ప్రభుత్వ స్కూల్లో టాయిలెట్ క్లీన్ చేసిన ఎంపీ జనార్ధన్ మిశ్రా

ప్రభుత్వ స్కూల్లో టాయిలెట్ క్లీన్ చేసిన ఎంపీ జనార్ధన్ మిశ్రా

భోపాల్ : మధ్యప్రదేశ్‌ బీజేపీ ఎంపీ జనార్దన్ మిశ్రా మరోసారి వార్తల్లో నిలిచారు. ఈనెల 22వ తేదీన మౌగంజ్‌లోని ఖత్‌ఖారీ ప్రభుత్వ బాలికల పాఠశాలను సందర్శించారు. స్కూల్‌లో మరుగుదొడ్డి పూర్తిగా అపరిశుభ్రంగా ఉండడంతో ఎంపీ జనార్దన్ మిశ్రా.. వెంటనే తన చేతులతో బాత్రూమ్ ను శుభ్రంగా కడిగారు. ఎంపీ జనార్దన్ మిశ్రా టాయిలెట్‌ను శుభ్రం చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. వాస్తవానికి బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం కోసం వచ్చిన ఎంపీ జనార్దన్‌ మిశ్రా.. ఇలా బాత్రూం, లెట్రీన్‌ క్లీన్‌ చేశారు. 

బీజేపీ ఎంపీ జనార్దన్ మిశ్రా టాయిలెట్‌ క్లీన్ చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఎంపీగా ఉన్న సమయంలోనే రెండు సార్లు పాఠశాలలోని మరుగుదొడ్లను శుభ్రం చేశారు. పరిసరాలు, మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచుకోవాలంటూ ప్రజలకు, విద్యార్థులకు సందేశాన్ని కూడా ఇచ్చారు. 2014లో బీజేపీ ఎంపీ జనార్దన్ మిశ్రాను స్వచ్ఛ భారత్ మిషన్ కింద పరిశుభ్రతకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారంటూ నెటిజన్లు గుర్తు చేసుకుంటున్నారు. ఈనెల 17వ తేదీ ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన రోజు నుంచి మహాత్మా గాంధీ పుట్టినరోజు అక్టోబర్ 2 వరకు ‘క్లీనెస్ డ్రైవ్‌’ కార్యక్రమాన్ని  బీజేపీ యువజన విభాగం నిర్వహిస్తోంది.