టార్గెట్ రీచ్ కాలే.. ప్రభుత్వ సెంటర్లకు వచ్చింది లక్ష మెట్రిక్​ టన్నుల వడ్లే

టార్గెట్ రీచ్ కాలే.. ప్రభుత్వ సెంటర్లకు వచ్చింది లక్ష మెట్రిక్​ టన్నుల వడ్లే
  • మిగతావి ప్రైవేట్​ వ్యాపారులు కొనేసిన్రు
  • నేటితో మూతపడనున్న కొనుగోలు సెంటర్లు
  • రైతుల ఖాతాల్లో జమ కాని వడ్ల పైసలు
  • ఇంకా పెండింగ్​లోనే రూ.60 కోట్లు

మహబూబ్​నగర్​, వెలుగు : యాసంగి వడ్ల సేకరణలో సివిల్​ సప్లై డిపార్టమెంట్ టార్గెట్​ మేరకు వడ్లను సేకరించలేదు. మహబూబ్​నగర్​ జిల్లాలో 60 శాతం వడ్లు ప్రైవేట్​ వ్యాపారులు కొనగా, మిగిలిన 40 శాతం వడ్లు మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేసింది. ప్రస్తుతం వడ్లు రావడం బంద్​ కావడంతో సెంటర్లు మూతపడ్డాయి.

టార్గెట్​ కంప్లీట్​ కాకుండానే..

మహబూబ్​నగర్​ జిల్లాలో ఈ యాసంగిలో 1.20 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. 3.50 లక్షల మెట్రిక్​ టన్నుల వడ్లు వస్తాయని అగ్రికల్చర్​ ఆఫీసర్లు అంచనా వేశారు. ఇందులో లక్ష మెట్రిక్​ టన్నులు తమ అవసరాల కోసం రైతులు స్టోర్​ చేసుకున్నారు. మిగిలిన 2.50 లక్షల మెట్రిక్​ టన్నుల వడ్లు ప్రభుత్వ సెంటర్ల ద్వారా కొనాలని సివిల్​ సప్లై అధికారులు భావించారు. కానీ, వరి కోతలు మొదలయ్యాక కేవలం 1.50 లక్షల మెట్రిక్​ టన్నుల వడ్లనే ప్రొక్యూర్​మెంట్​ చేయాలని నిర్ణయించింది.

ఐకేపీ ద్వారా 94 సెంటర్లను, పీఏసీఎస్​ 91, మెప్మా ఒకటి, డీసీఎంఎస్​ ద్వారా నాలుగు సెంటర్లను ఏప్రిల్​ 21 నుంచి ఓపెన్​ చేసి వడ్ల కొనుగోళ్లు ప్రారంభించారు. శనివారం నాటికి 1.06 లక్షల మెట్రిక్​ టన్నుల వడ్లు మాత్రమే కొన్నారు. ఇందులో 10,730  రైతుల నుంచి సేకరించిన 58,664 మెట్రిక్​ టన్నులకు సంబంధించి రూ.120 కోట్ల పేమెంట్లు జరిగాయి. మిగిలిన వడ్లకు సంబంధించి రూ.60 కోట్ల నుంచి రూ.80 కోట్ల వరకు పేమెంట్లు చేయాల్సి ఉంది. వడ్లు రావడం కూడా ఆగిపోవడంతో 190 సెంటర్లలో ఇప్పటికే 177 సెంటర్లు బంద్​ అయ్యాయి. సోమవారం మిగిలిన సెంటర్లు క్లోజ్​ కానున్నాయి.

60 శాతం వడ్లు ప్రైవేట్​ వ్యాపారుల వద్దకే..

2.50 లక్షల మెట్రిక్​ టన్నుల వడ్లల్లో కేవలం లక్ష మెట్రిక్​ టన్నులు మాత్రమే ప్రభుత్వ సెంటర్లకు రాగా, మిగిలిన 1.50 లక్షల మెట్రిక్​ టన్నుల వడ్లను రైతులు కర్ణాటక, తెలంగాణకు చెందిన ప్రైవేట్​ వ్యాపారులకు అమ్ముకున్నారు. మార్చి నుంచే వరి కోతలు మొదలు పెట్టినా, సర్కారు సెంటర్లను ఓపెన్​ చేయడం ఆలస్యం చేసింది. మార్చి చివరి వారం నుంచే వడ్లను ఆరబెట్టి పెట్టుకోగా, అకాల వర్షాలు పడడంతో బాలానగర్, మిడ్జిల్, చిన్నచింతకుంట, దేవరకద్ర, జడ్చర్ల, అడ్డాకుల, మూసాపేట, భూత్పూర్​ ప్రాంతాల్లో 20 వేల మెట్రిక్​ టన్నుల వడ్లు తడిసిపోయి రైతులు నష్టపోయారు. అకాల వర్షాల భయంతో మిగిలిన రైతులు వ్యాపారులకు రూ.1,500 నుంచి రూ.1,800  క్వింటాల్​ వడ్లను అమ్మేశారు. కోయిల్​కొండ, దేవరకద్ర, చిన్నచింతకుంట, కౌకుంట్ల ప్రాంతాల్లో కర్ణాటక వ్యాపారులు పెద్ద మొత్తంలో లారీలను దింపి వడ్లను కొనుగోలు చేసి తీసుకెళ్లారు. మిగతా ప్రాంతాల్లో ఉమ్మడి జిల్లాకు చెందిన వ్యాపారులు రైతుల నుంచి ఇవే రేట్లను కొన్నారు.

నిరుడు ఇదే సీన్..​

గతేడాది రాష్ర్ట ప్రభుత్వం యాసంగి వడ్ల కొనమని ప్రకటన చేసింది. రైతులు ఆందోళనలకు దిగడంతో చివరి క్షణంలో వడ్లను కొంటున్నట్లు ప్రకటన చేసింది. దీంతో ఆ సీజన్​లో కూడా ఏప్రిల్​ నుంచే సెంటర్ల ద్వారా వడ్లను సేకరించింది. కానీ, అప్పటికే వడ్లను ఆరబెట్టుకున్న రైతులు వ్యాపారులకే పంటను మొత్తం అమ్మేశారు. గత యాసంగి సీజన్​తో పోలిస్తే ఈ సీజన్​లో దాదాపు 5 వేల మెట్రిక్​ టన్నుల వడ్లను అదనంగా కొన్నట్లు ఆఫీసర్లు చెబుతున్నారు. 

సగం కూడా కొనలే..

నాగర్​ కర్నూల్, వెలుగు: జిల్లాలో 3.39 లక్షల మెట్రిక్​ టన్నుల వడ్లను కొనుగోలు చేయాలనే లక్ష్యంతో 214 సెంటర్లు ఓపెన్​ చేశారు. 25,417 మంది రైతుల నుంచి 1.60 లక్షల మెట్రిక్​ టన్నుల వడ్లు కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు రూ.224 కోట్లు రైతుల ఖాతాలో జమ చేశారు. ఇంకా 4,400 మంది రైతులకు రూ.50 కోట్లు చెల్లించాల్సి ఉంది. సెంటర్లు సకాలంలో ప్రారంభించక పోవడంతో రైతులు ప్రైవేట్​ వ్యాపారులకు వడ్లు అమ్ముకోవడంతో కేంద్రాలకు వడ్లు రాలేదని అంటున్నారు. ఇక సెంటర్లు ఓపెన్​ చేయక ముందు సన్నాహాక సమావేశాలని ఆర్భాటం చేసిన ఆఫీసర్లు, తరుగు, తాలు పేరుతో మిల్లర్లు అడ్డగోలుగా కట్​ చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేసినా పట్టించుకోలేదనే విమర్శలు వచ్చాయి.

10 శాతం ఎక్కువగానే కొన్నాం..

సివిల్​ సప్లై​ద్వారా 1.50 మెట్రిక్​ టన్నుల వడ్లను కొనాలని టార్గెట్​ పెట్టుకోగా, 190 సెంటర్ల ద్వారా 1.06 లక్షల మెట్రిక్​ టన్నుల వడ్లు కొన్నాం. గతేడాదితో పోలిస్తే ఈ సీజన్​లో 10 శాతం ఎక్కువగానే వడ్లు కొన్నాం. రైతులు సన్న వడ్లను కర్ణాటక వ్యాపారులకు అమ్మేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెంటర్లకు దొడ్డు వడ్లు మాత్రమే వచ్చాయి.

- ప్రవీణ్​, సివిల్​ సప్లై డీఎం