ఇందూరు అడ్డాగా లక్కీ డ్రాలు

ఇందూరు అడ్డాగా లక్కీ డ్రాలు
  •     నిబంధనలకు విరుద్దంగా నిర్వహణ
  •     రూలింగ్​ పార్టీ లీడర్ల అండదండలు

నిజామాబాద్, వెలుగు: ఉమ్మడి జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా లక్కీ డ్రాలు నిర్వహిస్తూ.. సామాన్యులను ముంచుతున్నారు. వాళ్లకు బీఆర్​ఎస్​ లీడర్ల అండదండలు ఉండటంతోనే పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. దుకాణాలను, సంస్థలను ఎంటర్ ప్రైజెస్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుని లక్కీ డ్రాలు పెడుతున్నారు. వేలాది మంది సభ్యులను చేర్చుకొని కోట్ల రూపాయాలతో స్కీమ్ లు​ నిర్వహిస్తున్నారు. ప్రతి నెలా ఒక రోజు లక్కీ డ్రా తీసి, విజేతలకు బహుమతులు, వస్తువులను అంటగడుతూ.. కొత్తవారికి ఆశలు రేపుతున్నారు. 

మధ్యతరగతి ఉద్యోగులే లక్ష్యంగా...

ఉమ్మడి జిల్లాలో సుమారు 30వరకు ఎంటర్ ప్రైజెస్​లు ఉన్నాయి. నిజామాబాద్ పాటు నవీపేట్, వర్ని, బోధన్, బాన్సువాడ, కామారెడ్డి లోనూ లక్కీ డ్రాల దందా నడుపుతున్నారు. పేదలు మధ్యతరగతి ఉద్యోగులను టార్గెట్​ చేస్తున్నారు. షైన్, షైన్1, బెస్ట్, స్టార్, సిటీ, బ్రైట్ స్టార్, అర్బన్, టూస్టార్ ఎంటర్ ప్రైజెస్​ పేరుతో లక్కీ డ్రా స్కీమ్ లు ఉన్నాయి. ఒక్కొక్కరి నుంచి రూ. వెయ్యి నుంచి రూ.1500 వసూలు చేసి 3వేల మంది అయ్యాక లక్కీ డ్రాలు తీస్తున్నారు. ఒక్కో స్కీం రూ. 30 లక్షల నుంచి ప్రారంభమై రూ. కోటి వరకూ నడుస్తోంది. ప్రతి నెలా డ్రాలు తీసి విజేతలకు బంగారం, వెండి, ఫర్నిచర్, టీవీలు, సెల్ ఫోన్లు ఇస్తున్నారు. కొంతమంది నిర్వాహకులు నాసిరకం వస్తువులను ఇస్తున్నట్టు పలువురు తెలిపారు. స్కీమ్​ లో లాభం లేనట్టు కనిపిస్తే.. మధ్యలోనే నిలిపేసి పరారవుతున్నారు. లక్కీడ్రా స్కీంలు బహిరంగంగానే జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. గతంలో రెండు సార్లు లక్కీడ్రా స్కీమ్ కంపెనీలపై నామమాత్రపు దాడులు చేశారు. 

అయినా నిర్వాహకులు యథావిధిగా మోసాలకు పాల్పడుతున్నారు. అధికార పార్టీ లీడర్లు ఈ స్కీమ్ లు నడపడంలో కీలకంగా ఉన్నారని, డబ్బులకు ఢోకా ఉండదని నిర్వాహుకులు భరోసా ఇస్తున్నారు. వాట్సాప్​ గ్రూప్ లను క్రియేట్ చేసి అందులో సభ్యులకు డ్రాల నిర్వహణ, విజేతల వివరాలకు వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. లీడర్ల పాత్ర ఉందని, ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. 

చేతులు మారుతున్న రూ. కోట్లు.. 

రెండేండ్లలో సుమారు రూ.100 కోట్ల దందా నడిచినట్టు తెలుస్తోంది. 60 డ్రాలను నిర్వహిస్తామని పేర్కొన్న స్కీమ్ కంపెనీలు 2-3 డ్రాలు నిర్వహించి, కొన్నిటిని మధ్యలోనే ఎత్తేశారు. ఎడాది కిందట నగరంలో షైన్ ఎంటర్ ప్రైజెస్ సంస్థ రూ.11 కోట్లకు పైనే మోసగించి బోర్డు తిప్పేసింది. తాజాగా మళ్లీ 350 మంది సభ్యులను ఓ డ్రాలో రూ. 65 లక్షల వసూళ్లు చేసి మోసగించింది. దీంతో బాధితులు బుధవారం వన్​ టౌన్​ పీఎస్​లో ఫిర్యాదు చేశారు. ఇప్పటివరకు ఈ షైన్​ సంస్థలో సుమారు 5 వేల మంది సభ్యులు ఉన్నారు. నిజామాబాద్ నగరంలో మరో రెండు సంస్థలు ఏడాది క్రితం రూ. 8 కోట్లు వసూళ్లకు పాల్పడి ఇటీవలే దుకాణం ఎత్తేసింది . ఇందల్వాయి మండల కేంద్రంలోని లక్కీ డ్రా నిర్వాహకులు సుమారు రూ.8 కోట్ల వరకు వసూలు చేసి సంస్థ బోర్డు తిప్పేసింది. గత రెండేళ్లలో లక్కీ డ్రాలకు సంబంధించి నాలుగు కేసులు నమోదయ్యాయి. 

మోసాలపై కేంద్రహోంశాఖకు ఫిర్యాదు చేస్తాం.. 

లక్కీడ్రా స్కీమ్ మోసాలపై కేంద్రహోంశాఖ, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురికి  ఫిర్యాదు చేస్తాం. వీటిలో బీఆర్​ఎస్​ లీడర్ల పాత్ర ఉంది.  వీటివల్ల సామాన్య, మధ్యతరగతి ప్రజలు దోపిడీ కి గురవుతున్నరు. జిల్లాలో సుమారు  30 ఎంటర్​ ప్రైజెస్​ లు రూల్స్​ కు విరుద్ధంగా నడుపుతున్నారు.  లక్కీ స్కీమ్స్​లో ప్రమేయం ఉన్న వారిని అరెస్ట్ చేయాలి. బాధితులపక్షాన న్యాయపోరాటం చేస్తాం 

– ధన్​ పాల్ సూర్య నారాయణ బీజేపీ ప్రతినిధి 

 చర్యలు చేపడుతాం.. 

 లక్కీ డ్రా స్కీమ్ ల కంపెనీలపై నిఘా పెంచాం. మోసాలపై ఫిర్యాదులు అందాయి. మనీ ల్యాండరింగ్​ యాక్ట్​  ప్రకారం నిర్వాహకులపై చర్యలు తీసుకుంటాం. తెలంగాణ చిట్​ ఫండ్ యాక్ట్ ప్రకారం ఛీటింగ్ చేసిన వారి ఆస్తులను జప్తు చేస్తాం. ప్రస్తుతం  షైన్ కంపెనీపై కేసు నమోదు చేశాం.

– వెంకటేశ్వర్లు, ఏసీపీ,  నిజామాబాద్​.