పోలీసును చితకబాది చెట్టుకు కట్టేసిన జనం 

పోలీసును చితకబాది చెట్టుకు కట్టేసిన జనం 

మత్తులో ఉన్న ఓ సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ) సొంత ఇంటికి బదులు మరో ఇంటి తలుపు తట్టి లోనికి వెళ్లాడు. అతను ఎవరో తెలియని స్థానికులు చితకబాది చెట్టుకు కట్టేశారు. ఈ ఘటన జడ్చర్ల పరిధిలోని రాజాపూర్ మండలంలో చోటు చేసుకుంది. బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా పోలీసు వర్గాల్లో చర్చాంశనీయంగా మారింది.

విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం.. జిల్లాలోని పోలీస్ స్టేషన్ కు చెందిన ఎస్ఐ శ్రీనివాసులు ఆ రోజు మద్యం తాగాడు.. ఆ మైకంలోనే తెల్లవారుజామున వాహనంలో ఇంటికి బయలుదేరాడు. అయితే ఇంటికి వెళ్లే దారిలో శుభకార్యం జరుగుతుండడంతో టెంటు వేశారు. వాహనం ఇంటి వరకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో వెంట వచ్చిన డ్రైవర్ వాహనాన్ని పక్క వీధిలో నిలిపి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో తన ఇంటికి మరో దారి గుండా నడుచుకుంటూ వెళ్లాడు. అయితే మద్యం మత్తులో ఉండడంతో పొరపాటున తన ఇల్లు అనుకోని వేరేవాళ్ల ఇంటి తలుపు తట్టాడు. అంతేకాదు లోపలికి వెళ్లే ప్రయత్నం చేయగా.. ఎవరో అనుకుని ఇంటివారి తోపాటు కాలనీవాసులు ఆయన్ని పట్టుకొని చితకబాదారు. 

అక్కడి నుంచి ఎస్ఐ వెళ్లేందుకు ప్రయత్నించగా జనం అతన్ని చెట్టుకు కట్టేశారు. తర్వాత వచ్చింది ఎస్సై అని తెలుసుకున్నారు. ఇంతలో పోలీసులు అక్కడకి  చేరుకున్నారు. అప్పటికే స్థానికులు వీడియోలు ఫోటోలను తీశారు. పోలీసులు సెల్ ఫోన్ లో నుంచి వాటిని తొలగించారు. ఎస్ఐ ని వివరణ కోరగా చిన్న గొడవ జరిగిందంటూ.. వివరాలు తెలిపేందుకు ఇష్టపడలేదు.