‘తౌక్టే’ బీభత్సం.. కొట్టుకుపోయిన నౌకలు

‘తౌక్టే’ బీభత్సం.. కొట్టుకుపోయిన నౌకలు
  • మహారాష్ట్ర, గోవా, గుజరాత్‌ వణుకుతున్నయ్‌‌
  • తౌక్టే ఎఫెక్ట్‌‌తో మహారాష్ట్రలో ఆరుగురు మృతి
  • ముంబైలో 5 గంటల్లో 15 సెం.మీ. వాన
  • కర్నాటకలో 121 గ్రామాలపై ప్రభావం
  • సీఎంలకు ప్రధాని మోడీ ఫోన్​

ముంబై: తౌక్టే తుఫాను అతి తీవ్రమవడంతో అరేబియా సముద్రం అల్లకల్లోలంగా మారింది. తుఫాను ప్రభావానికి పశ్చిమ తీర రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. కర్నాటక, మహారాష్ట్ర, కేరళ, గోవాలో కుండపోత వానలు పడుతున్నాయి. మహారాష్ట్రలోని రాయ్‌‌గఢ్‌‌లో రెడ్‌‌ అలర్ట్‌‌, ముంబైలో ఆరెంజ్‌‌ అలర్ట్‌‌ ప్రకటించారు. రాష్ట్రంలో వేర్వేరు సంఘటనల్లో ఆరుగురు చనిపోయినట్టు ప్రభుత్వం వెల్లడించింది. సింధుదుర్గ్‌‌  జిల్లాలోని ఆనంద్‌‌వాడీ హార్బర్‌‌లో రెండు బోట్లు కొట్టుకుపోయాయి. రెండు బోట్లలో కలిపి ఏడుగురు ఉన్నారని, వీళ్లలో ఒకరు మృతి చెందగా ముగ్గురు గల్లంతయ్యారని అధికారులు చెప్పారు. రాయ్‌‌గఢ్‌‌ జిల్లాలో ముగ్గురు, నవీముంబైలో ఇద్దరు చనిపోయారన్నారు. ముంబైలో సోమవారం 5 గంటల్లో 15.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. దీంతో ముంబై ఎయిర్‌‌పోర్టులో సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. లోకల్‌‌ రైళ్లనూ అధికారులు ఆపేశారు. ముంబైలో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ హెచ్చరించింది. రత్నగిరి, రాయ్‌‌గఢ్‌‌, సింధుదుర్గ్‌‌ జిల్లాల నుంచి 12 వేల మందిని తరలించామని అధికారులు చెప్పారు. తౌక్టే పరిస్థితిపై మహారాష్ట్ర, గుజరాత్‌‌, గోవా సీఎంలు, డయ్యూడామన్‌‌ ఎల్జీలతో ప్రధాని మోడీ మాట్లాడారు. 

కర్నాటకలో ఇప్పటివరకు ఆరుగురు మృతి
కర్నాటకలోని 22 తాలూకాల్లో 121 గ్రామాలు తౌక్టే వల్ల ఎఫెక్టయ్యాయి. తుఫాను దెబ్బకు ఇప్పటివరకు రాష్ట్రంలో ఆరుగురు చనిపోయారు. 333 ఇండ్లు, 644 పోల్స్‌‌, 147 ట్రాన్స్‌‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి. వెయ్యి మంది సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. సముద్రంలో చిక్కుకున్న నలుగురిని నేవీ హెలికాప్టర్‌‌ కాపాడింది. మరో ఐదుగురుని బోటు ద్వారా సిబ్బంది రక్షించారు. ఉడిపి జిల్లాలోని నాడా స్టేషన్‌‌ దగ్గర అత్యధికంగా 38 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కేరళలో అలలు భారీగా ఎగసి పడుతుండటంతో అనేక ఇండ్లు ధ్వంసమయ్యాయి.

గుజరాత్‌‌లో 21 పోర్టులు బంద్‌‌
సోమవారం పొద్దున 5.30 గంటలకు తౌక్టే తుఫాను అతి తీవ్రంగా మారినట్టు ఐఎండీ ప్రకటించింది. ప్రస్తుతం తుపాను పశ్చిమ వాయువ్య దిశగా గంటకు 20 కిలోమీటర్ల వేగంతో కదులుతోందని చెప్పింది. సాయంత్రం 5.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల మధ్య గుజరాత్‌‌ తీరాన్ని తాకింది. రాత్రి 12 గంటల ప్రాంతంలో పోరుబందర్‌‌, మహువా వద్ద తీరం దాటుతుందని అధికారులు అంచనా వేశారు. గుజరాత్‌‌లోని 17 జిల్లాల్లో లక్షన్నర మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆ రాష్ట్రంలోని కాండ్లా, ముండ్రా లాంటి పెద్ద పోర్టులు సహా 21 పోర్టులను మూసేశారు.

రెండు నౌకలు కొట్టుకుపోయినయ్‌‌
గాలులు, అలల ధాటికి బాంబే హై ప్రాంతంలో  నిలిపిన రెండు బార్జ్‌‌లు (సరుకు రవాణా నావలు) కొట్టుకుపోయాయి. రెండింటిల్లో 410 మంది సిబ్బంది ఉన్నారు. బాంబే హై ప్రాంతంలో 273 మంది సిబ్బందితో ఉన్న పీ305 బార్జ్‌‌.. హీరా ఆయిల్‌‌ ఫీల్డ్స్‌‌ నుంచి కొట్టుకుపోతోందని ఇన్ఫర్మేషన్‌‌ వచ్చింది. దీంతో రెస్క్యూ కోసం వార్‌‌షిప్‌‌ ఐఎన్‌‌ఎస్‌‌ కోచి బయల్దేరింది. మరో ప్రాంతంలో జీఏల్‌‌ కన్​స్ట్రక్టర్​కు చెందిన మరో నౌక ముంబై తీరంనుంచి 8 నాటికల్‌‌ మైళ్లు కొట్టుకుపోయినట్లు నేవీకి మరో ఇన్ఫర్మేష న్‌‌ అందింది. దీంతో సహాయం కోసం ఐఎన్‌‌ఎస్‌‌ కోల్‌‌కతా నౌక వెళ్లింది. అందులో 137 మంది సిబ్బంది ఉన్నారు. తుఫాను ధాటికి నౌకలకు వేసిన యాంకర్లు కొట్టుకుపోయాయని నేవీ తెలిపింది.