చెన్నై: ప్రియురాలు బ్రేకప్ చెప్పిందనే డిప్రెషన్‌తో తన మెర్సిడిజ్ కారుకు నిప్పు పెట్టాడో డాక్టర్. కిందటి గురువారం తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో జరిగిందీ ఘటన. ‘కాంచీపురంలోని ఓ ప్రైవేటు మెడికల్ కాలేజీలో తన తోటి స్టూడెంట్ను సదరు డాక్టర్ ప్రేమించాడు. అయితే కొన్నేళ్ల కిందటే వీరిద్దరికీ బ్రేకప్ అయ్యింది. దీంతో అతడు డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. ప్రస్తుతం రిహాబిలిటేషన్ సెంటర్లో ఉన్న 29 ఏండ్ల డాక్టర్.. డిప్రెషన్ నుంచి బయటపడేందుకు థెరపీ తీసుకుంటున్నాడు” అని పోలీసులు వివరించారు.
కారుకు నిప్పు పెట్టిన తర్వాత అందులోనే కూర్చుని అతడు ఆత్మహత్యకు యత్నించాడని అనుమానిస్తున్నారు. ‘‘గతంలో తన ప్రియురాలితో గడిపిన చెరువు దగ్గరే ఈ ఘటన జరిగింది. కారుకు నిప్పుపెట్టిన తర్వాత అతడు అందులోనే కూర్చున్నాడు. పొగకు ఊపిరాడకపోవడంతో బయటికి వచ్చాడు” అని పోలీసులు చెప్పారు. స్థానికులు ఫైర్ సర్వీస్‌కి ఫోన్ చేశారని, అయితే అప్పటికే కారు పూర్తిగా కాలిపోయిందని తెలిపారు. ఆ టైమ్‌లో కారులో అతడి ప్రియురాలు లేదని చెప్పారు. ఆమె నంబర్‌ను ట్రేస్ చేశామని, క్షేమంగా ఉందని వెల్లడించారు.