
‘ప్రకృతిలో ఉండే గాలి, నీరు, మొక్క, వస్తువు, ప్రాణి ఇలా ప్రతీదాంతో కనెక్ట్ అయిపోవచ్చు. ప్రకృతివల్ల మనల్ని మనం తెలుసుకోగలం. ప్రకృతి శరీరానికి ఒక మెడిసిన్ లాంటిది’ అని చెప్తుంటారు చాలామంది. అయితే, వీటిగురించి ఎడారి ప్రాంతాల్లో ఉండేవాళ్లకు అంతగా తెలిసుండదు. అందుకే, ప్రకృతిలో ఉన్న ప్రతీది ఒక చోట ఉండేలా ‘టోర్బా ఫామ్’ ఏర్పాటుచేసి, అందులో ఆర్గానిక్ ఫామ్ నడిపిస్తూ, వాటితో ప్రొడక్ట్స్ కూడా తయారుచేస్తున్నాడు ఖతార్‌కు చెందిన మొహమ్మద్ అల్– ఖతేర్.
ఖతేర్ తండ్రి అలీ ఆర్గానిక్ పంటలు పండించేవాడు. దానివల్ల చిన్నప్పటినుంచే ఫార్మింగ్‌పైన కొంత అవగాహన ఉంది ఖతేర్కు. ఒకసారి కాలు బెణికి, నడవడానికి ఇబ్బంది అయింది. ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా నొప్పి తగ్గలేదు. దాంతో ఖతేర్ వాళ్ల తాత ఔషద నూనెతో కొన్ని రోజులు మసాజ్ చేశాడు. నొప్పి పోయింది. ‘నూనె రాయడం వల్ల నొప్పి తగ్గడం ఏంటి?’ అని ఆశ్చర్యపోయి ప్రకృతి వైద్యం గురించి తెలుసుకోవడం మొదలుపెట్టాడు ఖతేర్. అప్పుడే ‘ప్రతి మొక్క విలువైనదే. చిన్న గడ్డిపోచని కూడా మెడిసిన్‌గా, ఎసెన్షియల్ ప్రొడక్ట్స్‌గా తయారుచేసి వాడుకోవచ్చు’ అని తెలుసుకున్నాడు. ‘ఏ మొక్క ఏ రోగానికి పనిచేస్తుంది? దేనివల్ల ఏ ఉపయోగం ఉంటుంది?’ అని స్టడీ చేశాడు. దీనికి ఖతేర్ చెల్లి ఫాత్మా సాయపడింది.
ప్రొడక్ట్స్ తయారుచేస్తూ...
కొన్ని రోజులకి ఫామ్ పెట్టాలనే ఆలోచన వచ్చింది ఈ ఇద్దరికి. దాంతో తండ్రి నడిపిస్తున్న ఆర్గానిక్ ఫామ్‌నే 2014లో ‘టోర్బా ఫామ్’గా మార్చాడు. ‘టోర్బా అంటే అరబిక్‌లో స్వచ్ఛమైన నేల అని అర్థం.’ 250 వేల చదరపు మీటర్లలో ఉన్న ఈ ఫామ్‌లో ఆర్గానిక్‌గా పండించిన కూరగాయలు, పండ్లు, పప్పులే కాకుండా మెడిసినల్‌గా ఉపయోగపడే వేల రకాల మొక్కల్ని కూడా పెంచుతున్నాడు. ఒక ల్యాబ్ పెట్టి వాటితో హెల్త్‌కు ఉపయోగపడే 60 రకాల మెడిసినల్ పౌడర్లు, నూనెలు, అత్తర్లు తయారుచేయిస్తున్నాడు. ఇవే కాకుండా విజిటర్స్ కోసం ఫామ్‌ని నేచర్‌కి దగ్గర ఉండేలా డిజైన్ చేయించాడు. అంటే పార్క్‌లు కట్టించి అందులో రకరకాల జంతువుల్ని, పక్షుల్ని పెట్టించాడు. వాటితో పాటు వాటర్ ఫాల్స్ కూడా ఏర్పాటు చేయించాడు. ఈ ఫామ్‌ని నడిపించడం కోసం అరవైమందిని పనిలో పెట్టుకున్నాడు. ఈ ఫామ్‌లో పండే వాటిని మార్కెట్లో అమ్ముతున్నారు.
‘ప్రపంచంలో ఉన్న ప్రతీ ఔషద మొక్కని మా ఫామ్‌లో పెంచుతున్నాం. విజిటర్లు ఇక్కడి పక్షులు, నీళ్ల శబ్దాలు వింటూ ఎంజాయ్ చేస్తారు. ఇక్కడికొచ్చిన వాళ్లలో చాలామంది ‘ప్రకృతికి కొంత దగ్గరయ్యామ’ని అంటుంటారు. నాకూ అలానే అనిపిస్తుంది’ అని చెప్పాడు మొహమ్మద్ అల్– ఖతేర్.