పాలమూరు టెన్త్ లో​ రిజల్ట్స్​ 30 శాతం పెరిగినయ్ : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్​ రెడ్డి

పాలమూరు టెన్త్ లో​ రిజల్ట్స్​ 30 శాతం పెరిగినయ్ : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్​ రెడ్డి
  • పాలమూరు గవర్నమెంట్​ కాలేజీల్లో పిల్లలను చేర్పించాలని పాలమూరు​ ఎమ్మెల్యే పిలుపు

మహబూబ్​నగర్​ కలెక్టరేట్/పాలమూరు, వెలుగు: ‘పాలమూరులో గతంలో టెన్త్​ రిజల్ట్స్​ 45 శాతం మించి రాలేదు. ఎమ్మెల్యేగా గెలిచాక నియోజకవర్గంలోని గవర్నమెంట్​ స్కూల్స్​ను విజిట్​ చేశా. అక్కడ డిజిటల్  బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు టెన్త్​ స్టూడెంట్లకు ఫ్రీగా డిజిటల్  కంటెంట్  స్టడీ మెటీరియల్  అందించా. దీంతో ఫలితాలు20 నుంచి 30 శాతం పెరిగాయి’ అని మహబూబ్​నగర్​ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్​ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్  కలెక్టరేట్​లో శనివారం మధ్యాహ్నం టెన్త్​ పాసైన స్టూడెంట్లకు ఎమ్మెల్యే  సౌజన్యంతో నిర్వహించిన కెరీర్  గైడెన్స్  కార్యక్రమానికి భారీగా స్టూడెంట్లు హాజరయ్యారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల విడుదలైన టెన్త్​ ఫలితాల్లో ప్రభుత్వ స్కూల్స్​లో చదువుతున్న స్టూడెంట్లు కార్పొరేట్​ స్కూల్స్​లో చదువుతున్న వారితో సమానంగా ఫలితాలు సాధించారని చెప్పారు. ఇంకా కొన్ని బడుల్లో ఉత్తీర్ణత శాతం తక్కువగా ఉందని, అలాంటి స్కూళ్లలో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. స్టూడెంట్లు పత్రికలు చదివితే పోటీ పరీక్షలకు ఉపయోగపడుతుందని చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లలను గవర్నమెంట్​ కాలేజీల్లో చేర్పించాలన్నారు. అత్యున్నతమైన విద్యను అందించేందుకు కాలేజీల్లో నిష్ణాతులైన లెక్చరర్లు ఉన్నారన్నారు.

 మహబూబ్​నగర్  ఫస్ట్  నవరత్నాలు ఆధ్వర్యంలో ఎప్​సెట్, నీట్  కోచింగ్  పొందిన స్టూడెంట్లలో 114 మందికి ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీలో రాష్ట్ర స్థాయి ర్యాంకులు వచ్చాయని, వచ్చే విద్యా సంవత్సరం రెండింతల ర్యాంకులు పాలమూరు బిడ్డలు సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.  అనంతరం  500 మార్కులకు పైగా సాధించిన స్టూడెంట్లను ఎమ్మెల్యే సన్మానించారు. ముడా, లైబ్రరీ చైర్మన్లు లక్ష్మణ్ యాదవ్, మల్లు నర్సింహారెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, డీఈవో ప్రవీణ్ కుమార్, డీఐఈవో కౌసర్  జహాన్  పాల్గొన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే కోయిల్​కొండ జంక్షన్​ వద్ద రూ.65 లక్షల అభివృద్ధి​పనులకు శంకుస్థాపన చేశారు.