మహా సముద్రం మూవీ రివ్యూ

V6 Velugu Posted on Oct 14, 2021

చిత్రం: మహా సముద్రం
నటీనటులు: శర్వానంద్, సిద్ధార్థ్, అదితీరావ్ హైదరి, అను ఇమ్మాన్యుయేల్, జగపతిబాబు, రావు రమేష్, గరుడ రామ్ తదితరులు
సంగీతం: చైతన్ భరద్వాజ్
సినిమాటోగ్రఫీ: రాజ్‌ తోట
మాటలు: సయ్యద్
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
కథ, స్క్రీన్‌ ప్లే, డైరెక్షన్: అజయ్ భూపతి

‘ఆర్‌‌ఎక్స్‌ 100’ చిత్రంతో తెలుగు సినిమాల్లో ఓ కొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేశాడు అజయ్ భూపతి. ఆయన రెండో సినిమా కావడం, శర్వానంద్‌ లాంట్ మంచి యాక్టర్‌‌ హీరో కావడంతో ‘మహా సముద్రం’పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. మరి ఇవాళ విడుదలైన ఈ సినిమా ఆ అంచనాలను అందుకుందా? ప్రేక్షకుల్ని మెప్పించిందా? ఓసారి పరిశీలిద్దాం.

కథ 

అర్జున్ (శర్వా), విజయ్ (సిద్ధు) చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. ఏదైనా బిజినెస్ చేసి మంచిగా సెటిలవ్వాలనేది అర్జున్ కోరిక. పోలీస్ అవ్వాలనేది విజయ్‌ ఆశయం. మహాలక్ష్మి (అదితి)తో విజయ్ ప్రేమలో ఉంటాడు. శ్వేతను అర్జున్ ప్రేమిస్తాడు. అంతా సాఫీగా సాగుతున్న సమయంలో వారి జీవితాల్లోకి వైజాగ్‌లో పేరు మోసిన స్మగ్లర్‌‌ ధనుంజయ్‌ (గరుడ రామ్) ప్రవేశిస్తాడు. ఊహించని పరిస్థితుల్లో విజయ్ కారణంగా ధనుంజయ్ తీవ్రంగా గాయపడతాడు. అతడు చనిపోయాడేమోనన్న భయంతో ఊరొదిలి పారిపోతాడు విజయ్. మహాను కూడా అతనితో పంపించాలని అర్జున్ ట్రై చేస్తాడు. కానీ వీలు కాదు. ఆ తర్వాత జరిగిన గొడవలో ధనుంజయ్‌ను చంపి, అతని స్థానంలో డాన్ అవుతాడు అర్జున్. కొన్నేళ్ల తర్వాత వైజాగ్ తిరిగొచ్చిన విజయ్‌కు తన ప్రేయసి మహా.. అర్జున్‌ దగ్గర కనిపించడంతో అపార్థం చేసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది, అసలు అర్జున్ దగ్గర మహా ఎందుకుంది, ఆ స్నేహితులిద్దరి జీవితాలు ఎలాంటి మలుపు తిరిగాయనేది మిగతా కథ.

విశ్లేషణ

మహా సముద్రం సినిమాను అనౌన్స్ చేసినప్పటి నుంచి దానిపై సినీ ప్రేమికులకు ఉన్నది ఒకే ఒక అభిప్రాయం.. అదో ప్రేమకథ అని. పైగా ఇమ్మెజరబుల్ లవ్ అనే క్యాప్షన్ కూడా ఇవ్వడంతో ఆ అభిప్రాయం మరింత బలపడింది. కానీ ఈ సినిమా మొత్తం వెతికినా కొలవలేనంత ప్రేమ ఏ కోశాన కూడా కనబడదు. సినిమాలో ప్రేమ ఒక భాగం మాత్రమే. అది కూడా చాలా చిన్న భాగం. ఓపక్క స్నేహం, అది తర్వాత వైరంగా మారిన వైనం.. ఈ మధ్యలో ప్రేమ పోషించే పాత్ర చాలా తక్కువ. తిరిగొచ్చిన విజయ్‌కు అర్జున్‌ దగ్గర మహా కనిపించేసరికి కోపం వచ్చేస్తుంది. నీ ఫ్రెండ్ నిన్ను మోసం చేశాడని ఎవరో చెబితే ఆ కోపం మరింత పెరిగిపోతుంది. పాపం ఆమె ప్రెగ్నెంట్ అయితే, ఇంట్లోవాళ్లు బైటికి గెంటేస్తే, అర్జున్‌ ఆదరించాడనే విషయం తెలియక తెగ రగిలిపోతాడు. అసలు నాలుగేళ్లు అతను ఏమైపోయాడో, అన్నేళ్లూ ఆ అభిమానాలూ ప్రేమలూ ఏమైపోయాయో దర్శకుడికి తెలియాలి. 

ఇద్దరు ప్రాణ స్నేహితులు శత్రువులుగా మారడమనేది కొత్త పాయింటేమీ కాదు. ఎన్టీఆర్, ఏఎన్నార్.. శోభన్‌బాబు, కృష్ణ లాంటి వారంతా చేసేసిన  సబ్జెక్ట్. అలాంటి పాయింట్‌ను తీసుకున్నప్పుడు కచ్చితంగా కొత్త ట్రీట్‌మెంట్ ఉండాలి. పైగా ఒకరి కోసం ఒకరు ప్రాణం పెట్టేసుకునేవారు గ్రేట్ ఎనిమీస్‌గా తయారవడానికి బలమైన కాన్‌ఫ్లిక్ట్ కావాలి. లేదంటే మొత్తం సినిమానే తేడా కొడుతుంది. ఈ మూవీ విషయంలో అదే జరిగింది. ఊరు వదిలి వెళ్లిపోతుంటే ప్రేమించిన అమ్మాయిని తీసుకెళ్లమని శర్వా చెప్తాడు. అందుకు సాయం చేస్తాడు కూడా. అయినా మహాను వదిలేసి అజయ్ ఎందుకు వెళ్లిపోతాడో జుట్టు పీక్కున్నా ప్రేక్షకుడికి అర్థం కాదు. ఒకవేళ అతడు మోసగాడా, సెకెండాఫ్‌లో విలన్‌గా చేంజ్ అవుతాడా అంటే అదీ లేదు. ఎందుకో వెళ్తాడు. ఇంకెందుకో తిరిగొస్తాడు. ఏవేవో కారణాలతో దోస్తుతో గొడవకు దిగుతాడు. ట్రైలర్స్‌లో కనిపించిన డెప్త్ ఈ మొత్తం కథలో ఎక్కడా కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగించక మానదు. 

బలమైన పాత్రలు ఉన్నాయి. చక్కని నటీనటులు ఉన్నారు. కానీ ఇంప్రెస్ చేసే కథ, మెస్మరైజ్ చేసే కథనం లేకపోవడమే మహా సముద్రానికి మైనస్ అయ్యిందని ఓ సాధారణ ప్రేక్షకుడు కూడా చెప్పేయగలడు. అటు ప్రేమకథలా అనిపించదు. ఇటు యాక్షన్ మూవీ కూడా కాదు. అటూ ఇటూ కాకుండా, క్లారిటీ లేకుండా మధ్యలో మిగిలిపోయింది. అర్జున్, శ్వేత.. విజయ్, మహా.. ఆ తర్వాత అర్జున్, మహాల మధ్య నడిచిన ప్రేమకథ.. ఎందులోనూ ఉన్నతమైన ప్రేమ లేకపోవడం మరో మైనస్. ‘ఆర్‌‌ఎక్స్‌’లో ఓ భగ్నప్రేమికుడి బాధను, ప్రేమను ఎంతో గొప్పగా చూపించిన డైరెక్టర్ అజయ్ భూపతి ఇందులో ప్రేమను సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయకపోవడమేమిటా అనిపిస్తుంది చూస్తున్నంతసేపు. ఆయన తొలి సినిమాలో మాదిరి ఊహించని ట్విస్టులు, సడెన్ షాకులు ఏమైనా ఉన్నాయా అంటే అదీ లేదు. పేలవంగా సాగిన ఫస్టాఫ్‌.. మరింత నీరసం తెప్పించే సెకెండాఫ్.. ఏం జరిగిందో అర్థం కాని క్లైమాక్స్‌.. అంతే.. అక్కడితో మహా సముద్రం కథ సమాప్తం. 

ఎవరెలా?

క్లాస్ సినిమాలతో మెప్పించే శర్వానంద్‌కు మాస్ అంతగా సూట్ కాదు. అయినా కూడా తన పాత్ర ఔచిత్యం దెబ్బ తినకుండా పర్‌‌ఫార్మ్ చేసే గొప్ప నటుడు తను. అందుకే అర్జున్ పాత్రలో అదరగొట్టాడు. ముఖ్యంగా కళ్లలో లోతైన భావాలను పలికించడం అతని శైలి. అది ఈ సినిమాకు చాలా బాగా ఉపయోగపడింది. ఏ ఒక్క సీన్‌లోనూ శర్వా బాగా చేయలేదే అనిపించకపోవడానికి కారణం అదే. సిద్ధార్థ తనకిది బెస్ట్ కమ్‌బ్యాక్ అన్నాడు. కానీ సినిమా చూస్తే అలా అనిపించదు. తనకు ఆ క్యారెక్టర్ సూట్ కాలేదనే ఫీలింగ్ వస్తుంది. కాస్త నెగిటివ్ షేడ్స్ కనిపించడంతో మున్ముందు ఏదైనా కొత్తగా ఉంటుందేమో అని ఆశించినవారికి నిరాశే మిగులుతుంది. మహా పాత్రలో అదితీరావ్ బాగుంది. కూల్‌గా, క్యూట్‌గా కనిపించి మెప్పిస్తుంది. అను ఇమ్మాన్యుయేల్‌కు మరో ప్రాధాన్యత లేని పాత్ర లభించింది. కేజీఎఫ్ ఇచ్చిన ఇమేజ్‌తో గరుడ రామ్‌ను ఓ రేంజ్‌లో ఊహిస్తాం. కానీ అంత లేదని త్వరగానే అర్థం చేసుకుంటాం. గూని బాబ్జీ పాత్రలో రావు రమేష్ బెస్ట్‌ అనిపించినా, ఆ పాత్ర కూడా సినిమాకు ప్లస్ అవ్వదు. జగపతి బాబు, శరణ్య మోహన్‌ల పాత్రలు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. మొత్తంగా మంచి కాస్ట్‌ దొరికినా వారి టాలెంట్‌కు తగ్గ రోల్స్‌ ఇవి కావని చెప్పొచ్చు

ఇక టెక్నికల్ విషయాలకొస్తే.. అందరూ మొదట దృష్టి పెట్టేది సంగీతం మీద. కానీ ఈసారి చైతన్ భరద్వాజ్‌కు ఎక్కువ మార్కులు వేయలేం. గతంలో అద్భుతమైన మెలోడీ పాటలు చేసిన తనకు.. ఈ సినిమాలో ఆ చాన్స్ దొరకలేదో ఏంటో తెలీదు కానీ.. గుర్తుండిపోయే పాట ఒక్కటీ లేదు. బ్యాగ్రౌండ్‌ స్కోర్‌‌ విషయంలో మాత్రం ఎప్పటిలాగే బెస్ట్ ఇచ్చాడు. రాజ్‌ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. టెక్నీషియన్స్ ఏం చేసినా బేసిగ్గా కథ, కథనాలే వీక్‌గా ఉండటంతో వేరే ఏ క్రాఫ్ట్‌ గురించి పెద్దగా మాట్లాడుకునే అవకాశం లేకపోయింది. దర్శకుడు తన రెండో మూవీ విషయంలో మరింత ఎఫర్ట్ పెడితే బాగుండుననిపిస్తోంది.

కొసమెరుపు: మహా సముద్రం.. అలలు అదుపు తప్పాయి.

మరిన్ని వార్తల కోసం:

మా దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి: ఎన్‌సీబీ

బాలీవుడ్ హీరోయిన్లకు ఈడీ సమన్లు

బీఎస్ఎఫ్ పరిధి పెంపు.. భగ్గుమంటున్న ప్రభుత్వాలు

Tagged REVIEW, tollywood, Actor Sharwanand, Aditi Rao Hydari, Siddharth, Maha Samudram, Anu Emmanuel

Latest Videos

Subscribe Now

More News