ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు 50 శాతం డిస్కౌంట్

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు 50 శాతం డిస్కౌంట్

ముంబై : మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎంఎస్ఆర్టీసీ) బస్సుల్లో ప్రయాణించే మహిళలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం టికెట్  ధరలో 50 శాతం డిస్కౌంట్  ప్రకటించింది. ఈనెల 17 నుంచి ఈ రాయితీ అమల్లోకి వస్తుందని తెలిపింది. ‘మహిళా సమ్మాన్   యోజన’ కింద మహిళలకు టికెట్  ధరలో రాయితీ కల్పిస్తామని, ఈ అమౌంట్ ను కార్పొరేషన్ కు రీయింబర్స్  చేస్తామని వెల్లడించింది. రాష్ట్ర ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు 50% రాయితీ ఇస్తామని ఈ నెల 9న రాష్ట్ర బడ్జెట్​ను ప్రవేశపెడుతున్నపుడు డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి దేవేంద్ర ఫడ్నవీస్  ప్రకటించారు.

అయితే ఇప్పటిదాకా జెండర్ లింక్డ్  టికెట్లను జారీచేయకపోవడంతో ‘మహిళా సమ్మాన్  యోజన’ కింద ఎంత మంది మహిళలు లబ్ధి పొందుతారో ఇంకా తెలియరాలేదని ఆర్టీసీ అధికారులు తెలిపారు. తమ సంస్థ బస్సుల్లో జర్నీ చేసే మహిళల శాతం 35 నుంచి 40 మధ్య ఉండవచ్చని పేర్కొన్నారు. ఎంఎస్ ఆర్టీసీకి మొత్తం 15 వేల బస్సులు ఉన్నాయని, రోజూ 50 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తున్నామని వెల్లడించారు. కాగా, నిరుడు 75వ స్వాతంత్ర్య దినోత్సవాలను పురస్కరించుకుని 75 ఏండ్లు నిండిన సీనియర్  సిటిజన్లందరికీ ఎంఎస్ఆర్టీసీ టికెట్  రేటులో వంద శాతం రాయితీ ఇచ్చింది. అలాగే 65 నుంచి 74 ఏండ్ల మధ్య ఉన్నవారికి కూడా 50 శాతం డిస్కౌంట్ ఇచ్చింది.