‘మహాత్మ జనసేవన కేంద్రం’... అనాథ వృద్ధులకు నిలయం

‘మహాత్మ జనసేవన కేంద్రం’... అనాథ వృద్ధులకు నిలయం

కేరళలోని పతనంతిట్టలో  ఉన్న ‘మహాత్మ జనసేవన కేంద్రం’లో సుమారు 300 మంది అనాథ వృద్ధులు ఉంటారు. దాన్ని స్థాపించిన రాజేష్ వారి బాగోగులు దగ్గరుండి చూసుకుంటాడు. వాళ్లతో ప్రేమగా మాట్లాడతాడు. వాళ్లకు ఏ లోటు రానివ్వడు. తన టైం అంతా వాళ్లకోసమే కేటా యిస్తాడు. ‘ఇదంతా ఎందుకు చేస్తున్నావ్?’ అని అడిగితే ‘నాకు దక్కని ప్రేమని అందరికీ దక్కేలా చేస్తున్నా’ అంటాడు. అనాథలకు అండగా మారిన రాజేష్ తిరువల్ల కథలో ఎన్నో మలుపులున్నాయి. రాజేష్ బాల్యం  అస్తవ్యస్తంగా సాగింది. చిన్నతనంలోనే తల్లిదండ్రులిద్దరూ విడిపోవడంతో అమ్మానాన్నల ప్రేమను పొందలేకపోయాడు. తనకంటూ ఎవరూ లేకపోవడాన్ని చూసి భరించలేకపోయాడు. ప్రేమ కోసం తపించిపోయాడు. ఒంటరితనం ఎంత బాధిస్తుందో రాజేష్‌‌కు చిన్నప్పుడే అర్థమైంది. అందుకే పెద్దయ్యాక తనకు దక్కని ప్రేమని ఇతరులకు పంచాలనుకున్నాడు. ఓల్డేజ్ హోమ్ పెట్టి 300 మందికి అన్నీ తానే అయ్యాడు. 

అమ్మ అతిథిలా వచ్చేది

రాజేష్‌‌ది కేరళలోని కవియూర్. తనకు నెలల వయసున్నప్పుడే తల్లిదండ్రులు విడిపోయి, ఇల్లు వదిలి వెళ్లిపోయారు. దాంతో రాజేష్ అమ్మమ్మ, మామయ్యల దగ్గర పెరిగాడు. మామయ్యలు ఎప్పుడూ తాగి, గొడవ చేస్తూ ఉండేవాళ్లు. అది చూసి భయపడి పొదల్లో దాక్కునేవాడు రాజేష్. ఇంట్లో రాజేష్‌‌ను ఎవరూ పట్టించుకునేవాళ్లు కాదు. అయినా తన పనులు తానే చూసుకునేవాడు. గవర్నమెంట్ స్కూల్‌‌కు వెళ్లి చదువుకునేవాడు. అప్పుడప్పుడు పొలం పనులకు వెళ్లేవాడు. రాజేష్ వాళ్ల అమ్మ రెండు మూడేండ్లకొకసారి అతిథిలా వచ్చి వెళ్లేది. అమ్మ రాక కోసం రాజేష్​ ఎదురుచూస్తూ ఉండేవాడు. అలా కొన్నేండ్లకు రాజేష్ టెన్త్ క్లాస్ పూర్తయింది. అప్పటికి వాళ్ల అమ్మ ఇంటికి వచ్చి చాలా ఏండ్లు అయింది. రాజేష్ ఆరా తీయగా వాళ్ల అమ్మ రెండో పెండ్లి చేసుకుందని తెలిసింది. పదహారేళ్ల రాజేష్ ఆ విషయాన్ని భరించలేకపోయాడు. టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ పట్టుకుని ఊరి విడిచి వెళ్లిపోయాడు. ఎలాగైనా వాళ్ల నాన్నను వెతకాలి అనుకున్నాడు. కానీ వాళ్ల నాన్నకు కూడా పెండ్లి అయి, పిల్లలు ఉన్నారని తెలియడంతో అతడి మనసు ముక్కలైంది.

సోషల్ వర్కర్‌‌‌‌గా..

ఇల్లు విడిచి వచ్చేసిన రాజేష్ తన దగ్గరున్న సర్టిఫికెట్‌‌తో అక్కడా ఇక్కడా పని వెతకడం మొదలుపెట్టాడు. కేరళనే కాకుండా కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలన్నీ తిరిగాడు. కూలి పనులు చేస్తూ కాలం గడిపేవాడు. దొరికిన చోట పని చేస్తూ, పని దొరకని చోట ఉచితంగా సేవ చేస్తూ తిరిగేవాడు. అలా అతనికి సేవ చేయడం ఒక అలవాటుగా మారింది. అదే టైంలో తనలాగే ఆలోచించే కొందరు ఫ్రెండ్స్ పరిచయమయ్యారు అతనికి. వాళ్లంతా కలిసి అప్పుడప్పుడు చిన్నచిన్న సేవా కార్యక్రమాలు చేసేవాళ్లు. అలా కొంతకాలానికి పని వెతకడం ఆపేసి, సేవా కార్యక్రమాల కోసం విరాళాలు, సాయం కోసం తిరగడం మొదలుపెట్టారు. అలా కొన్నేండ్లలో రాజేష్ సోషల్ వర్కర్‌‌‌‌గా మారాడు.

కుటుంబంతో కలిసి

ప్రస్తుతం రాజేష్ పతనంతిట్టలోని అదోర్‌‌‌‌లో  ‘మహాత్మ జనసేవన కేంద్రం’ నడుపుతున్నాడు. అందులో 300 మంది ముసలివాళ్లు, అనాథలు, వితంతువులు, వాళ్ల పిల్లలు ఉంటారు. రాజేష్‌‌తో పాటు అతని భార్య, నలుగురు పిల్లలు కూడా అక్కడే పనిచేస్తారు. ‘కుటుంబం ఉన్నా అనాథగా పెరిగిన నాకు ఇంత పెద్ద కుటుంబం ఏర్పడుతుందని ఎప్పుడూ అనుకోలేద’ని, ‘జీవితం భారంగా మారిన టైంలో సేవ చేయడం  ఎంతో ఊరట నిచ్చింద’ని అంటాడు రాజేష్.

చిన్నతనమంతా ఎదురుచూపులే..

“నా జీవితంలో ఏదీ నేను అనుకున్నట్టు జరగలేదు. చిన్నతనమంతా ఎదురుచూపులు, దుఃఖంతోనే గడిచింది. అమ్మానాన్నల ప్రేమ ఎలా ఉంటుందో నాకు తెలియదు. కానీ, బతుకుదెరువు కోసం పని వెతుకుతున్నప్పుడు  పేదల కోసం నిస్వార్థంగా సేవ చేస్తున్న కొంతమందిని చూశా. ‘నేను ఎలాగూ ప్రేమను పొందలేకపోయా. కనీసం ఇతరులకైనా నా ప్రేమను పంచాలి’ అనుకున్నా. అప్పుడే డిసైడ్ అయ్యా జీవితాంతం సేవా కార్యక్రమాలు చేస్తూ గడపాలని. అలా మొదలైందే మహాత్మ జనసేవన కేంద్రం. ఇక్కడ మా ఫ్యామిలీతో పాటు 50 మంది ఉద్యోగులు, 120 మంది వలంటీర్లు ఉన్నారు.  మా ఛారిటీ గురించి తెలిసిన చాలామంది డాక్టర్లు, ఐఏఎస్‌‌లు మాకు సాయం చేస్తుంటారు. ఇక్కడ కొవ్వొత్తుల తయారీ కేంద్రం కూడా ఉంది. దాన్నుంచి కొంత ఆదాయం వస్తుంది. ఇక్కడ వృద్ధుల ఆరోగ్యంతో పాటు, పిల్లల చదువులు, వాళ్ల పెండ్లిండ్లు కూడా మేమే చూసు కుంటాం. ఎందుకంటే వీళ్లే నా ఫ్యామిలీ కదా!”

- రాజేష్