అజిత్ లిస్ట్ తోనే గవర్నర్ సరేనన్నారు

అజిత్ లిస్ట్ తోనే గవర్నర్ సరేనన్నారు

న్యూఢిల్లీ:మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటును సవాలు చేస్తూ  శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్  కూటమి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్​పై రెండోరోజైన సోమవారం కూడా వాదనలు జరిగాయి. సీఎం ఫడ్నవీస్​కు మెజార్టీ ఎమ్మెల్యేల బలంలేదని,  గవర్నర్​ ఇచ్చిన 14 రోజుల గడువు కంటే ముందే ఫ్లోర్​ టెస్టుకు ఆదేశించాలని కూటమి తరఫు అడ్వొకేట్లు కోర్టును కోరారు. బీజేపీకి మద్దతిస్తున్నట్లు ఎన్సీపీకి చెందిన 54 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లెటర్​ను ఆ పార్టీ ఎల్పీ లీడర్​ అజిత్​ పవార్​ గవర్నర్​కు ఇచ్చారని, ఆ తర్వాతే గవర్నర్​ తన విచక్షణ ప్రకారం ఫడ్నవీస్​తో సీఎంగా ప్రమాణం చేయించారని కేంద్రం, మహారాష్ట్ర బీజేపీ తరఫు అడ్వొకేట్లు తెలిపారు. రెండు పక్షాల వాదనలు విన్న తర్వాత జస్టిస్​ ఎన్వీ రమణ నేతృత్వంలో జస్టిస్​ అశోక్​ భూషణ్​, జస్టిస్​ సంజీవ్​ ఖన్నా బెంచ్​ తీర్పును మంగళవారానికి రిజర్వ్​ చేసింది. గతంలో ఇలాంటి కేసుల్లో ఫ్లోర్​ టెస్టుకు సుప్రీం ఆదేశించిందంటూ జస్టిస్ సంజీవ్​ ఖన్నా కామెంట్​ చేసిన నేపథ్యంలో ఇవాళ ఉదయం 10:30కు వెలువడనున్న తీర్పు.. ఫడ్నవీస్​ను బలం నిరూపించుకోవాలని ఆదేశించేలా ఉండొచ్చని న్యాయనిపుణులు భావిస్తున్నారు.

ఎన్సీపీ సపోర్టుతోనే సర్కారు ఏర్పాటైంది: కేంద్రం, బీజేపీ

బీజేపీకి మద్దతిస్తున్నట్లు ఎన్సీపీకి చెందిన 54 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను ఆ పార్టీ ఎల్పీ లీడర్​ అజిత్​ పవార్​ గవర్నర్​కు ఇచ్చారని, ఆ తర్వాతే  ఫడ్నవిస్ మెజార్టీ క్లెయిమ్​ చేసుకున్నారని, మద్దతు లేఖల ఆధారంగానే గవర్నర్​ నిర్ణయం తీసుకున్నారని కేంద్రం తరఫున సొలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహతా కోర్టుకు వివరించారు. వాటికి సంబంధించిన రెండు లెటర్లను బెంచ్​ముందుంచారు. ఎన్సీపీ లెజిస్లేటివ్​ పార్టీ లీడర్​ హోదాలోనే అజిత్​ పవార్​ బీజేపీకి సపోర్ట్​ ఇవ్వాలన్న నిర్ణయం తీసుకున్నారని, ఆ మేరకే ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లెటర్​ను గవర్నర్​కు ఇచ్చారని అజిత్​ తరఫు న్యాయవాది మనీందర్​ సింగ్​ తెలిపారు. పవార్​ ఫ్యామిలీ గొడవలతో తమకు సంబంధం లేదని, అజిత్​ పవార్​ ఇచ్చిన లెటర్​లో ఎమ్మెల్యేల సంతకాలపై ఎవరికీ అనుమానాలు లేవని, అవి ఫోర్జరీ చేశారని ఎన్సీపీ నేతలు కూడా ఆరోపించడంలేదని మహారాష్ట్ర బీజేపీ తరఫున వాదించిన  సీనియర్​ అడ్వొకేట్​ ముకుల్​ రోహత్గీ కోర్టుకు తెలిపారు. గవర్నర్​ నిర్ణయాల్లో కలుగజేసుకునే అధికారం కోర్టుకు లేదని, ఫ్లోర్​ టెస్టుకు 14 రోజుల టైమ్​ ఇవ్వడం సరైందేనని, స్పీకర్ ఎన్నికత తర్వాతే బలపరీక్ష నిర్వహించాలని  రోహత్గీ అన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ సంజీవ్​ ఖన్నా కలగజేసుకుంటూ.. గతంలో వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు సంబంధించి ఇలాంటి వివాదాలు తలెత్తినప్పుడు 24 గంటల్లో లేదా 48 గంటల్లో బలం నిరూపించుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చిన విషయాన్ని గుర్తుచేశారు.

బలముంటే బీజేపీకి భయమెందుకు?: కూటమి

బీజేపీ చాలా మోసపూరితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిందని, ఫడ్నవీస్​కు మద్దతిస్తున్నామని ఎన్సీపీ ఎమ్మెల్యేల్లో ఒక్కరు కూడా చెప్పలేదని ఎన్సీపీ, కాంగ్రెస్​ తరఫు అడ్వొకేట్​ అభిషేక్​ సింఘ్వీ వాదించారు. ‘‘గవర్నర్​కు అజిత్​ పవార్​ ఇచ్చింది.. 54 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన జాబితా మాత్రమే. అది మద్దతు లెటర్​ కానేకాదు. మెజార్టీ ఎమ్మెల్యేలు మహా వికాస్ కూటమి వైపే ఉన్నారు. అసెంబ్లీలో బలం నిరూపించుకోడానికి కూటమి రెడీ ఉంది. బీజేపీ కూడా తనకు బలముందని చెప్పుకుంటున్నది. కాబట్టి 24 గంటల్లోపు ఫ్లోర్​ టెస్టుకు ఆదేశిస్తే ఎవరిబలం ఏంతుదో తేలిపోతుంది”అని సింఘ్వీ తెలిపారు. శివసేన తరఫున కపిల్​ సిబాల్ వాదన వినిపిస్తూ.. కూటమి ప్రభుత్వం ఏర్పడొద్దన్న ఉద్దేశంతోనే హడావుడిగా తెల్లవారుజామున రాష్ట్రపతి పాలన ఎత్తేసి, ఉదయానికల్లా ఫడ్నవీస్​తో సీఎంగా ప్రమాణం చేయించారని ఆరోపించారు. అజిత్​ పవార్​ ఎన్సీపీ ఎల్పీ లీడర్​ కాదని తెలిపే అఫిడవిట్లను సిబాల్​ కోర్టుకు సమర్పించారు.