మర్యాద పురుషోత్తముడు..!

మర్యాద పురుషోత్తముడు..!

 భారతీయుల ఉచ్ఛ్వాసా నిశ్వాసల్లో  కొలువైన శ్రీరామచంద్రుల వారి బాల స్వరూపం.. తాను జన్మించి నడయాడిన అయోధ్యలో భారత జనులందరి హృదయ సామ్రాట్ గా కొలువుదీరబోతున్న శుభ సందర్భంగా ‘కలియుగ దీపావళి’ వేడుక మన కనుల ముందు జనవరి 22న ఆవిష్కృతం కాబోతోంది. సనాతన భారతీయులందరికీ శుభాకాంక్షలు. ఈ శుభ సందర్భాన సనాతన భారతజాతి విజయానికి, పౌరుషానికి త్యాగానికి సమర్పిత భావానికి, స్వాభిమాన  స్ఫూర్తిని అందించే ప్రేరణదాయకమైన అయోధ్య రామ జన్మభూమి ఉద్యమ  పోరాటంలో నిలిచిన ప్రతి ఒక్కరిని స్మరించుకునే బాధ్యత మన అందరిదీ.

భారతీయుల చిరకాల ధార్మిక వాంఛ..

వాస్తవ గత చరిత్రను మరుగునపడేలా చేసిన  దుశ్చర్యను 492  సంవత్సరాలుగా ఎన్నో పర్యాయాలు రామ మందిర అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం76 సార్లు ఘర్షణలు జరిగాయి. స్వాతంత్ర్యానంతరం రాజ్యాంగబద్ధంగా, కిందిస్థాయి న్యాయస్థానాల నుంచి దేశంలో అత్యున్నత న్యాయస్థానంలో సమగ్రమైన విచారణ జరుపుతూ అసలు వాస్తవ చరిత్రను ప్రపంచానికి తెలియజేస్తూ, భారత పురావస్తు శాఖ ఆధ్వర్యంలో జరిపిన చారిత్రక తవ్వకాలు, పౌరాణిక సాక్ష్యాలు, ఫొటోలు, వేద సాహిత్య ఇతిహాస ఆధారాలను పరిగణనలోనికి తీసుకుని, సుప్రీంకోర్టు ఐదుగురు న్యాయమూర్తుల పీఠం నవంబర్ 9, 2019న ఏకాభిప్రాయంతో ఈ 14 వేల చదరపు అడుగుల భూమి ఆ బాలరామునికి చెందినదే’ అని ప్రజాస్వామ్యబద్ధంగా   చారిత్రక తీర్పును ఇచ్చింది. 

కె.కె నాయర్​ చిరస్మరణీయుడు

1949 సంవత్సరంలో శ్రీరామ జన్మభూమి ప్రదేశంలో బాలరాముడు వెలసిన సమయంలో ఆ జిల్లా మెజిస్ట్రేట్​గా ఉన్న కె.కె నాయర్, ఆనాడు చూపిన ధైర్యాన్ని నేడు ప్రతి ఒక్కరం గుర్తు చేసుకోవాలి. అప్పటి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడిని తట్టుకొని తన ఉద్యోగాన్ని సైతం పణంగా పెట్టి బాల రాముడి మూర్తికి శాశ్వత నిత్య పూజలు  జరిగేలా చొరవ తీసుకొని ప్రజల హృదయంలో నేటికీ నిలిచి ఉన్నాడు. 

కామేశ్వర్​ చౌపాల్​ వేసిన తొలి ఇటుక

నిరంతర  పోరాట ఫలితంగా 9 నవంబర్ 1989న శ్రీరామ జన్మభూమిలో పూజనీయ ధర్మ పరిరక్షణ యోగుల సమక్షంలో, సామాజిక సమరసతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన బడుగు, బలహీన వర్గాలకు చెందిన రామ భక్తుడు  కామేశ్వర్ చౌపాల్  తొలి ఇటుక  వేయగా పూజ జరిగింది. 

ప్రాణాలు పణంగా పెట్టిన కరసేవకులు

1992 డిసెంబర్ 6వ తేదీన యావత్ భారతదేశం నుంచి తరలివచ్చిన రామభక్తులైన కరసేవకులు చేసిన ధర్మకార్యానికి ఆ రామచంద్రుల వారి దీవెనలు ఆశీస్సులు లభించినట్లయింది. అలా 1992 డిసెంబర్ 6న జరిగిన  ఈ కరసేవ చారిత్రాత్మక ధార్మిక సంకేతంగా చరిత్రలో నిలిచిపోయింది. ప్రాణాలను పణంగా పెట్టి కరసేవలో  కదం తొక్కి పాల్గొన్న రామభక్తుల చరిత్ర శాశ్వతంగా నిలిచిపోయింది. గుజరాత్ లోని సోమనాథ్ ఆలయం నుంచి అయోధ్య వరకు సాగిన రథయాత్ర ప్రపంచం రామతత్వం తెలుసుకునేలా ఎల్​కే అద్వానీ  ధార్మిక సారథ్యం నిలిచింది.  పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత పుల్లారెడ్డి నిరుపమానసేవలు స్మరించుకోవాల్సిన తరుణం నేడు.  

శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్రం

రామమందిర నిర్మాణకార్యంలో భారత ప్రభుత్వం ఫిబ్రవరి 5. 2020 నాడు ‘శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్రం అయోధ్య’ పేరుతో ధార్మిక ట్రస్టును ఏర్పాటు చేసింది.  అయోధ్య రామాలయానికి చెందిన 70 ఎకరాల భూమిని ట్రస్టుకు అప్పగించింది.  విశ్వవ్యాప్తమైన ధార్మిక కార్యక్రమానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా భూమి పూజ జరిగింది. దాదాపు 3 వేలకుపైగా పవిత్ర నదులు తీర్థ క్షేత్రాల నుంచి తీర్థ జలాన్ని,   సేకరించిన పవిత్రమైన మట్టిని శంకుస్థాపన కార్యక్రమంలో
ఉపయోగించారు. 

పురుషోత్తముడు

త్రేతాయుగంలో తండ్రికిచ్చిన మాటకోసం అరణ్యవాసం చేస్తూ మూర్తీభవించిన రామతత్వంతో అన్ని వర్గాల ప్రజలకు ఆదర్శ రాముడు అయ్యాడు.  సమాజంలోని చివరి స్థాయిలో ఉన్న బలహీన, పీడిత, ఉపేక్షిత, వర్గాల ప్రజలతో తన స్నేహబంధాన్ని , తన ఆచరణాత్మక ఆదర్శ జీవనంతో సమస్త ప్రాణుల మెప్పును పొందాడు శ్రీరాముడు. అధర్మ మార్గంలో నడుస్తున్న రాక్షసులను వధించి ‘ధర్మో రక్షతి రక్షితః’అనే తత్వాన్ని విశ్వ వ్యాప్తం చేశాడు.  రామ రాజ్యం అంతటా పరస్పర ప్రేమ, సద్భావన, స్నేహం జాలి, దయ, మమతా, అనురాగాలకు బాంధవ్యాల ఆలవాలంగా భారతీయ జీవన విధానాన్ని అందించాడు. అందుకే ‘మర్యాద పురుషోత్తముడు’ అని  నేటికీ కీర్తిస్తున్నాం.

సనాతన ధర్మానికి దారి అయోధ్య రాముడు

జనవరి 22, 2024 మందిరంలో బాల రాముని ప్రాణ ప్రతిష్ఠ జరిగిన  తర్వాత దశల వారీగా రామ భక్తులందరూ దర్శించుకునేలా అన్ని సౌకర్యాలను, ఏర్పాట్లను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర అయోధ్య ఏర్పాట్లు చేసింది. ఆధునిక రైల్వే స్టేషన్, విమానాశ్రయాన్ని సైతం భక్తులకు ఇప్పటికే అందుబాటులోకి తెచ్చింది. ఆ పురుషోత్తమునికి నేటి  కలియుగంలో జరుగుతున్న పట్టాభిషేకమే ఇది.

రామతత్వమే అస్తిత్వం

140  కోట్ల భారతీయుల ఆత్మారాముడు,  ధర్మానికి నిలువెత్తు నిదర్శనమై భారత జాతీయ స్వాభిమాన సంకేతంగా ఆలయ నిర్మాణం జరిగింది.‘రామో విగ్రహవాన్  ధర్మః’ అను సనాతన వాక్కును అనుసరించి ‘మూర్తీభవించిన ధర్మ స్వరూపమే శ్రీరాముడు’.  శ్రీరామ జన్మభూమిలో భవ్యమైన రామ మందిర నిర్మాణం కావాలని భారతీయ ఆలోచనకు శాశ్వత సనాతన భారతీయ ధార్మిక వేడుక మన కళ్ల ముందు నేడు నిలువబోతోంది. ఆనందం అందరి కళ్ళలో శాశ్వతంగా నిలుస్తున్న వేళ ఇది.  సమస్త భారత సమాజం లింగ, జాతి, వర్గ, వర్ణ, భాష , సంప్రదాయ, ప్రాంత విభేదాలను విడిచి, రామతత్వమే తమ అస్తిత్వంగా భావిస్తున్నది.

- వాణి సక్కుబాయి