లోన్ల పేరుతో రూ.3 కోట్లు ముంచిన్రు..ఫేక్ ఫైనాన్స్ సైట్తో బాధితులకు వల

లోన్ల పేరుతో రూ.3 కోట్లు ముంచిన్రు..ఫేక్ ఫైనాన్స్ సైట్తో బాధితులకు వల
  • ఏడుగురిని అరెస్టు చేసిన పోలీసులు

మహబూబ్​నగర్​ అర్బన్, వెలుగు: సైబర్​ నేరాలపై పట్టు సాధించిన ఓ ముఠా ఫేక్​ ఫైనాన్స్​ సైట్​ ద్వారా పలువురిని మోసం చేసి రూ.3 కోట్ల వరకు వసూలు చేసింది. ఈ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేసి ఏడుగురిని అరెస్ట్​ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను మహబూబ్​నగర్​ ఎస్పీ డి.జానకి శనివారం వెల్లడించారు. మహబూబ్​నగర్ రూరల్​ మండలం తువ్వగడ్డతండాకు చెందిన జర్పుల సురేందర్, కాట్రావత్​ హనుమంతు కోల్​కతాలో సైబర్ నేరగాళ్ల వద్ద ట్రైనింగ్​ తీసుకున్నారు.

 తర్వాత ఇదే తండాకు చెందిన మరికొందరు యువకులకు శిక్షణనిచ్చి ముఠాగా తయారుచేశారు. ఈ ముఠా ఫేస్​ బుక్​లో 'ధనా ఫైనాన్స్' పేరుతో ప్రచారం చేసింది. ఇది నమ్మిన నగరంలోని హనుమాన్​నగర్ కు చెందిన వాకిటి వంశీకృష్ణ తన పాన్ కార్డు, ఆధార్ కార్డును ధనా ఫైనాన్స్​ సైట్​లో అప్లోడ్ చేశాడు. ఆ తరువాత నిందితులు లోన్ సాంక్షన్​ ఫేక్​ లెటర్ ను వంశీకృష్ణకు పంపించారు. 

లోన్ మంజూరైందని నమ్మించి ప్రాసెసింగ్ ఫీజు, ఇన్సూరెన్స్, జీఎస్టీ, టీడీఎస్, మొదటి ఈఎంఐ పేరుతో రూ.75 వేలు వసూలు చేశారు. తర్వాత నిందితులు అందుబాటులో లేకపోవడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సైబర్​ క్రైమ్​ పోలీసులు దర్యాప్తు చేపట్టి.. జర్పుల సురేందర్​, కాట్రావత్​ హనుమంతు, వడ్త్యా రాజు, వత్స్య భాస్కర్​, కాట్రావత్​ నరేశ్​, రాత్లావత్​ సంతోశ్​, రాత్లావత్​ సోమలను నిందితులుగా గుర్తించి అరెస్టు చేశారు.

 వీరు ఇప్పటి వరకు దాదాపు వెయ్యి మందిని ఈ తరహాలో మోసం చేసి రూ.3 కోట్లు కాజేసినట్లు ఎస్​పీ తెలిపారు. వీరి వద్ద ల్యాప్​ టాప్​, ఆటో, బైక్​, రూ.1.50 లక్షలు, ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.