రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి..భద్రాద్రి జిల్లా ఐలాపురంలో ఘటన

రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి..భద్రాద్రి జిల్లా ఐలాపురంలో ఘటన
  •     భద్రాద్రి జిల్లా ఐలాపురంలో లారీ, బైక్‌‌‌‌ ఢీకొని ఇద్దరు యువకులు...
  •     పాల్వంచలో లారీని ఢీకొట్టిన కారు, చిన్నారి మృతి, నలుగురికి గాయాలు

పినపాక, వెలుగు : భద్రాద్రి జిల్లాలో బుధవారం జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు చనిపోగా, మరో నలుగురు గాయపడ్డారు. భద్రాద్రి జిల్లా మణుగూరు మండలం కమలాపురం గ్రామానికి చెందిన దర్రాజు కిశోర్‌‌‌‌ (25), బట్టా ప్రశాంత్‌‌‌‌ (26) కలిసి గొట్టెల్ల గ్రామంలో జరిగిన ఓ ఫంక్షన్‌‌‌‌కు హాజరయ్యారు. అనంతరం బైక్‌‌‌‌పై తిరిగి గ్రామానికి వెళ్తున్నారు. 

ఈ క్రమంలో పినపాక మండలం ఐలాపురం శివారులోని పెద్దవాగు బ్రిడ్జి వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో కిశోర్‌‌‌‌ అక్కడికక్కడే చనిపోగా, ప్రశాంత్‌‌‌‌ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు ప్రశాంత్‌‌‌‌ను 108లో మణుగూరుకు తరలిస్తుండగా.. మార్గమధ్యలో చనిపోయాడు. విషయం తెలుసుకున్న ఏడూళ్లబయ్యారం పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.

లారీని ఢీకొట్టిన కారు, చిన్నారి మృతి

పాల్వంచ, వెలుగు : ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ఓ చిన్నారి చనిపోగా, మరో నలుగురికి గాయాలు అయ్యాయి. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదం భద్రాద్రి కొత్తగూ డెం  జిల్లా పాల్వంచ పట్టణంలోని ఇందిరా కాలనీ సమీపంలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఏపీలోని శ్రీకాకుళానికి చెందిన కృష్ణ కేవశ తన భార్య పద్మావతి, కూతురు బోడ హవ్య, మనవరాలు ఆయిత్య (4)తో కలిసి మధిరలో ఉంటున్న కొడుకు ఇంటికి వచ్చాడు.

 అక్కడి నుంచి భద్రాచలంలో సీతారాములను దర్శించుకునేందుకు కారులో బయలుదేరారు. ఈ క్రమంలో పాల్వంచ ఇందిరా కాలనీ సమీపంలోకి రాగానే రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ప్రమాదంలో ఆయిత్య అక్కడికక్కడే చనిపోగా, కృష్ణ కేశవ, పద్మావతి, హవ్యతో పాటు కారు డ్రైవర్‌‌‌‌ కృష్ణకు గాయాలయ్యాయి. 

వీరిని కొత్తగూడెం హాస్పిటల్‌‌‌‌కు తరలించారు. కృష్ణకేశవ, పద్మావతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాద సమాచారం తెలుసుకున్న పాల్వంచ రూరల్‌‌‌‌ ఎస్సై సురేశ్‌‌‌‌ ఘటనాస్థలాన్ని పరిశీలించి, వివరాలు సేకరించారు.