సాఫ్ట్​వేర్ సరిచేయక ముందే సబ్సిడీ పాయే!

సాఫ్ట్​వేర్ సరిచేయక ముందే సబ్సిడీ పాయే!
  • అధికారుల తప్పులతో ఎల్ఆర్ఎస్​ రాయితీకి దూరమైన జనం
  • ఎన్వోసీలు తెచ్చినా ప్రొహిబిటెడ్  జాబితా నుంచి ప్లాట్లను తొలగించని అధికారులు
  • మండలం, విలేజీ పేర్ల సవరణలోనూ సమస్యలు

హన్మకొండకు చెందిన ఓ మహిళకు జీడబ్ల్యూఎంసీ పరిధిలోని పైడిపల్లిలో గల 1245 సర్వే నంబర్ లో ప్లాట్ ఉంది. ఈ సర్వే నంబర్ లోని 5, 6, 9 ప్లాట్లకు ఫీజు జనరేట్ కావడంతో ప్లాట్ల ఓనర్లు ఫీజు చెల్లించారు. మిగతా ప్లాట్లు ఎల్ఆర్ఎస్  పోర్టల్ లో ప్రొహిబిటెడ్/ఎఫ్ టీఎల్ గా కనిపిస్తున్నాయి. ఈ సర్వే నంబర్  ప్రొహిబిటెడ్ లో లేదని వరంగల్  సబ్  రిజిస్ట్రార్  ధ్రువీకరిస్తూ ప్లాట్ల ఓనర్లకు ఎన్వోసీ కూడా జారీ చేశారు. సదరు మహిళ కూడా ఎన్వోసీతో పాటు ప్లాట్  డాక్యుమెంట్  జిరాక్స్ ను టౌన్  ప్లానింగ్  సిబ్బందికి, చీఫ్  టౌన్  ప్లానింగ్  ఆఫీసర్ కు దరఖాస్తుతో పాటు అందజేశారు. 

ఇది జరిగి నెల రోజులు దాటినా ఇప్పటి వరకు ఫీజు ఇంటిమేషన్  లెటర్  జనరేట్  కాలేదు. ఇంకా ఎల్1 ‌‌‌‌- ఇరిగేషన్, రెవెన్యూ, టౌన్  ప్లానింగ్  ప్రొహిబిటెడ్ గానే చూపిస్తోంది. ఇలాంటి అప్లికేషన్లు ఒక్క వరంగల్ నగరంలోనే 11 వేల వరకు పెండింగ్ లో ఉన్నాయి.

కరీంనగర్, వెలుగు: ప్రభుత్వ, ఎండోమెంట్, వక్ఫ్, శిఖం, అసైన్డ్  తదితర భూములు కాకపోయినా, కోర్టు కేసులు లేకపోయినా ఎల్ఆర్ఎస్  పోర్టల్ లో లక్షలాది ప్లాట్లను అకారణంగా ప్రొహిబిటెడ్/ఎఫ్ టీఎల్  కేటగిరీలో చేర్చి, ఆ ప్లాట్ల ఓనర్లకు అధికారులు వేదన మిగిల్చారు. ఆఫీసర్ల తప్పిదం, సాఫ్ట్ వేర్  లోపాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా జనం తిప్పలు పడుతున్నారు. సబ్  రిజిస్ట్రార్  ఆఫీసుకు వెళ్లి నో అబ్జెక్షన్  సర్టిఫికెట్(ఎన్ఓసీ) తీసుకొచ్చి మున్సిపల్  ఆఫీసుల్లో ఇచ్చి నెల రోజులు దాటినా సమస్య పరిష్కారం కాలేదు. శనివారం వరకు వేచి చూసినా తమ ప్లాట్లను ప్రొహిబిటెడ్  నుంచి తొలగించకపోవడంతో ఫీజు చెల్లించలేకపోయారు. క్షేత్ర స్థాయిలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా సర్కార్  ప్రకటించిన 25 శాతం రాయితీకి లక్షలాది మంది దరఖాస్తుదారులు దూరమయ్యారు. 

లక్షన్నరకుపైగా బాధితులు.. 

అకారణంగా ప్రొహిబిటెడ్/ఎఫ్ టీఎల్  అని చూపుతున్న ప్లాట్లు రాష్ట్రవ్యాప్తంగా లక్షన్నరకుపైగా ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్లంతా సబ్ రిజిస్ట్రార్ల నుంచి నో అబ్జెక్షన్  సర్టిఫికెట్ తెచ్చి ఇచ్చినా టౌన్  ప్లానింగ్  ఆఫీసర్లు ఆ ప్లాట్లను ప్రొహిబిటెడ్  జాబితా నుంచి తొలగించడం లేదు. ఒక్క కరీంనగర్  సబ్  రిజిస్ట్రార్  పరిధిలోనే 2 వేలకుపైగా ఎన్వోసీలు జారీ అయ్యాయంటే రాష్ట్రవ్యాప్తంగా జారీ అయిన ఎన్వోసీలు ఏ సంఖ్యలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మున్సిపాల్టీల్లో ఎల్ఆర్ఎస్  సెక్షన్  చూస్తున్న టౌన్  ప్లానింగ్ సిబ్బంది సాఫ్ట్ వేర్  సమస్య అంటూ తప్పించుకుంటున్నారు. 25 శాతం రాయితీతో ఎల్ఆర్ఎస్  చార్జీల చెల్లింపు ప్రక్రియ ప్రారంభమైన మొదటి 20 రోజుల వరకు ఫీజు ఇంటిమేషన్  లెటర్లు జనరేట్  అయినట్లు చూపిన ప్లాట్లు, ఆ తర్వాత ప్రొహిబిటెడ్  లిస్టులోకి వెళ్లాయి. ఒకే సర్వే నంబర్ లో ఒక ప్లాట్ కు ఫీజు జనరేట్  అయి, పక్క ప్లాట్ కు ఫీజు ఇంటిమేషన్  లెటర్  రాకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 

మండలం, విలేజ్​ పేర్ల సవరణలోనూ సమస్యలే..

చాలా మంది ప్లాట్ల ఓనర్లు ఇంటర్నెట్  సెంటర్లు, మీ సేవా కేంద్రాల నిర్వాహకుల సాయంతో ఎల్ఆర్ఎస్ కు అప్లై చేశారు. ఈక్రమంలో కమ్యూనికేషన్  గ్యాప్  వల్ల కొందరు ఊరు, మండలం పేర్లు తప్పుగా ఎంట్రీ చేశారు. ఇలాంటి ప్లాట్ల ఓనర్లు మున్సిపాలిటీల్లో దరఖాస్తు చేసుకుంటే లొకేషన్  చేంజ్  చేసుకునే వెసులుబాటు ఉంది. అయితే ఒక మున్సిపాలిటీ నుంచి మరో మున్సిపాలిటీకి లేదా గ్రామపంచాయతీకి మాత్రమే లొకేషన్  చేంజ్  అవుతుంది. కానీ, ఒక మున్సిపల్  కార్పొరేషన్  లిమిట్స్ లో ఒక  రెవెన్యూ విలేజీ నుంచి మరో రెవెన్యూ విలేజీకి, ఒక మండలం నుంచి మరో మండలానికి లొకేషన్  చేంజ్ కావడం లేదు. ఇది కూడా దరఖాస్తుదారులకు ఇబ్బందిగా  మారింది. 

అప్పుడు ధరణి.. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ 

బీఆర్ఎస్  హయాంలో చాలా వ్యవసాయ భూములను అకారణంగా ప్రొహిబిటెడ్  లిస్టులోకి చేర్చడంతో  రైతులు ఇబ్బందులకు గురయ్యారు. ఒక సర్వే నంబర్ లోని కొంత భూమిపై కోర్టు కేసు ఉన్నా, అందులో కొంత భూమిని ప్రభుత్వ అవసరాలకు సేకరించి ఉన్నా.. మొత్తం భూమిని నిషేధిత జాబితాలో చేర్చడంతో ఇక్కట్ల పాలైన విషయం తెలిసిందే. ఇప్పుడు ఎల్ఆర్ఎస్  పోర్టల్  విషయంలోనూ ధరణి అనుభవాలను ప్లాట్ల ఓనర్లు గుర్తు చేసుకుంటున్నారు.