మహారాష్ట్ర ఇష్యూపై పార్లమెంట్లో రచ్చ రచ్చ

మహారాష్ట్ర ఇష్యూపై పార్లమెంట్లో రచ్చ రచ్చ

న్యూఢిల్లీమహారాష్ట్ర పొలిటికల్​ క్రైసిస్ సోమవారం​పార్లమెంట్​లో  దుమారం లేపింది. మహారాష్ట్ర అంశంపై చర్చ జరగాలని కాంగ్రెస్ సహా ప్రతిపక్ష నేతలు రెండు సభల్లో పట్టుబట్టారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ, నినాదాలు చేస్తూ వెల్​లోకి దూసుకెళ్లారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని డిమాండ్​ చేశారు. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు అంశం కోర్టులో విచారణ జరుగుతుందని, దానిపై ఇప్పుడు చర్చించలేమని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్​ తెలిపారు. అయినా విపక్ష నేతలు ఆందోళన ఆపకపోవడంతో మార్షల్స్​ రంగంలోకి దిగి  ఆందోళన చేస్తున్న సభ్యులను బలవంతంగా బయటికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో మార్షల్స్ తమపై చేయిచేసుకున్నారంటూ కాంగ్రెస్​ పార్టీకి చెందిన ఇద్దరు మహిళా ఎంపీలు ఆరోపించారు. సభ మంగళవారానికి వాయిదాపడ్డ తర్వాత పార్లమెంట్​ ఆవరణలోని మహాత్ముడి విగ్రహం దగ్గర కాంగ్రెస్​ చీఫ్​ సోనియా గాంధీతోపాటు ముఖ్యనేతలు ‘డెమోక్రసీని హత్య చేయడం ఆపండి’ అంటూ ఫ్లెక్సి ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. కాంగ్రెస్, లెఫ్ట్, డీఎంకే సభ్యుల ఆందోళనల నేపథ్యంలో డిప్యూటీ చైర్మన్​ సభను మంగళవారానికి వాయిదా వేశారు.

ఉదయం లోక్​సభ ప్రారంభమైన వెంటనే కాంగ్రెస్ ఎంపీలు లేచి, మహారాష్ట్రలో  ప్రజస్వామ్యాన్ని కాపాడాలంటూ నినాదాలుచేస్తూ స్పీకర్​ పోడియాన్ని చుట్టుముట్టారు. ‘మహారాష్ట్రలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాక.. ఇక్కడ సభలో ప్రశ్నలు అడిగి మాత్రం ఉపయోగమేముంది. ఈరోజు(సోమవారం) క్వశ్చన్​ అవర్​లో ప్రశ్నలడిగే ప్రశ్నేలేదు’ అని రాహుల్​ గాంధీ అన్నారు. పలుమార్లు హెచ్చరించినా వినకపోవడంతో కాంగ్రెస్​ సభ్యులు హిబి ఎడెన్, టీఎన్​ ప్రథాపన్​లను స్పీకర్​ ఓంబిర్లా సస్పెండ్​ చేశారు. వారిని బయటికి పంపించాలంటూ మార్షల్స్​ను ఆదేశించారు. దీంతో కాంగ్రెస్​ సభ్యులు ఆందోళనలను మరింత తీవ్రంచేశారు. సభ నడిచే పరిస్థితి లేకపోవడంతో స్పీకర్​ సభను మంగళవారానికి వాయిదా వేశారు. ఒకవైపు కాంగ్రెస్​ సభ్యుల ఆందోళన కొనసాగుతుండగానే ప్రభుత్వం సభలో నాలుగు బిల్లులను ప్రవేశపెట్టింది. ఎస్పీజీ యాక్ట్​ సవరణ బిల్లు కూడా ఇందులో ఉంది. మహారాష్ట్ర అంశంపై లోక్​సభలో కాంగ్రెస్​ ఎంపీల తీరుకు  వెల్​లోకి దూసుకురావడం కరెక్ట్​ కాదని స్పీకర్​ ఓంబిర్లా అన్నారు. సభలో జరిగిన సంఘటనలతో హర్ట్​ అయ్యానని చెప్పారు. కాంగ్రెస్​ ఎంపీల తీరు అభ్యంతరకరమని, సహించలేనిదని స్పీకర్​ అన్నారు. సభ కార్యకలాపాలను అడ్డుకున్నందుకు ఎంపీలు హిబి ఎడెన్, టీఎన్​ ప్రతాపన్​లను స్పీకర్​ ఐదేళ్ల పాటు సస్పెండ్​ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.