టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నేటితో క్లోజ్

టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నేటితో క్లోజ్

హైదరాబాద్, వెలుగు : మహబూబ్​నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ సెగ్మెంట్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రం 4 గంటలకు ముగియనుంది. వారం రోజులుగా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో జరుగుతున్న టీచర్ల ఆత్మీయ సమ్మేళనాలు శుక్రవారంతో ముగిశాయి. ఇక అభ్యర్థులంతా ఇంటర్నల్ ప్రచారంపై ఫోకస్ పెడుతున్నారు. పోలింగ్​కు రెండ్రోజులే గడువు ఉండటంతో అభ్యర్థుల్లో  టెన్షన్ మొదలైంది.  

ప్రధాన పోటీ ఐదారుగురి మధ్యనే

ఈ నెల 29తో టీచర్ ఎమ్మెల్సీ జనార్దన్​ రెడ్డి పదవీ కాలం ముగియనుండటంతో ఎన్నికల కమిషన్ గత నెల16న నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నెల13న పోలింగ్, 16న ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెలువడనున్నాయి. కాగా, సెగ్మెంట్ పరిధిలో 29,720 మంది ఓటర్లుండగా వీరిలో 14,246 మంది మహిళలు,15,472 మంది పురుషులు, ఇతరులు మరో ఇద్దరున్నారు. ఎన్నికల బరిలో 21 మంది ఉండగా, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అధికారికంగా అభ్యర్థులను ప్రకటించాయి. బీజేపీ అభ్యర్థిగా ఏవీఎన్​రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా హర్షవర్ధన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. వీరితో పాటు సిట్టింగ్ ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి పీఆర్టీయూటీ తరఫున పోటీ చేస్తుండగా, పీఆర్టీయూ అభ్యర్థి చెన్నకేశవరెడ్డి, యూటీఎఫ్ అభ్యర్థి మాణిక్ రెడ్డి, ఎస్టీయూ అభ్యర్థి భుజంగరావు, టీపీటీఎఫ్​ అభ్యర్థి వినయ బాబు, బీసీటీఏ అభ్యర్థి విజయ్ కుమార్, సంతోష్ ​కుమార్ తదితరులు బరిలో ఉన్నారు. అయితే, ప్రధానమైన పోటీ మాత్రం ఐదారుగురి మధ్యలోనే ఉండనుంది. 

137 పోలింగ్ స్టేషన్లు

ఎన్నికకు 137 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో 15,  నాగర్ కర్నూల్ 14, వనపర్తి 7, జోగులాంబ గద్వాల్, నారాయణ పేట్ 5, రంగారెడ్డి 31, వికారాబాద్ 18, మేడ్చల్ మల్కాజ్ గిరి 14, హైదరాబాద్ జిల్లాలో 22 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు.