
యాదాద్రి, వెలుగు : లారీ అదుపుతప్పి షాపులోకి దూసుకెళ్లడంతో ఇద్దరు చనిపోగా, మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ ప్రమాదం యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణంలో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన చిలమామిడి రామకృష్ణ(35) అతడి అన్న కొడుకు సాయికుమార్ (22) తమ బంధువుల అమ్మాయికి పెండ్లి సంబంధం మాట్లాడేందుకు భువనగిరికి వచ్చారు. ఈ క్రమంలో కొన్ని రకాల వస్తువులు కొనుకున్న అనంతరం పట్టణంలోని జగదేవ్‌పూర్ చౌరస్తా వద్దకు చేరుకున్నారు. ఇదే సమయంలో జగదేవ్‌పూర్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీ అదుపుతప్పి షాపుల వైపు దూసుకొచ్చింది. పార్క్ చేసిన బైక్‌పై నుంచి వచ్చి అక్కడే ఉన్న పలువురిని ఢీకొట్టింది.
ప్రమాదంలో రామకృష్ణ అక్కడికక్కడే చనిపోగా... సాయికుమార్‌తో పాటు రామన్నపేట మండలం తుమ్మలగూడెం గ్రామానికి చెందిన భీమారి శివసాయికుమార్, మరో ఇద్దరు గాయపడ్డారు. గమనించిన స్థానికులు గాయపడిన వారిని హాస్పిటల్‌కు తరలించగా.. ట్రీట్‌మెంట్ తీసుకుంటూ సాయికుమార్ చనిపోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై లక్ష్మీనారాయణ తెలిపారు. విషయం తెలుసుకున్న భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు.