అర్థరాత్రి హైవేపై లారీ బీభత్సం...మూడు ఏనుగులు మృతి

అర్థరాత్రి హైవేపై లారీ బీభత్సం...మూడు ఏనుగులు మృతి

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో లారీ ఢీకొనడంతో మూడు ఏనుగులు  మృతి చెందాయి. పలమనేరు జాతీయ రహదారిపై జగమర్ల క్రాస్ వద్ద మూడు ఏనుగులు రోడ్డు దాటుతుండగా  లారీ ఢీకొట్టింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనాస్థలానికి  చేరుకుని విచారణ చేపట్టారు. రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొనడంతో మూడు ఏనుగులు చనిపోయాయని తెలిపారు.

జూన్ 14వ తేదీ అర్థరాత్రి బూతలబండ మలుపు వద్ద  ఏనుగులను చెన్నైకి కూరగాయల లోడ్తో వెళ్తున్న లారీ బలంగా  ఢీకొట్టింది. ఈ ఘటనలో మూడు ఏనుగులు చెల్లాచెదురుగా పడిపోయి మృతి చెందాయి. వీటిలో  ఒక పెద్ద మగ ఏనుగు, రెండు ఏనుగు పిల్లలు ఉన్నాయి. అయితే ప్రమాదం ధాటికి లారీ ముందు భాగం నుజ్జు నుజ్జు అయింది. ప్రమాదం జరిగిన తర్వాత లారీ డ్రైవర్ పరారయ్యాడు. ఈ ఘటనతో హైవేపై రెండు వైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. దీంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.  

లారీ డ్రైవర్ అతివేగంగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని  చిత్తూరు డీఎఫ్వో చైతన్యకుమార్ రెడ్డి తెలిపారు. వన్యప్రాణి సంరక్షణ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.  మృతి చెందిన ఏనుగులను ఎక్స్ కవేటర్ సాయంతో సమీప అడవిలోకి తరలించారు.