
- జనం ఆందోళనతో అట్టుడికిన థానే జిల్లా బద్లాపూర్
- రైల్వే స్టేషన్లో స్టూడెంట్స్ తల్లిదండ్రుల, స్థానికుల ధర్నా
- ట్రాక్‌లపైకి చేరుకొని రైళ్ల అడ్డగింత.. మద్దతుగా దుకాణాల బంద్
- దోషులను ఉరితీయాలని డిమాండ్.. ప్లకార్డుల ప్రదర్శన
- ప్రిన్సిపాల్ సస్పెండ్.. మరో ఇద్దరిని తొలగించిన స్కూల్ యాజమాన్యం
- ఫాస్ట్ ట్రాక్ కోర్టులో కేసు విచారణ: సీఎం ఏక్నాథ్ షిండే
థానె : మహారాష్ట్రలోని థానె జిల్లా బద్లాపూర్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఇద్దరు చిన్నారులపై స్వీపర్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. స్టూడెంట్స్ తల్లిదండ్రులతోపాటు స్థానికులు, యువత పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. స్కూల్ టాయిలెట్‌లో నాలుగేండ్ల వయసున్న ఇద్దరు చిన్నారులను స్వీపర్(23) లైంగికంగా వేధించాడు. ఆగస్టు 16న ఈ ఘటన జరగ్గా తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మరుసటిరోజు అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు అయితే, ఈ ఘటనపై మంగళవారం ఒక్కసారిగా నిరసనలు వెల్లువెత్తాయి. స్కూల్స్టూడెంట్స్తల్లిదండ్రులతోపాటు స్థానికులు, యువత బద్లాపూర్ రైల్వేస్టేషన్లో ఆందోళనకు దిగారు. అడ్డుకున్న పోలీసులపై రాళ్లదాడికి దిగారు. అందరూ పట్టాలమీదకి రావడంతో రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దోషులను ఉరితీయాలని వారు డిమాండ్ చేశారు. ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ కదంతొక్కారు. అంతకుముందు కొందరు పాఠశాలపై దాడి చేశారు. స్కూల్ గేటు, డోర్లు, కిటికీలు, అద్దాలు పగులగొట్టారు. బద్లాపూర్ బంద్‌కు పలు సంస్థలు పిలుపునిచ్చాయి.
ముగ్గురిపై స్కూల్ మేనేజ్మెంట్ చర్యలు
ఈ ఘటనకు బాధ్యులను చేస్తూ స్కూల్ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేస్తున్నట్టు యాజమాన్యం ప్రకటించింది. క్లాస్‌టీచర్, మరో సహాయకురాలిని తొలగించినట్టు వెల్లడించింది. అలాగే, ఈ ఘటనపై యాజమాన్యం క్షమాపణలు కూడా చెప్పింది. స్కూల్ ఆవరణలో నిఘాను పటిష్టం చేసినట్టు తెలిపింది.
ఫిర్యాదు తీసుకునేందుకు 11 గంటలా?
బాధిత స్టూడెంట్స్ పేరెంట్స్ ఫిర్యాదు చేసేందుకు వస్తే బద్లాపూర్ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత (కాంగ్రెస్) విజయ్ వాడెట్టివార్ మండిపడ్డారు. వారిని 11 గంటలపాటు స్టేషన్లోనే కూర్చోబెట్టారని ఆరోపించారు. దీంతో బద్లాపూర్ పోలీస్ స్టేషన్ ఇన్చార్జిని సస్పెండ్ చేసినట్టు ఉన్నతాధికారులు చెప్పారు. కాగా, బాలికలపై లైంగిక వేధింపులు జరిగిన పాఠశాల యాజమాన్యంతో బీజేపీ నేతలకు లింక్ ఉన్నదని శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్దవ్ ఠాక్రేఆరోపించారు.
ఫాస్ట్ ట్రాక్ విచారణ: సీఎం
ఈ ఘటనపై ఫాస్ట్‌ట్రాక్ విచారణ జరిపిస్తామని మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే వెల్లడించారు. అలాగే, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను అపాయింట్ చేస్తామని చెప్పారు. ఈ ఘటనలో అరెస్టయిన నిందితుడిపై రేప్ కేసు పెట్టాలని పోలీసులను ఆదేశించానని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు సంయమనం పాటించాలని ఆయన కోరారు.