ప్రేమిస్తున్నానని చెబుతూనే ఎలా ముక్కలు చేస్తరు : స్మృతి ఇరానీ

ప్రేమిస్తున్నానని చెబుతూనే ఎలా ముక్కలు చేస్తరు : స్మృతి ఇరానీ

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్‌ హత్య కేసుపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ స్పందించారు. ఘోరమైన హత్యను మనం తక్కువ చేస్తున్నామని అనిపిస్తోందన్నారు. ఈ హత్యకు పాల్పడిన వ్యక్తిపై దృష్టి పెట్టాలని చెప్పారు. అతడికి శిక్ష నుంచి తప్పించుకునే అవకాశం ఇవ్వకూడదని పేర్కొన్నారు. దీనిపై చర్చించాల్సిన అవసరం ఉందని  అభిప్రాయపడ్డారు. ఓ చర్చావేదికలో భాగంగా అడిగిన ప్రశ్నలకు ఆమె ఈవిధంగా సమాధానం ఇచ్చారు. 

ఎంతగా ఆవేశం వచ్చినా ఎవరూ ఒక మహిళను ముక్కలుగా చేయరని అన్నారు. తాను ప్రేమిస్తున్నానని చెబుతూనే ఆమెపై హింసకు ఎలా పాల్పడతారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. శ్రద్ధా పై చాలా రోజులుగా వేధింపులు జరుగుతున్నా తెలిసిన వాళ్లు ఎందుకు మాట్లాడలేదని స్మృతి ఇరానీ ప్రశ్నించారు. మహిళల భద్రత గురించి మాట్లాడేప్పుడు.. సన్నిహిత భాగస్వాములు, కుటుంబసభ్యులు, బంధువుల చేతుల్లో వారు ఎదుర్కొనే హింస గురించి చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె అన్నారు. పెద్దగా చదువుకోని పురుషులు మహిళలపై చేయిచేసుకుంటారని గతంలో అనుకునేవాళ్లం. కానీ ఇప్పుడు చదువుతో సంబంధం లేకుండా గృహహింస కనిపిస్తోందని స్మృతి ఇరానీ చెప్పారు.