దదిక్కుగా చెప్పుకునే ఎంజీఎంలో ఉన్న ఒక్కగానొక్క ఎంఆర్‍ఐ (మాగ్నెటిక్‍ రెసోనెన్స్ ఇమేజింగ్‍) మెషీన్​పనిచేయడం లేదు. ఇదేగాక వరంగల్‍ కాకతీయ మెడికల్‍ కాలేజీలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీఎంఎస్‍ఎస్‍వై సూపర్‍ స్పెషాలిటీ హాస్పిటల్‍లోని పేషెంట్లకు సైతం ఇక్కడే స్కానింగ్​రాసేవారు. ఎక్స్​రే, సీటీ స్కానింగ్‍లో వ్యాధి నిర్ధారణ కాని వారికి ఎంఆర్‍ఐ చేసి సకాలంలో ఆపరేషన్లు చేసేవారు. కాగా, 20 రోజులుగా ఎంఆర్​ఐ మెషీన్​పనిచేయకపోవడంతో హాస్పిటల్‍లో అడ్మిట్​అయిన పేషెంట్లు స్కానింగ్​కోసం బయటకు వెళ్లాల్సి వస్తోంది. ఎంజీఎంలో ఉచితంగా చేయించుకోవాల్సిన టెస్ట్​ను ప్రైవేట్‍ సెంటర్లలో రూ.7 వేల వరకు పెట్టి చేయించుకుంటున్నారు. కొందరు పేద రోగులు ఆర్థిక ఇబ్బందులతో  ఎంఆర్‍ఐ తీసుకోవడంలో ఆలస్యం అవుతుండటంతో ఆపరేషన్లు నిలిచిపోతున్నాయి. సకాలంలో చేయాల్సిన సర్జరీలు లేట్‍ కావడంతో పేషెంట్ల ప్రాణాల మీదకొస్తోంది. 

టెస్టులు బయట చేయించుకున్నం 

మా పాపకు ఆరోగ్యం బాగా లేకుంటే ఎంజీఎం తీసుకొచ్చినం. డాక్టర్లు టెస్టులు రాసిన్రు. ల్యాబ్‍ కు పోతే 'డాక్టర్లు, స్టాఫ్ లేరు. రిపోర్టులు లేట్​అయితయ్​’ అని చెప్పిన్రు. ఓ అడ్రస్​చెప్పి అక్కడ చేయించుకొని రమ్మన్నరు. చిన్న పిల్లల ఆరోగ్యం కావడంతో భయంతో బయట టెస్టులు చేయిచి తీసుకచ్చినం. – ప్రవళిక, ఆత్మకూర్‍ మండలం

కొత్త ఎంఆర్‍ఐ మెషీన్​ కోసం ఎదురుచూస్తున్నం

ఎంజీఎంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎంఆర్‍ఐ మెషీన్​చాలా పాతది. గతంలో చాలాసార్లు రిపేర్లు చేయించినం. ఈ మధ్య  మళ్లీ మదర్‍ బోర్డ్​దెబ్బతిన్నది. పెద్ద మొత్తంలో ఖర్చుచేసి రిపేర్‍ చేయించినా ప్రయోజనం ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన కొత్త మెషీన్​కోసం ఎదురుచూస్తున్నాం. అది త్వరగా వచ్చేలా చర్యలు తీసుకుంటాం. – డాక్టర్‍ చంద్రశేఖర్‍  (ఎంజీఎం సూపరింటెండెంట్‍)