
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: సీపీఆర్‌పై అందరికీ అవగాహన ఉండాలని, ఆకస్మాత్తుగా కార్డియాక్ అరెస్ట్ కు గురైన వ్యక్తులకు సకాలంలో సీపీఆర్ చేస్తే వారి ప్రాణాలను కాపాడవచ్చని కలెక్టర్ విజయేందిర బోయి తెలిపారు. సోమవారం కలెక్టరేట్ లో వైద్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సీపీఆర్ అవగాహన కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. కార్డియాక్ హెల్త్ కేర్ వ్యవస్థను పటిష్టం చేసేందుకు జిల్లాలోనూ ఈ నెల 13 నుంచి 17 వరకు సీపీఆర్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సీపీఆర్ ఎలా చేయాలో మెడికల్ ఆఫీసర్లు మనుప్రియ, శివకాంత్ వివరించారు. అడిషనల్ కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, మధుసూదన్ నాయక్, డీఎంహెచ్‌వో పద్మజ, డిప్యూటీ డీఎంహెచ్ వో శశికాంత్, వివిధ శాఖల అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
హాస్టళ్లను రెగ్యులర్ గా చెక్ చేయండి
జిల్లా అధికారులు, మండలాల స్పెషల్ ఆఫీసర్లు ప్రతీ నెల హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లు, కేజీబీవీలను తనిఖీ చేయాలని కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. విద్యాలయాల్లో తనిఖీలకు సంబంధించిన రిపోర్ట్ ను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని చెప్పారు. సంక్షేమ వసతి గృహాల్లో పరిస్థితులను మెరుగుపరచడానికి కృషి చేయాలన్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం ఆహారం అందేలా చూడాలని, మెనూ పాటించని నిర్వాహకులకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని సూచించారు.
లింగ నిర్ధారణ చేస్తే జైలుకే..
లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే ఐదేళ్ల జైలుశిక్ష తప్పదని కలెక్టర్ విజయేందిర బోయి హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్ లో జిల్లాలోని ప్రైవేట్హాస్పిటల్స్ నిర్వాహలకుతో సమావేశమయ్యారు. ఆస్పత్రుల ఎదుట లింగ నిర్ధారణ పరీక్షలు నిషేధం అనే బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అబార్షన్ల వివరాలను తప్పనిసరిగా రికార్డు చేయాలని సూచించారు. బోర్డులపై ట్రీట్మెంట్ చార్జీల వివరాలను పేషెంట్లకు అర్థమయ్యేలా రాయాలని చెప్పారు. ఐఎంఏ జిల్లా ప్రెసిడెంట్ రామ్మోహన్, సీనియర్ డాక్టర్ శ్యామ్యూల్, డీఎంహెచ్ వో పద్మజ, ప్రైవేట్హాస్పిటల్స్యాజమాన్య ప్రతినిధులు పాల్గొన్నారు.
ప్రాణాలు రక్షించవచ్చు
గద్వాల, వెలుగు: ఉన్నట్టుండి గుండెపోటుకు గురైన వ్యక్తులకు సీపీఆర్ చేస్తే వారి ప్రాణాలు రక్షించవచ్చని కలెక్టర్ సంతోష్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ లో వైద్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సీపీఆర్అవగాహన కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. కార్డియాక్అరెస్ట్అయిన వ్యక్తి చాతిపై 30 సార్లు నొక్కి, రెండుసార్లు శ్వాస అందిస్తే బాధితుడి గుండె సాధారణ స్థితికి వస్తుందని చెప్పారు. దీనిపై జిల్లాలో ఈ నెల 17 వరకు అవేర్నెస్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అడిషనల్ కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నరసింహారావు, ఇన్చార్జి డీఎంహెచ్‌వో సిద్ధప్ప, డిప్యూటీ డీఎంహెచ్ వో సంధ్య కిరణ్మయి తదితరులున్నారు.
కలెక్టరేట్ లో ప్రతిజ్ఞ
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : సీపీఆర్ పై ప్రతీ ఒక్కరు అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ సూచించారు. సోమవారం కలెక్టరేట్ లో జిల్లా అధికారులతో సీపీఆర్ పై ప్రతిజ్ఞ చేయించారు. స్కూళ్లు, కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు.
దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి
ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ఫిర్యాదులు స్వీకరించారు. 48 దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు. అడిషనల్కలెక్టర్లు అమరేందర్, దేవసహాయం, డీఎంహెచ్‌వో రవికుమార్, కలెక్టరేట్ ఏవో చంద్రశేఖర్ తదితరులున్నారు.