
- ప్రస్తుత కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బదిలీ
రాజన్నసిరిసిల్ల, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బదిలీ అయ్యారు. కొత్త కలెక్టర్‌గా ఎం.హరితను నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె ప్రస్తుతం ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. సందీప్‌కుమార్ ఝాను ఆర్‌అండ్‌బీ స్పెషల్ సెక్రటరీగా పోస్టింగ్ ఇచ్చారు.
వివాదాలతోనే సావాసం
ఇప్పటిదాకా ఇక్కడ పనిచేసిన రాజన్నసిరిసిల్ల కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా నిత్యం వివాదాలతోనే వార్తల్లో నిలిచారు. గతేడాది జూన్ 16న బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ 14 నెలలపాటు పనిచేశారు. దురుసు ప్రవర్తన, ప్రజాప్రతినిధులను లెక్కచేయకపోవడం వంటి ఆరోపణలున్నాయి. ఉద్యోగుల బదిలీల్లోనూ ఇష్టానుసారంగా వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి. హైకోర్టు మందలింపులు, ప్రొటోకాల్ఉల్లంఘనలు, ఉద్యోగుల బదిలీలు.. ఇలా కలెక్టర్ తరచూ వివాదాలతోనే ఆయన పదవీకాలం కొనసాగింది.
అభయాంజనేయస్వామికి మొక్కులు
సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బదిలీ కావడంపై సిరిసిల్లలోని బీసీ సంఘాల నేతలు, కలెక్టర్ బాధితులు కొబ్బరి కాయలు కొట్టి అభయాంజనేయస్వామకి మొక్కులు చెల్లించుకున్నారు. కలెక్టర్‌ను బదిలీ చేయడంపై సీఎం రేవంత్ రెడ్డికి క్షీరాభిషేకం చేశారు.