ఫైనాన్స్​ కంపెనీ వేధింపులు ఎక్కువైనయ్.. మధిరలో ఆఫీస్​ ముందు బాధితుల నిరసన

ఫైనాన్స్​ కంపెనీ వేధింపులు ఎక్కువైనయ్.. మధిరలో ఆఫీస్​ ముందు బాధితుల నిరసన

మధిర, వెలుగు: మధిరలోని మహేంద్ర ఫైనాన్స్ కంపెనీ వేధింపులు ఎక్కువయ్యాయని బాధితులు బుధవారం కంపెనీ ఆఫీసు ముందు ఆందోళనకు దిగారు. రైతు సంఘం జిల్లా నాయకులు మందా సైదులు, శీలం నరసింహారావు పాల్గొని వారికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేయకపోవడంతో రైతులు అప్పులపాలై అవమానాలు ఎదుర్కొంటున్నారన్నారు. అధిక వడ్డీలకు అప్పు తీసుకుని తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

మహేంద్ర ఫైనాన్స్ కంపెనీ సిబ్బంది రైతులను వేధిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఎవరైనా కిస్తీలు కట్టకపోతే చట్టపరంగా వ్యవహరించాలి కానీ.. రైతుల ఇండ్లకు వెళ్లి అందరి ముందు అవమానకరంగా మాట్లాడడం, బెదిరించటం కరెక్ట్​కాదన్నారు. ఒకటి, రెండు కిస్తీలు లేట్​అయినందుకు ఇటీవల ఖమ్మంపాడు గ్రామానికి చెందిన ఓ మహిళ రైతును ఇబ్బందులకు గురిచేశారని చెప్పారు. సంబంధిత అధికారులు స్పందించి ఇష్టారీతిన వ్యవహరిస్తున్న ఫైనాన్స్​కంపెనీ గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్, సీఐటీయూ మండల కన్వీనర్ మురళి, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మధు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.