డెల్టా ప్లస్ వేరియంట్‌తో థర్డ్ వేవ్ ముప్పు

డెల్టా ప్లస్ వేరియంట్‌తో థర్డ్ వేవ్ ముప్పు

ముంబై: కరోనా సెకండ్ వేవ్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న భారత్‌ను మూడో వేవ్ ప్రమాదం పొంచి ఉందనే వార్తలు భయపెడుతున్నాయి. ముఖ్యంగా సెకండ్ వేవ్‌కు దెబ్బకు తీవ్రంగా ప్రభావితమైన మహారాష్ట్రలో మూడో వేవ్ మొదలవుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆ రాష్ట్రంలో గుర్తించిన డెల్టా వేరియంట్ వల్ల థర్డ్ వేవ్‌ రావొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. వీటికి మహారాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు చేస్తున్న వ్యాఖ్యలు ఊతమిచ్చేలా ఉన్నాయి. థర్డ్ వేవ్‌తో గతంలో కంటే రెట్టింపు కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయని మహారాష్ట్ర కొవిడ్ టాస్క్ ఫోర్స్, మెడికల్ ఎక్స్‌పర్ట్స్ ప్రభుత్వాన్ని అలర్ట్ చేశారు. 

‘డెల్టా ప్లస్ వేరియంట్‌ వల్ల మహారాష్ట్రలో థర్డ్ వేవ్‌‌ వచ్చే ప్రమాదం ఉంది. మూడో వేవ్ రెట్టింపు వేగంతో దూసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి’ అని సీఎం ఉద్ధవ్ ఠాక్రే అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో టాస్క్‌ఫోర్స్ అధికారులు సర్కార్‌ను హెచ్చరించినట్లు సమాచారం. ప్రజలు కరోనా ప్రోటోకాల్స్‌ను అనుసరించకపోతే సెకండ్ వేవ్ నుంచి బయటపడకముందే థర్డ్ వేవ్ ప్రవేశించొచ్చని టాస్క్‌‌ఫోర్స్ వార్నింగ్ ఇచ్చింది. వ్యాక్సినేషన్ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన వేగవంతం చేయడంతోపాటు కరోనా ప్రోటోకాల్స్‌ను తప్పనిసరిగా ఫాలో అయ్యేలా చేస్తేనే ఈ ముప్పును నివారించగలమని ముఖ్యమంత్రి ఠాక్రేకు ఆరోగ్య శాఖ అధికారులు సూచించారని తెలిసింది.