
గద్వాల, వెలుగు: 12 ఏండ్ల కాలంలో నేతలు బాగుపడ్డారే తప్ప నడిగడ్డలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ విమర్శించారు. ఇక్కడి నేతలు దోచుకొని దాచుకోవడం తప్ప అభివృద్ధి చేయాలనే ఇంగిత జ్ఞానం లేదని మండిపడ్డారు.
పార్టీలు మారడం తప్ప అభివృద్ధిపై ధ్యాసలేదని పేర్కొన్నారు. నడిగడ్డ సమస్యలను పరిష్కరించాలని బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం గద్వాలలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి అనంతరం కలెక్టరేట్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తుమ్మిళ్ల, నెట్టెంపాడు, గట్టు లిఫ్ట్ , ఆర్డీఎస్ ప్రాజెక్టులు ఇంకా ఎందుకు పూర్తి చేయలేదని నిలదీశారు. ర్యాలంపాడ్ రిజర్వాయర్ కి లీకేజీలు ఏర్పడినా మరమ్మతులు చేయడం లేదని చెప్పారు.
కోర్టు భవనాల నిర్మాణంలో కూడా రాజకీయాలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. అనంతరం సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు. జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, రామచంద్రారెడ్డి, బండల వెంకట్రాములు, కృష్ణవేణి, బండల పద్మావతి, వెంకటేశ్వర్ రెడ్డి, బలిగేర శివారెడ్డి, రజక జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.