బోరుబావిలో పడ్డ బాలుడు సేఫ్

బోరుబావిలో పడ్డ బాలుడు సేఫ్

మధ్యప్రదేశ్‌లోని విదిషా జిల్లాలో బోరుబావిలో పడిపోయిన 7 ఏళ్ల బాలుడిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు 48 గంటల తర్వాత సురక్షితంగా బయటికి తీశారు. వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. మార్చి14న జిల్లాలోని లాటరి తహసీల్ పరిధిలోని ఖేర్ఖేడీ పత్తర్ గ్రామంలో ఉదయం 11 గంటల ప్రాంతంలో లోకేష్ అహిర్వార్ అనే బాలుడు ఆడుకుంటూ వెళ్లి ప్రమాదావశాత్తు 60 అడుగుల బోరు బావిలో జారి పడ్డాడు. గమనించిన కుటుంబసభ్యులు, స్థానికులు వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న రెస్క్యూ టీమ్ చిన్నారిని సురక్షితంగా బయటకు తీసేందుకు ఆపరేషన్ ప్రారంభించిందని లాటరి సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ హర్షల్ చౌదరి తెలిపారు. జేసీబీ యంత్రాన్ని (ఎర్త్‌మూవర్) అమర్చడం ద్వారా చిన్నారిని సురక్షితంగా రక్షించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. బాలుడి పరిస్థితిని తెలుసుకోవడానికి కెమెరాను కూడా వినియోగించారు. ఎట్టకేలకు 48గంటల నిరీక్షణ తర్వాత తాజాగా ఆ బాలున్ని రెస్క్యూ సిబ్బంది ప్రాణాలతో కాపాడారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తోటి స్నేహితులతో కలిసి మార్చి 14న ఉదయం 11 గంటల ప్రాంతంలో ఆడుకోవడానికి లోకేశ్ వెళ్లాడు. ఆ సమయంలోనే ఆ ప్రాంతానికి ఓ కోతుల గుంపు వచ్చింది. వాటిని చూసిన చిన్నారులు ఒక్కసారిగా భయాందోళనకు గురై.. పరిగెత్తారు. లోకేశ్ కూడా ఎదురుగా ఉన్న పొలం వైపుగా పరిగెత్తడం ప్రారంభించాడు. కోతులు ఎక్కడ తనను కరిచేస్తాయోమోనని భయపడి.. పొలంలో తెరచి ఉన్న 60 అడుగుల లోతైన బోరు బావిలో పడిపోయాడు. స్థానికుల సాయంతో విషయం తెలుసుకున్న రెస్క్యూ .. ఇయ్యాళ బాలున్ని బయటికి తీసి, ఆస్పత్రికి తరలించారు.