
న్యూఢిల్లీ: జపాన్‌కు చెందిన సుమిటోమో కార్పొరేషన్, ఇసుజు మోటార్స్ లిమిటెడ్ నుంచి ఎస్‌ఎంఎల్ ఇసుజు లిమిటెడ్‌లో 58.96శాతం నియంత్రణ వాటాను మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ (ఎం అండ్ ఎం) కొనుగోలు చేసింది. డీల్ విలువ రూ.555 కోట్లు. ఒక్కో షేరుకు రూ.650 చెల్లించి ఈ వాటాను కొనుగోలు చేసింది.
సెబీ టేకోవర్ రెగ్యులేషన్స్ ప్రకారం, పబ్లిక్ షేర్‌హోల్డర్ల నుంచి 26శాతం ఈక్విటీని కొనేందుకు ఎం అండ్ ఎం ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించాలి. ఎస్‌ఎంఎల్ ఇసుజులో మెజార్టీ వాటా కొనడంతో కంపెనీ 3.5 టన్నుల కంటే ఎక్కువ ఉండే కమర్షియల్ వెహికల్ (సీవీ) సెగ్మెంట్‌లో మరింతగా విస్తరించడానికి వీలుంటుంది.
ప్రస్తుతం ఈ సెగ్మెంట్‌లో ఎం అండ్ ఎంకు 3శాతం మార్కెట్ వాటా ఉంది. తాజా డీల్‌తో తన వాటాను వెంటనే 6 శాతానికి రెట్టింపు చేయాలని, 2030–31 నాటికి 10–-12శాతానికి, 2035–36 నాటికి 20 శాతానికి పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. కాగా, కంపెనీ 3.5టన్నుల కంటే తక్కువ సైజ్ అయిన లైట్ సీవీ సెగ్మెంట్‌లో 54.2శాతం వాటాతో లీడర్‌గా కొనసాగుతోంది. డీల్ పూర్తయ్యాక ఎస్‌ఎంఎల్ ఇసుజు పేరు ఎస్‌ఎంఎల్ మహీంద్రా లిమిటెడ్‌గా మారుతుంది.